Mobile app developers
-
‘బుల్లి బాయ్’ సృష్టికర్త అరెస్ట్
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్’ యాప్ సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన నీరజ్ బిష్ణోయ్ (21) ఈ యాప్‌ను తయారు చేశాడని, అతనే ఈ కేసుకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం అస్సాంలోని నీరజ్ సొంతూరు జోర్హత్‌లో ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) బలగాలు అతనిని అదుపులోనికి తీసుకొని ఢిల్లీకి తీసుకువచ్చాయి. పోలీసులు జరిపిన విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్టుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్ ప్రధాన నిందితురాలిగా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరజ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోబీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గిట్‌హబ్ ప్లాట్‌ఫారమ్‌లో బుల్లి బాయ్ యాప్ తయారు చేసి దానికి సంబంధించిన ప్రధాన ట్విట్టర్ అకౌంట్ అతనే నడుపుతున్నాడని ఐఎఫ్‌ఎస్‌ఒ డిప్యూటీ కమిషనర్ కేపీఎస్ మల్హోత్రా మీడియాకి చెప్పారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్), ఇతర గేట్ వేల సహాయంతో అతని జాడని కనిపెట్టామని చెప్పారు. నీరజ్ ల్యాప్‌టాప్‌లో కూడా ఈ యాప్‌ని తయారు చేసినట్టుగా ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయని తెలిపారు. -
గూగుల్‌తో పేటీఎం ఢీ..!
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్‌తో తలపడేందుకు దేశీ ఈ–కామర్స్ చెల్లింపుల సంస్థ పేటీఎం సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా తాజాగా దేశీ డెవలపర్ల కోసం ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను ఆవిష్కరించింది. తమ యాప్‌లో అంతర్గతంగా మినీ–యాప్స్‌ను లిస్టింగ్ చేయడానికి ఎటువంటి చార్జీలు ఉండబోవని తెలిపింది. అలాగే, యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్–బ్యాంకింగ్, కార్డులు మొదలైన వాటి ద్వారా చెల్లింపులు జరిపేలా డెవలపర్లు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వొచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై మాత్రం 2 శాతం చార్జీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ స్టోర్ బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. డెకాథ్లాన్, ఓలా, పార్క్‌ప్లస్, ర్యాపిడో, నెట్‌మెడ్స్, 1ఎంజీ, డోమినోస్ పిజ్జా, ఫ్రెష్‌మెనూ, నోబ్రోకర్ వంటి 300 పైచిలుకు యాప్ ఆధారిత సర్వీసుల సంస్థలు ఇప్పటికే ఇందులో చేరినట్లు పేటీఎం తెలిపింది. ‘ప్రతీ భారతీయ యాప్ డెవలపర్‌కూ సాధికారత కల్పించేలా పేటీఎం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం‘ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం యూజర్లు ప్రత్యేకంగా ఆయా యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, తమకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ల ద్వారా చెల్లింపులు చేసే వీలుంటుందని పేర్కొన్నారు. పరిమిత స్థాయిలో డేటా, ఫోన్ మెమరీ గల యూజర్లకు ఇలాంటి మినీ యాప్స్ ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. గూగుల్‌తో వివాదం.. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల విభాగంలో గూగుల్‌తో పేటీఎం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో నిబంధనలకు విరుద్ధంగా క్రీడల బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ సెప్టెంబర్ 18న పేటీఎం యాప్‌ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి కొన్ని గంటలపాటు తొలగించింది. సదరు ఫీచర్‌ను తొలగించిన తర్వాతే మళ్లీ ప్లేస్టోర్‌లో చేర్చింది. గూగుల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, పోటీ సంస్థలను అణగదొక్కేందుకే ఇలాంటి పక్షపాత విధానాలు అమలు చేస్తోందని పేటీఎం ఆరోపించింది. ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్స్‌పై గూగుల్‌కు గుత్తాధిపత్యం ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో గూగుల్ తమ విధానాలపై వివరణనిచ్చింది. ప్లే స్టోర్ ద్వారా డిజిటల్ కంటెంట్ విక్రయించే యాప్స్ కచ్చితంగా గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్‌నే ఉపయోగించాలని, ఇన్–యాప్ కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట శాతం ఫీజుగా చెల్లించాల్సిందేనని పేర్కొంది. దీనిపై డెవలపర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో భారత్‌లోని డెవలపర్లు.. ప్లే బిల్లింగ్ సిస్టమ్‌తో తమ యాప్‌లను అనుసంధానించేందుకు గడువును 2020 మార్చి 31 దాకా పొడిగించింది. ఫ్లిప్‌కార్ట్‌తో జట్టు.. పండుగ సీజన్ నేపథ్యంలో పేటీఎంతో చేతులు కలిపినట్లు ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసే యూజర్లు.. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొంది. అంతేగాకుండా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు తమ పేటీఎం వ్యాలెట్లలో తక్షణ క్యాష్‌బ్యాక్ పొందవచ్చని వివరించింది. అక్టోబర్ 16 నుంచి 21 దాకా ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్ నిర్వహిస్తుండగా, ఆ సంస్థలో భాగమైన ఫ్యాషన్ విభాగం మింత్రా కూడా అక్టోబర్ 16 నుంచి 22 దాకా ’బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ నిర్వహిస్తోంది. అటు, మ్యాక్స్ ఫ్యాషన్‌తో కూడా జట్టు కట్టినట్లు మింత్రా మరో ప్రకటనలో వెల్లడించింది. -
యాప్ డెవలపర్లకు ఫేస్బుక్ తోడ్పాటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ యాప్ డెవలపర్లకు తోడ్పాటు అందించే దిశగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎఫ్‌బీస్టార్ట్ ప్లాట్‌ఫాంకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటిదాకా 137 దేశాలకు చెందిన 9,000 మంది పైచిలుకు డెవలపర్లు ఉపయోగించుకున్నట్లు ఫేస్బుక్ ఇండియా ప్రోడక్ట్ పార్ట్నర్షిప్స్ విభాగం అధిపతి సత్యజిత్ సింగ్ తెలిపారు. ఎఫ్‌బీస్టార్ట్ కింద కొత్తగా జోడించిన వాటితో కలిపి మొత్తం 25 సర్వీసులను అందిస్తున్నామన్నారు. వీటి విలువ సుమారు 80,000 డాలర్ల దాకా ఉంటుందని చెప్పారు. ఎఫ్‌బీస్టార్ట్ ప్లాట్‌ఫాంను డెవలపర్లకు చేరువ చేసే దిశగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సింగ్ ఈ విషయాలు చెప్పారు. చండీగఢ్, ముంబై తదితర 8 నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినూత్నమైన ఐడియాలను డెవలపర్లు మెరుగైన యాప్ కింద మల్చుకుని, తర్వాత దశల్లో స్టార్టప్‌లను కూడా ఏర్పాటు చేసుకుని ఎదిగేందుకు ఎఫ్బీస్టార్ట్లోని సర్వీసులు ఉపయోగపడగలవని సింగ్ వివరించారు. హెల్త్ స్టార్టప్ మైచైల్డ్, క్యాష్‌బాక్ సంస్థ లాఫలాఫా మొదలైనవి వీటిని ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు. -
యాప్ డెవలపర్స్‌కు ఫేస్బుక్ తోడ్పాటు
హైదరాబాద్: మొబైల్ యాప్ డెవలపర్లకు తోడ్పాటు అందించే దిశగా ఫేస్బుక్ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎఫ్బీ స్టార్ట్ ప్లాట్‌ఫాంకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటిదాకా 137 దేశాలకు చెందిన 9,000 మంది పైచిలుకు డెవలపర్లు ఉపయోగించుకున్నట్లు ఫేస్బుక్ ఇండియా ప్రొడక్ట్ పార్ట్నర్షిప్స్ విభాగం అధిపతి సత్యజిత్ సింగ్ తెలిపారు. ఎఫ్బీ స్టార్ట్ కింద కొత్తగా జోడించిన వాటితో కలిపి మొత్తం 25 సర్వీసులను అందిస్తున్నామన్నారు. వీటి విలువ 80,000 డాలర్ల దాకా ఉంటుందని చెప్పారు. ఎఫ్‌బీస్టార్ట్ ప్లాట్‌ఫాంను డెవలపర్లకు చేరువ చేసే దిశగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సింగ్ ఈ విషయాలు చెప్పారు. కొచ్చి, చెన్నై, ముంబై తదితర 8 నగరాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినూత్నమైన ఐడియాలను డెవలపర్లు మెరుగైన యాప్ కింద మల్చుకుని, తర్వాత దశల్లో స్టార్టప్‌లను కూడా ఏర్పాటు చేసుకుని ఎదిగేందుకు ఎఫ్బీస్టార్ట్లోని సర్వీసులు ఉపయోగపడగలవని సింగ్ వివరించారు. హెల్త్ స్టార్టప్ మైచైల్డ్, క్యాష్‌బాక్ సంస్థ లాఫలాఫా మొదలైనవి వీటిని ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లోని టాప్ యాప్‌లలో సుమారు 75 శాతం అప్లికేషన్స్.. ఫేస్‌బుక్‌తో అనుసంధానమయ్యాయని సింగ్ చెప్పారు. -
‘మొబైల్10ఎక్స్’ను ఆవిష్కరించిన ఐఏఎంఏఐ
న్యూఢిల్లీ: మొబైల్ యాప్ డెవలపర్ల వృద్ధికి దోహదపడే విధంగా మొబైల్ ఇంటర్నెట్ సమాఖ్య ఐఏఎంఏఐ ‘మొబైల్10ఎక్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 50 వేలుగా ఉన్న మొబైల్ యాప్ డెవలపర్ల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షలకు చేర్చడం... అలాగే మొబైల్ యాప్ విభాగం ఆదాయాన్ని రూ.1000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచటమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి గూగుల్ ఇండియా, పేటీఎం సంస్థలు ప్రారంభ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఐఏఎంఏఐ ఈ కార్యక్రమం కింద వచ్చే ఐదేళ్లలో ఐదు మొబైల్ స్టార్టప్ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. వీటిని బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, పుణే/ముంబై పట్టణాల్లో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రాయ్ తెలిపారు. వీటిల్లో డెవలపర్లు స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి అవసరమైన టెస్టింగ్ ల్యాబ్, డిజైన్ ల్యాబ్, కెపాసిటీ బిల్డింగ్ వంటి తదితర సౌలభ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమం కింద 5 లక్షల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆండ్రాయిడ్, ఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై శిక్షణను ఇస్తామని తెలిపారు. భారత్‌లో యాప్ డెవలప్మెంట్కు మంచి అవకాశాలు ఉన్నాయని గూగుల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆనందన్ పేర్కొన్నారు.