ఆర్మీని అవమానించారు
న్యూఢిల్లీ: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు అవమానకరమనీ, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం డిమాండ్ చేశారు. భాగవత్ ఆదివారం బిహార్‌లో ఆరెస్సెస్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘సైనిక సిబ్బందిని సన్నద్ధం చేయడానికి ఆర్మీకి ఆరేడు నెలలు పట్టచ్చేమో కానీ ఆరెస్సెస్‌కు మూడు రోజులు చాలు’ అని అన్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ మాట్లాడుతూ ‘భాగవత్ అలా అనడం తప్పు. ఆర్మీని ఆయన అవమానించారు. ఆ మాటలు నాకు బాధ కలిగించాయి. మన సైనికులు సరిహద్దుల్లో నిల్చొని రక్తం చిందిస్తున్నారు. భాగవత్ తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి’ అని అన్నారు. ఆర్మీ సామర్థ్యాన్ని భాగవత్ తక్కువ చేసి మాట్లాడారనీ, ఇలాంటి వ్యాఖ్యలు సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు.
అవమానించలేదు: ఆరెస్సెస్
భాగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారనీ, ఆయన ఆర్మీని అవమానించలేదంటూ ఆరెస్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. సంఘ్ స్వయం సేవకులతో సైనికులను భాగవత్ పోల్చలేదని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఈ అంశాన్ని కావాలని రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు.
అధికారంలోకి వస్తే రుణమాఫీ
సాక్షి, బళ్లారి/రాయచూరు రూరల్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీనిచ్చారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు ఎరువులు, పురుగు మందులపై రాయితీ ఇస్తామన్నారు. కర్ణాటకలో జనాశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయచూరు, యాదగిరి, గుల్బర్గాల్లో రాహుల్ పర్యటించారు.