అమెజాన్ ఇండియా సరికొత్త ప్రయోగం
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి పోటీగా... దేశీయ కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి అమెజాన్ చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా అమెజాన్ ఇండియా మరో కొత్త ప్రయోగం చేసింది. హిందీ లాంగ్వేజ్ సపోర్టుతో తన వెబ్‌సైట్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తన ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ సైట్ యూజర్లకు ఈ లాంగ్వేజ్ సపోర్టు ఇవ్వనుంది. హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ తన వెబ్సైట్లో తీసుకురావడం దేశీయ మార్కెట్ ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఈ-కామర్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. దేశీయంగా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ హిందీ లాంగ్వేజ్ సపోర్టును తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి అమెజాన్ ఇండియా కస్టమర్లు హిందీలోనే ప్రొడక్ట్ సమాచారాన్ని, డీల్స్‌ను, డిస్కౌంట్లను తెలుసుకోవచ్చు. ఆర్డర్లను ప్లేస్ చేసుకోవడం, ఆర్డర్లకు చెల్లించడం, అకౌంట్ సమాచారాన్ని మేనేజ్ చేయడం, ఆర్డర్లను ట్రాక్ చేయడం, ఆర్డర్ హిస్టరీ ప్రతి ఒక్కటీ హిందీ భాషలోనే చేపట్టుకోవచ్చు.
అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ వెబ్సైట్లలో ఈ కొత్త లాంగ్వేజ్ ఆప్షన్‌ను, ఎడమవైపు ఉన్న మెనూ బార్లో చూడవచ్చు. దీని కోసం కొత్తగా అమెజాన్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సినవసరం లేదు. సర్వర్ సైడే దీన్ని అప్డేట్ చేయనున్నారు. ఇంగ్లీష్ లోంచి హిందీలోకి మారే ఆప్షన్‌ను లాంగ్వేజ్ బటన్ కల్పిస్తోంది. ప్రస్తుతం టాప్ ప్రొడక్ట్‌ల సమాచారం, ముఖ్యమైన షాపింగ్ సమాచారం మాత్రమే హిందీలో లభ్యమవుతున్నాయి. అయితే సెర్చ్ ఫీచర్, డెలివరీ అడ్రస్‌కు మాత్రం ఇంగ్లీష్ అవసరం. మరిన్ని షాపింగ్ ఫీచర్లను హిందీలో అందించేందుకు అమెజాన్ సిద్దమవుతోంది. ఒక్కసారి మీరు ఎక్కువగా సెర్చ్ చేసే లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత, అది సేవ్ అయి, తర్వాత అమెజాన్ ఇండియా సైట్లోకి వెళ్లేటప్పుడు అదే లాంగ్వేజ్‌లో సైట్ దర్శనమిస్తుంది. మరిన్ని లాంగ్వేజ్ల సపోర్టును కూడా అమెజాన్ త్వరలో ప్రవేశపెట్టబోతుంది. సుమారు 50 శాతం మంది కస్టమర్లు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలో షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కంపెనీ గుర్తించింది. వీరి కోసమే హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ ఇండియా ప్రవేశపెట్టింది.