తోడుడు : ఉ॥7- సా॥5 గం.
అక్రమ తవ్వకాలు, రవాణాకు చెక్
నూతన మార్గదర్శకాలు ఖరారు
నాలుగు శాశ్వత, మూడు మొబైల్ చెక్‌పోస్టుల ఏర్పాటు
అవినీతి అధికారులు, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారిన ఇసుక తవ్వకం, రవాణా విషయంలో జిల్లా యంత్రాంగం కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసింది. ప్రభుత్వ నిర్మాణాలకు అవసరాల పేరిట ఇష్టారాజ్యంగా జరుగుతున్న అక్రమాలకు తెరవేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. రాత్రిపూట ఇసుక రవాణాపై నిషేధం విధించింది. అక్రమ రవాణా నియంత్రణకు సంబంధించి రెవెన్యూ, పోలీసులతోపాటు ఇంజనీరింగ్ శాఖను బాధ్యులను చేసింది. ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉన్న ప్రదేశాల్లో నాలుగు శాశ్వత, మూడు మొబైల్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. చెక్‌పోస్టు ల్లో జరిగే అక్రమాల నియంత్రణకు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అరుుతే... ఇసు క డిమాండ్ ఎక్కువగా ప్రైవేట్ నిర్మాణాలకే ఉంటోంది. వాటి అవసరాలను పట్టించుకోకుండానే ఈ మార్గదర్శకాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఈ విషయాన్ని మార్గదర్శాల్లో పేర్కొనకపోవడంతో ప్రధానంగా వరంగల్ నగరంలోని ప్రైవేట్ నిర్మాణాలకు ఇసుక ఎక్కడి నుంచి తీసుకోవాలనే విషయంలో అస్పష్టత నెలకొంది. వరంగల్ ఆర్డీఓను సంప్రదిస్తే మాత్రం... అనుమతి ఉన్న క్వారీల నుంచి తీసుకోవచ్చని చెబుతున్నారు. కలెక్టర్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, భూగర్భ గనుల శాఖల ఉన్నతాధికారులు చర్చించి రూపొందించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నారుు.
ఇసుక తవ్వకం, లోడింగ్, అన్లోడింగ్, రవాణా అంతా పగటి పూటే జరగాలి. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే ఈ పనులు నిర్వహించాలి. ఇసుక తవ్వకంలో ఎలాంటి యంత్రాలు వినియోగించొద్దు. ఈ విషయంలో పొరపాటు జరిగితే ఎవరినీ ఉపేక్షించొద్దు.
ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు జిల్లాలోని ఏడు కీలక ప్రాంతాలను గుర్తించారు. ఇసుక రవాణాపై నిత్యం పర్యవేక్షణ కోసం ములుగు (జంగాపల్లి క్రాస్‌రోడ్), హసన్‌పర్తి, రఘునాథపల్లి, మరిపెడ పోలీస్స్టేషన్ల వద్ద శాశ్వత, దేవరుప్పల, జనగామ, తొర్రూరు పోలీస్‌స్టేషన్ వద్ద మొబైల్ చెక్‌పోస్టులు ఉంటాయి. ఆర్డీఓలు, తహసీల్దార్లు ఈ చెక్పోస్టులపై ఆకస్మిక తనిఖీలు జరుపుతారు. ఆకస్మిక తనిఖీల సమాచారాన్ని పొందుపరిచేందుకు ప్రత్యేక రిజిస్టరును సంబంధిత పోలీస్స్టేషన్లు, వీఆర్వోలు ఏర్పాటు చేయాలి.
ఇసుక రవాణాలో అక్రమాలు జరిగిన పక్షంలో సంబంధిత నిర్మాణ పనులు పర్యవేక్షించే ఇంజనీరింగ్ శాఖదే బాధ్యత. పర్మిట్, వే బిల్లులో పేర్కొన్నట్లుగా కాకుండా ఇతర ప్రదేశాల్లోకి ఇసుకను సరఫరా చేస్తే వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇసుక అక్రమ రవాణాలో కాంట్రాక్టరు పాత్ర ఉన్నట్లు తేలితే సదరు కాంట్రాక్టు సంస్థను మూడేళ్లపాటు బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.
{పభుత్వ నిర్మాణల పనులకు అవసరమైన ఇసుక సరఫరా కోసం ఇంజనీరింగ్ విభాగాలు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)లకు ప్రతిపాదనలు ఇవ్వాలి. పట్టా భూముల నుంచి ఇసుక తీసుకునే పరిస్థితి ఉంటే ఈ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. రెవెన్యూ డివిజనల్ అధికారి, మైన్ ఏడీ కార్యాలయాల్లో ఇసుక దరఖాస్తు ఫారాలు లభ్యమవుతాయి.
ఇంజనీరింగ్ విభాగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆర్డీఓలు పరిశీలిస్తారు. సీనరేజి చార్జీలను ముందుగా తీసుకుని అవసరమైన ఇసుక సరఫరా కోసం పర్మిట్లు, వే బిల్లులు ఇస్తారు. ఒక్కో వే బిల్లును మూడు కాపీలుగా ఇస్తారు. మొదటిది ఒరిజినల్లో ఇసుక పర్మిట్‌కు సంబంధించిన అనుమతి ఉంటుంది. వాహనం డ్రైవరు ఇసుకను అన్లోడ్ చేసిన తర్వాత వర్క్ సైట్ వద్ద మరో బిల్లు ఇస్తారు. దీన్ని కాంట్రాక్టరు భద్రపరుస్తారు. నిర్మాణ పనులను పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మూడో కాపీని ఆర్డీఓకు ఇస్తారు.
ఆర్డీఓ కార్యాలయానికి వచ్చే వే బిల్లు మూడో కాపీపై తేదీ, సమయాన్ని స్పష్టంగా ముద్రించాల్సి ఉంటుంది. వే బిల్లులకు సంబంధించి ముందుగా ఇచ్చిన వాటిలో ఆర్డీఓకు తిరిగి వచ్చిన మూడో కాపీల ఆధారంగానే కొత్తగా మంజూరు అంశాన్ని పరిశీలిస్తారు. ప్రత్యేక గుర్తులు ఉండేలా వే బిల్లులను ఉంటాయి. వే బిల్లుల ప్రింటింగ్‌కు సంబంధించిన నంబర్ల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను రవాణా చేసే వాహనాల నంబర్ల జాబితాను ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాలు ముందుగానే ఇవ్వాలి. ప్రతి వాహనానికి ప్రత్యేకమైన పర్మిట్, వే బిల్లు ఉంటాయి. ఈ జాబితాను ముందుగానే రూపొందించాలి. మధ్యలో వాహనాల మార్పునకు అవకాశం ఉండదు.ఒక రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి మరో రెవెన్యూ డివిజన్ పరిధిలోకి ఇసుక సరఫరా చేసే పరిస్థితి ఉంటే... ఇసుకను తోడే ప్రాంతం ఉన్న ఆర్డీఓ ముందుగానే కలెక్టర్ అనుమతి తీసుకోవాలి.ఇసుకను ఉపయోగించే ప్రతి డిపార్టుమెంట్... ఒక ఉద్యోగిని ఇసుక రవాణా ప్రక్రియకు నియమించాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు ఇవ్వడం, ఇసుక సరఫరాకు అవసరమైన పర్మిట్లను, వే బిల్లులను తీసుకోవడంతోపాటు ఇసుకను వాహనాల్లో లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం అన్ని అంశాలను ఈ ఉద్యోగి చూస్తాడు.
వరంగల్ నగరం, జిల్లా వ్యాప్తంగా చేపట్టే ప్రైవేట్ నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా కోసం గోదావరి నదిలో 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఏటూరునాగారం మండలం ముల్లకట్ట, తుపాకులగూడెం, ఏటూరునాగారంలలో... మంగపేట మండలం చుంచుపల్లిలో త్వరలోనే ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయనున్నారు.పట్టా భూముల్లో తవ్వకాలు జరిపే ఇసుకను ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ ధర కంటే 20 శాతం మించకుండా విక్రయించకూడదు. పట్టా భూముల్లో తవ్వే ఇసుకలో కనీసం 30 శాతం ప్రభుత్వ నిర్మాణాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల ఇసుక తవ్వకాల సీనరేజి ఫీజు వసూలు బాధ్యత ఆర్డీఓలదే.