ఐవైఆర్ తొలగింపు దారుణం
బ్రాహ్మణ కార్పొరేషన్ టీడీపీ అనుబంధ సంస్థకాదు
ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ధ్వజం
సింహాచలం (పెందుర్తి): బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఐవైఆర్ కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం నీచాతినీచమైన చర్య అని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.ఎల్.ఎన్. శ్రీనివాస్ మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో మంగళవారం సాయంత్రం ఆయన పలువురు బ్రాహ్మణ ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా కృష్ణారావు నిష్పక్షపాతంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, అవినీతికి, సిఫార్సులకు ఆస్కారం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తులు పెట్టి ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని కుంటిసాకులు చెప్పి తొలగించడం బాధాకరమన్నారు. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు చాలా దారుణమన్నారు.
ఫేస్బుక్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షేర్ చేశారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారని, విశాఖలో జరిగిన మహానాడుకు ఆయన రాలేదని, కోన రఘుపతి ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజరయ్యారని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు యావత్ బ్రాహ్మణ సమాజానికి బాధ కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ఐవీఆర్ సేవలను గుర్తించి ఆయనను చైర్మన్గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకమై తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో విశాఖ జిల్లా బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు చరణ్ తదితరులు పాల్గొన్నారు.