- హైకోర్టు ఆదేశాలతో కదిలిన కర్ణాటక పోలీసులు
మదనపల్లెక్రైం: మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటక ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేయని పోలీసులపై మృతుడి తల్లి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పోలీసులకు అక్షింతలు వేయడంతో ఏడాది తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లి కథనం మేరకు.. మదనపల్లె పట్టణం విజయనగర్‌కాలనీలో నివాసముంటున్న వెంకటస్వామి, లక్ష్మీదేవి దంపతుల కుమారులు మోహన్‌కుమార్(25), మంజునాథ్ కర్ణాటక రాష్ట్రం బాగేపల్లె వద్ద నర్సరీని నిర్వహిస్తున్నారు.
రెండేళ్ల క్రితం మోహన్‌కుమార్‌కు బెంగళూరుకు చెందిన వెంకటస్వామి, వెంకటమ్మ దంపతుల కుమార్తె మాలినితో పెళ్లి చేశారు. మోహన్‌కుమార్, మాలిని మదనపల్లె విజయనగర్‌కాలనీలో కాపురం ఉండేవారు. పెళ్లి జరిగిన 11 నెలలకే దంపతులిద్దరూ ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన మాలిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించి కొద్దిరోజులు పుట్టింటిలో ఉండి రమ్మని అత్మమామలు, భర్త బెంగళూరుకు పంపారు. నెల రోజులైనా భార్య కాపురానికి రాకపోవడంతో గత ఏడాది ఆగస్టు 25న మోహన్‌కుమార్ భార్య పుట్టింటికి వెళ్లాడు. అక్కడ భార్య మాలినితో పాటు బావమరిది శ్రీనివాసులు, అత్తమామలు వెంకటస్వామి, వెంకటమ్మ, మాలిని అక్క, బావలు తదితరులు కలిసి మోహన్‌కుమార్‌ను దుర్భాషలాడారు. దాడిచేసి కొట్టారు.
నీ భార్యను కాపురానికి పంపేది లేదని, మరోసారి వస్తే చంపేస్తామని బెదిరించి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మోహన్‌కుమార్ బాగేపల్లెలోని చెరువువద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు మంజునాథ్ అపస్మారకస్థితిలో పడిఉన్న అన్నను స్థానికుల సాయంతో బాగేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడి వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు.
బెంగళూరు ఆస్పత్రిలో మోహన్‌కుమార్ మృతి చెందాడు. కోడలు, వారి కుటుంబసభ్యులు దాడిచేసి కొట్టడంవల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మోహన్‌కుమార్ తల్లిదండ్రులు చెప్పినా కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేయకుండా మృతదేహాన్ని అప్పగించి పంపేశారు. అక్కడి పోలీసులు కన్నడలో మాట్లాడుతుండడంతో ఏమీ అర్థంకాక మృతదేహాన్ని మదనపల్లెకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినట్టు మృతుడి తల్లి పేర్కొన్నారు. తర్వాత మదనపల్లె రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన జరిగింది కర్ణాటకలో అయినందున అక్కడి పోలీసులకే ఫిర్యాదు చేయాలని ఈ కేసును రెఫర్ చేశారు. అయినా అక్కడి పోలీసులు కదల్లేదు. దీంతో మృతుడి తల్లి లక్ష్మీదేవి హైకోర్టును ఆశ్రయించారు.
కేసును పరిశీలించిన హైకోర్టు వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని కర్ణాటక పోలీసులకు అక్షింతలు వేసింది. దీంతో శుక్రవారం బాగేపల్లె ఎస్‌ఐ మునిరెడ్డి, ఏఎస్‌ఐ మదనపల్లెకు వచ్చి తహశీల్దారు సమక్షంలో మోహన్‌కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.