MLC Ponguleti Sudhakar Reddy
-
‘టీఆర్ఎస్ పని శూన్యం.. ప్రచారం ఘనం’
సాక్షి, హైదారాబాద్: ‘తెలంగాణలో విద్యను వ్యాపారంగా మార్చారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపైన చర్యలు తీసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని* కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజుల నియంత్రణ విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరితో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తితో ఉన్నారని పొంగులేటి పేర్కొన్నారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడమే పరమావధిగా మారిన ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో ప్రభుత్వం..! కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. వాటి నియంత్రణపై రూపొందించిన నియమ నిబంధనలు, జీఓలను ప్రభుత్వం కావాలనే అటకెక్కించిందని ఆయన ధ్వజమెత్తారు. సీఎం స్పందించాలి.. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పొంగులేటి అన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం కల్పించుకొనే ప్రభుత్వానికి... చిత్తశుద్ధి ఉంటే ఫీజుల నియంత్రణపై వెంటనే కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ సాధిస్తామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారి ఆయన వ్యాఖ్యానించారు. -
నాకే ఇలా.. సామాన్యుడి పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్ : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు నెహ్రూ హయాం నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఎంతో కృషి చేశాయని, తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు సమస్యలపై నాలుగేళ్లుగా గాఢ నిద్రలో ఉండి ఇప్పుడు రైతుబంధు పథకం అంటూ హడావిడి చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల సమస్యలన్నింటికీ జిందా తిలిస్మాత్ అన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు పథకాన్ని పది ఎకరాలలోపు వాళ్లకు అమలు చేస్తూనే.. కౌలు రైతులను ఆదుకునే విధంగా రైతుబంధు విధివిధానాలను రూపొందిస్తే రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడినట్లుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకం నమోదులో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘దేవాలయ, ప్రభుత్వానికి చెందిన స్థలాలు ప్రైవేట్ వక్తులకు చెందిన పట్టాదారు పుస్తకాల్లో నమోదైన సంఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల జరిగాయి. ఈ తరహా సంఘటనల వెనుక భారీ కుంభకోణం దాగి ఉంది. అంతేకాక ఖమ్మం జిల్లా నారాయణపురంలోని నా స్వంత భూమిలోని సర్వేనెంబర్ 351/12/1, సర్వే నెంబర్116లు కొత్త పాస్ బుక్‌లో ఎంట్రీ కాలేదు. అయినా కూడా నాకు రైతు బంధు చెక్‌లు వచ్చాయి. నాకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి. నేను రైతుబంధు చెక్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాను. ప్రభుత్వ భూములకు కూడా తప్పుడు ఎంట్రీలతో చెక్‌లు డ్రా చేస్తున్నారు. అటవీ భూముల, దేవాదాయ శాఖ భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు వస్తున్నాయి. భూప్రక్షాళనలపై పూర్తిస్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉంది. అక్రమాలపై రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో మండలస్థాయిలో రివ్యూలు పెట్టాలి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల’ని పొంగులేటి వ్యాఖ్యానించారు. ‘ఐదు లక్షల రూపాయల బీమాలో ఎల్ఐసీ నియమాలపై దృష్టి సారించండి. విభజన చట్టాన్ని సాధించుకోవడంలో కేసీఆర్ అలసత్వం చేస్తున్నారు. షీలాబేడీ కమిటీ ఇచ్చిన నివేదిక విభజన చట్టంలోని అంశాలకు విరుద్ధంగా ఇచ్చారు. సింగరేణికి 81 శాతం వాటాలున్న ఏపీ హెచ్ఎంఈఎల్ను (ఏపీ భారీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ఏపీకి చెందేలా షీలాబేడీ కమిటీ నివేదిక ఇవ్వడం సరికాదు. ఈవిధంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నా కేసీఆర్ ఎందుకు స్పందించరు. కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయడానికి ముందే వెళ్లి కలవడం కిలాడీ రాజకీయాల్లో భాగం. అటు జేడీఎస్ మెప్పుకోసం.. ఇటు బీజేపీకి బాధ కలగకూడదని కేసీఆర్ ఇలా చేస్తున్నార’ని తీవ్రంగా విమర్శించారు. -
రాజకీయ ప్రయోజనాల కోసమే..
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాలే ప్రధానమన్న రీతిలో పంచాయతీరాజ్ చట్టానికి టీఆర్ఎస్ సవరణలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మె ల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, సర్పంచ్ ఎన్నికను పరోక్ష పద్ధతికి మార్చా లని టీఆర్ఎస్ భావించడం సరికాదన్నారు. సవరణల విషయమై అఖిలపక్ష నేతలు, రాజ్యాంగ నిపుణులతో కమిటీని వేసి సమగ్రంగా చర్చించాలని సూచించారు. -
ఉరితీయాలన్నోళ్లే వచ్చారు.. ఇప్పుడు రేవంత్!
సాక్షి, హైదరాబాద్ : గతంలో రాజీవ్‌గాంధీని ఉరితీయాలని మాట్లాడినవాళ్లు కూడా తర్వాతి కాలంలో పార్టీలో చేరి ఉన్నత పదవులు పొందిన చరిత్ర కాంగ్రెస్‌లో ఉందని, హైకమాండ్ ఆదేశానుసారం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే రావచ్చునని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ హాలులో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మా పార్టీలోకి వస్తున్నారని అధికారికంగా ఎవరు చెప్పలేదు. పార్టీకి లాభం చేకూరేలా ఎవరు వచ్చినా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అయితే, గతంలో పార్టీపై చేసిన విమర్శలకు చింతిస్తున్నామని చెప్పి వస్తే కార్యకర్తలు హర్షిస్తారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో రాజీవ్‌గాంధీని ఉరితీయాలని మాట్లాడిన నేతలు కూడా పార్టీలో ఉన్నత పదవులు పొందిన చరిత్ర కాంగ్రెస్‌లో ఉంది’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు. రిపోర్టును అసెంబ్లీ ముందు పెట్టాలి : అక్టోబర్ 27 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పొంగులేటి కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తన ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో సీఎం కేసీఆర్ ఎందుకు రాజీపడుతున్నారని ప్రశ్నించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న ఖమ్మం జిల్లాను ముంచి కడుతున్న పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలుపై సర్కార్ దృష్టి సారించాలని పొంగులేటి సూచించారు. -
'ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్ : భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రభుత్వానికి మరో చెంపపెట్టు అని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ నేతలు సెక్షన్-40కి కూడా వక్రభాష్యం చెబుతున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు అనుమతి లేదని కేంద్ర మంత్రి, పార్లమెంటు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. ఈ విషయంలో కేసీఆర్ లాబీయింగ్ ఏమైందని ప్రశ్నించారు. మోదీతో ప్రేమ సంబంధాలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రం తన జాగీరులా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిగా గాలికొదిలేశారని, పోలవరం నిర్మాణంపై కేసీఆర్ ఎందుకు నోరుమెదపరో ప్రజలకు సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. ముంపు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రంలో మోదీ..రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారని పొంగులేటి విమర్శించారు. -
ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి
హైదరాబాద్: బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు అశనిపాతంలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నీటి పంపకాల వివాదంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వల్ల తెలంగాణకు తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణం అఖిలపక్షాన్ని పిలిచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పొంగులేటి సుధాకర్ విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్‌లో పొత్తుల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో శాసన మండలికి జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో జిల్లా నేతల మధ్య పంచాయితీలకు తెరలేపుతున్నాయి. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ఒక జిల్లా నేతలు కోరుకుంటుండగా... అధికార పార్టీతో ప్రధాన ప్రతిపక్షం ఎలా జతకడుతుందని మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, వామపక్షాలతో సర్దుకుందామని ఒక నేత వాదిస్తే... సర్దుకుపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఏముంటుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పొత్తులపై ఎవరికివారే చర్చలు జరుపుతూ, ఎవరికివారే మాట్లాడితే పార్టీ రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలుగుతుందంటూ కొందరు నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర పార్టీ ముఖ్యులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీని అధిష్టానం పెద్దలు ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు కూడా. అయితే రాష్ట్ర నేతలతో చర్చించిన తరువాత అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. టీపీసీసీ సమన్వయ కమిటీలోనే చర్చించుకుని, ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. జిల్లా స్థాయిలో అవగాహనే... పొత్తులపై రాష్ట్ర స్థాయిలో నిర్దిషంగా ఒక విధానాన్ని ప్రకటించడానికి టీపీసీసీ వెనుకాడుతోంది. ఒక్కొక్క జిల్లాలో పరిస్థితి ఒక్కోలా ఉండటంతో... జిల్లాల వారీగా, అవకాశం మేరకు లోపాయికారీ సర్దుబాట్లకు అనుమతించాలని భావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్తో అవగాహనకు సిద్ధమేనని ఆ జిల్లా నేతలు ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డితో సహా డీకే అరుణ, జి.చిన్నారెడ్డి వంటి అగ్రనేతలంతా సమావేశమై టీఆర్ఎస్తోనైనా, టీడీపీతోనైనా అవగాహనకు సిద్ధమేనని పార్టీ సమావేశంలో నిర్ణయించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఒక స్థానం వస్తుందని, దానికోసం ఎవరు కలసి వచ్చినా అభ్యంతరం లేదని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో భిన్నమైన పరిస్థితి ఉంది. సీపీఐతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీకి ఎలా విడిచిపెడతారని ఖమ్మం జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశ్యమని ఆ జిల్లాకు చెందిన మల్లు భట్టివిక్రమార్క హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షంగా టీడీపీ బలపడడానికి అవకాశమిస్తే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎలా బలపడుతుందని అదే జిల్లాకు చెందిన ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో టీడీపీతో కలిస్తే కాంగ్రెస్‌కు ఒక స్థానం దక్కుతుంది. ఇక్కడ టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని ఆ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ప్రకటిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డిల సొంత జిల్లా నల్లగొండలో మరో రకమైన పరిస్థితి ఉంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. కానీ చాలా మంది స్థానిక సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. దాంతో ఇప్పుడా జిల్లాలో ఎవరి బలం ఎంతో తేలని గందరగోళ పరిస్థితి. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన తన చిరకాల ప్రత్యర్థి చిన్నపరెడ్డి ఎన్నికకాకుండా అడ్డుకోవడానికి జానారెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా అంతర్గత సర్దుబాట్లకు అవకాశమిచ్చి, టీపీసీసీ స్థాయిలో జోక్యం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అర్థవంతమైన పొత్తులే మేలు: ఎమ్మెల్సీ పొంగులేటి ఒకవేళ పొత్తులు ఉంటే అర్థవంతంగా, భవిష్యత్తులో పార్టీకి నష్టం లేకుండా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. పొత్తులపై స్పష్టమైన నిర్ణయం జరిగేదాకా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడటం మంచిదికాదన్నారు. -
అసంతృప్తిని చూడకుండా బెదిరింపులా: ఎమ్మెల్సీ పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై నిరసన వ్యక్తం చేసిన రైతులో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని, అతని ఆగ్రహానికి కారణాలను చూడకుండా ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతాంగంలో ఉన్న ఆక్రోశం, ఆగ్రహం, అసంతృప్తికి సూచికగా కడియం శ్రీహరిపై నిరసన వ్యక్తం చేశారనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలన్నారు. టీఆర్ఎస్ ధనబలంతో, అధికారబలంతో ఉప ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతోందని.. ఈ ఎన్నికలపై వీడియోలతో నిఘాను ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌కు సుధాకర్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. -
దొందూ దొందే
ప్రజలను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం ఏఐసీసీ సభ్యులు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఎద్దేవా చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు గుప్పిం చి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దొం దూ దొందేగా మిగిలారని ఏఐసీసీ సభ్యులు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ఏడాది వ్యవధిలోనే ప్రజలు తిరస్కరించే స్థాయికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నైలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మోదీ కాశీపట్నం చూడరబాబు అంటూ మ్యాజిక్కులు చేస్తున్నారేగానీ ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మేలు ఏదీ లేదని అన్నారు. గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయలేదన్నట్లుగా విదేశాల్లో ప్రచారం చేయడం, మేక్ ఇన్ ఇండియా అంటూ అంతా తానే చేస్తున్నట్లుగా వ్యవహరించడం క్షంతవ్యం కాదని అన్నారు. విదేశీపర్యటనల్లో మోదీ ఒక ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. మోదీ విదేశీ పర్యటనల వల్ల భారత్ ఇమేజ్ పెరగకపోగా డామెజ్ అవుతోందని వ్యాఖ్యానించారు. *1.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలకు కోతపెట్టడమేనా గుజరాత్ పాలనను మోదీని నిలదీశారు. శ్రీనగర్‌లో బీజేపీ ప్రభుత్వ మిత్రపక్ష ప్రభుత్వం పాకిస్థాన్ జెండాను ఎగురవేయడమేనా మోదీ దేశభక్తి అంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వాటా నిధులు కోటాయించకుండా మోసిగిస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు, మోదీ ఇద్దరూ రైతు ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారు, ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించాలనే విషయంలో మోదీ, సాధించాలనే అంశంలో బాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రజల ఆదరణ కోల్పోయారని అన్నారు.రైతుల బాగోగులు పట్టించుకోనందునే తెలంగాణలో 900 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు.