మోడల్ స్కూల్ ఎదుట ధర్నా
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం ఉరేసుకుని మోడల్ స్కూల్ వసతి గృహంలో మృతి చెందిన మడ్డి ప్రసన్న మృతిపై మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రసన్న బంధువులు శుక్రవారం మోడల్ స్కూల్ ఎదుట ప్రసన్న మృతదేహంతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రసన్న మృతికి కారకులైన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వారికి సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ధర్నా, రస్తారోకోలో రెండు వేల మంది పాల్గొని నినాదాలు చేశారు.
మోడల్ స్కూల్ యాజమాన్యంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని నేటి వరకు యాజమాన్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు. తమ విద్యార్థులకు రక్షణ కరువైందని ప్రభుత్వం మోడల్ స్కూల్ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసన్నకు చదువు తప్ప మరో ద్యాస తెలియదని ప్రసన్న మృతికి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మరో కారణం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రసన్న మృతిపై వాస్తవాలను తెలియజేయాలన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ప్రసన్న మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.