Mohankumar
-
సాఫ్ట్వేర్ ప్రియుడి కోసం రూ.1.50లక్షల..
చిన్నచింతకుంట (దేవరకద్ర): ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు సహజీవనం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకి దిగిన సంఘటన చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మద్దూర్ గ్రామానికి చెందిన జుట్ల నర్మద, చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన మక్క మోహన్‌కుమార్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇలా ప్రేమించుకుంటున్న సమయంలోనే నర్మద, మోహన్‌కుమార్ ఇద్దరూ హైదరాబాద్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లారు. నర్మద చిక్కడపల్లి ప్రాంతంలోని ఓ ఉమెన్స్‌కాలేజీలో 2010 నుంచి 2014 సంవత్సరం వరకు విద్యనభ్యసిస్తూనే ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. అలాగే, మోహన్‌కుమార్ ఓ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించి కాగ్నిజెంట్ డీఎల్ఎఫ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రియుడి చదువు కోసం రూ.1.50లక్షల ఖర్చు ఈ క్రమంలోనే మోహన్ పైచదువు కోసం నర్మద రూ.1,50,000 వరకు సాయం అందించింది. 2014సంవత్సరంలో నర్మద కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన మోహన్ మేమిద్దరం పెళ్లిచేసుకుంటామని, వేరే సంబంధాలు చూడవద్దని చెప్పడంతో నర్మద కుటుంబీకులు కూడా ఆమె సంబంధాల గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2014 నుంచి 2019వరకు దాదాపుగా 5ఏళ్లుగా వీరిద్దరు కలిసి సహజీవనం కొనసాగించారు. ఇదే తరుణంలో నన్ను పెళ్లిచేసుకోమని మోహన్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా మా చెల్లెలి పెళ్లి తర్వాత మనం పెళ్లి చేసుకుందామని దాటవేస్తూ వచ్చాడు. అనంతరం మోహన్‌కుమార్ చెల్లెలి పెళ్లి కూడా పూర్తయింది. తల్లి ఒప్పుకోవట్లేదని పెళ్లికి నిరాకరణ.. ఇదిలాఉండగా, గత 6నెలల క్రితం ఇరు గ్రామాలకు చెందిన పెద్దల సమక్షంలో మోహన్‌కుమార్ నర్మదతో పెళ్లికి అంగీకారం కుదుర్చుకున్నారు. అప్పటి నుండి పెళ్లి చేసుకుందామని నర్మద, మోహన్‌కుమార్‌ను పట్టుపడుతూ వచ్చింది. ఇటీవల నిన్ను పెళ్లిచేసుకుంటే మా అమ్మ చనిపోతానని అంటుందని, అందుకే నీతో పెళ్లికి నిరాకరిస్తున్నానని మోహన్ తేల్చిచెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించి కొన్నిరోజుల కిందట ఎస్పీని కలిసే ప్రయత్నం చేసింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించడంతో నర్మద గత మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఇక్కడ కూడా జాప్యం జరగడంతో గత్యంతరం లేక ప్రియుడు మోహన్‌కుమార్ ఇంటి ఎదుట గత మూడురోజులుగా ధర్నాకి కూర్చుంది. పెళ్లంటూ జరిగితే మోహన్‌తోనే జరగాలని, లేదంటే న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని నర్మద తెలిపారు. చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద చిన్నచింతకుంటలో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు నర్మద -
ఈ హృదయం అమరం
తాను చనిపోతూ మరొకరికి ప్రాణదానం బెంగళూరు: ముళబాగులుకు చెందిన మోహన్‌కుమార్ తాను చనిపోతూ మరొకరికి జీవం పోశారు. దీంతో అతని హృదయం మరో శరీరంలో జీవిస్తూ ఆ వ్యక్తికి పునర్జన్మనిచ్చింది. వివరాలు... ముళబాగులకు చెందిన మోహన్‌కుమార్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈనెల 14న స్వస్థలం వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం మోహన్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని మనిపాల్ ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా మంగళవారం రాత్రి మోహన్‌కుమార్ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నారని వైద్యులు ధ్రువీకరించారు. అంతేకాకుండా అతని అవయవాలను దానం చేయాడానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి 12:58 గంటల సమయంలో ప్రత్యేక ఆంబులెన్స్ ద్వారా మోహన్ కుమార్ శరీరం నుంచి వేరుచేసిన హృదయాన్ని దాదాపు 14 కిలోమీటర్ల దూరంలోని ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రికి ఎనిమిది నిమిషాల్లో వైద్య సిబ్బంది చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి మోహన్‌కుమార్ గుండెను విజయవంతంగా అమర్చారు. కాగా, అంబులెన్స ప్రయాణిం చే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర ట్రాఫిక్ విభాగం గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేసింది. -
ఏడాది తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం
హైకోర్టు ఆదేశాలతో కదిలిన కర్ణాటక పోలీసులు మదనపల్లెక్రైం: మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేయని పోలీసులపై మృతుడి తల్లి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పోలీసులకు అక్షింతలు వేయడంతో ఏడాది తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లి కథనం మేరకు.. మదనపల్లె పట్టణం విజయనగర్‌కాలనీలో నివాసముంటున్న వెంకటస్వామి, లక్ష్మీదేవి దంపతుల కుమారులు మోహన్‌కుమార్(25), మంజునాథ్ కర్ణాటక రాష్ట్రం బాగేపల్లె వద్ద నర్సరీని నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం మోహన్‌కుమార్‌కు బెంగళూరుకు చెందిన వెంకటస్వామి, వెంకటమ్మ దంపతుల కుమార్తె మాలినితో పెళ్లి చేశారు. మోహన్‌కుమార్, మాలిని మదనపల్లె విజయనగర్‌కాలనీలో కాపురం ఉండేవారు. పెళ్లి జరిగిన 11 నెలలకే దంపతులిద్దరూ ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన మాలిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించి కొద్దిరోజులు పుట్టింటిలో ఉండి రమ్మని అత్మమామలు, భర్త బెంగళూరుకు పంపారు. నెల రోజులైనా భార్య కాపురానికి రాకపోవడంతో గత ఏడాది ఆగస్టు 25న మోహన్‌కుమార్ భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ భార్య మాలినితో పాటు బావమరిది శ్రీనివాసులు, అత్తమామలు వెంకటస్వామి, వెంకటమ్మ, మాలిని అక్క, బావలు తదితరులు కలిసి మోహన్‌కుమార్‌ను దుర్భాషలాడారు. దాడిచేసి కొట్టారు. నీ భార్యను కాపురానికి పంపేది లేదని, మరోసారి వస్తే చంపేస్తామని బెదిరించి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్‌కుమార్ బాగేపల్లెలోని చెరువువద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు మంజునాథ్ అపస్మారకస్థితిలో పడిఉన్న అన్నను స్థానికుల సాయంతో బాగేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. బెంగళూరు ఆస్పత్రిలో మోహన్‌కుమార్ మృతి చెందాడు. కోడలు, వారి కుటుంబసభ్యులు దాడిచేసి కొట్టడంవల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మోహన్‌కుమార్ తల్లిదండ్రులు చెప్పినా కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేయకుండా మృతదేహాన్ని అప్పగించి పంపేశారు. అక్కడి పోలీసులు కన్నడలో మాట్లాడుతుండడంతో ఏమీ అర్థంకాక మృతదేహాన్ని మదనపల్లెకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినట్టు మృతుడి తల్లి పేర్కొన్నారు. తర్వాత మదనపల్లె రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగింది కర్ణాటకలో అయినందున అక్కడి పోలీసులకే ఫిర్యాదు చేయాలని ఈ కేసును రెఫర్ చేశారు. అయినా అక్కడి పోలీసులు కదల్లేదు. దీంతో మృతుడి తల్లి లక్ష్మీదేవి హైకోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన హైకోర్టు వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని కర్ణాటక పోలీసులకు అక్షింతలు వేసింది. దీంతో శుక్రవారం బాగేపల్లె ఎస్ఐ మునిరెడ్డి, ఏఎస్ఐ మదనపల్లెకు వచ్చి తహశీల్దారు సమక్షంలో మోహన్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.