mominpet
-
Vikarabad: కొడుకు ప్రశ్నించాడని.. భోజనంలో విషం కలిపి
సాక్షి, వికారాబాద్: కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న తండ్రిని ప్రశ్నించినందుకు కొడుకునే హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మోమిన్‌పేట మండల పరిధిలో ఎన్కతల గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్కతలకు చెందిన ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మలు దంపతులు. వారికి వెంకటేశం, కృష్ణ ఇద్దరు కుమారులు. పెంటయ్య ఎద్దులు, మేకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు. భార్య గోవిందమ్మ కుమారులను చేరదీసి ఉన్న ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూమిని అమ్ముదామని ఇంట్లో గొడవ పడుతుండేవాడు. అవసరం లేనిది భూమి అమ్మడం దేనికని కుమారులిద్దరూ అడ్డుపడుతున్నారు. ఈ నెల 24న ఉదయం పెద్ద కుమారుడు వెంకటేశం భోజనం చేసే సమయంలో అన్నంలో తండ్రి విషం కలిపాడు. తెలుసుకోకుండా భోజనం చేసిన వెంకటేశం అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అన్నంలో విషం కలిపారని తెలపడంతో తల్లి గోవిందమ్మ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు చదవండి: అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్‌లో ఆందోళన -
బురద నీటిలో పెళ్లి బస్సు!.. రాత్రంతా అక్కడే ఉండటంతో
సాక్షి, వికారాబాద్: పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న బస్సు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బురద నీటిలో ఇరుక్కుపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం బర్వాద్ గ్రామానికి చెందిన పెళ్లి బృందం వారు హైదరాబాద్‌లోని బోరబండకు వెళ్లారు. వివాహం ముగిసిన తర్వాత తిరుగుప్రయాణంలో రాత్రి 11గంటలకు మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. వంతెన కింది నుంచి బస్సు తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికే భారీ వర్షం కువరడంతో బ్రిడ్జి కింద వరద చేరింది. బస్సు టైర్లు బురదలో కూరుకుపోవడంతో ముందుకు కదలలేదు. దీంతో వాహనం దిగిన పెళ్లివారు నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. అక్కడి నుంచి ఆటోల్లో ఇళ్లకు చేరుకున్నారు. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో బస్సును అలాగే వదిలేశాడు. తెల్లారేసరికి మరింత వర్షం కురవడం, ఊట నీరు సైతం బ్రిడ్జి కిందకు చేరడంతో సగ భాగానికి పైగా బస్సు నీటిలో మునిగిపోయింది. ఉదయాన్నే అక్కడకు చేరుకున్న బస్సు యజమాని, డ్రైవర్, క్లీనర్, గ్రామస్తుల సాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గతేడాది సైతం ఇవే కష్టాలు గతేడాది వర్షాకాలంలోనూ మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. ఈ రూట్లో నాలుగైదు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. వీరికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం బ్రిడ్జి పనులైనా వేగంగా పూర్తిచేయడం లేదు. వంతెన కింద వరద నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనిపించని హెచ్చరిక బోర్డులు వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న చోట హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలేదు. ఈ విషయాన్ని అటు కాంట్రాక్టర్ ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో కొత్తగా ఎవరైనా ఈ రూట్లో వస్తే ప్రమాదం బారిన పడక తప్పదు. గత వర్షా కాలంలో ఇక్కడే ఇరుక్కుపోయిన ఓ లారీ మూడు రోజులుగా అక్కడి ఉండిపోయింది. -
వికారాబాద్: పెళ్లయిన 20 రోజులకే..
సాక్షి, వికారాబాద్: పెళ్లి అయిన 20 రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోమిన్‌పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మైపాల్(28)కు ఈ నెల 6న శిరీషతో వివాహమైంది. కాగా ఈ నెల 25న మైపాల్ భార్య శిరీష, తమ్ముడు అనిల్‌తో కలిసి భోజనం చేశాడు. అనంతరం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తలుపు గడిపెట్టుకోవాలని చెప్పాడు. రాత్రి 11గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో తమ్ముడు ఫోన్ చేశాడు. బస్టాండ్ వద్ద ఉన్నానని సమాధానం ఇచ్చాడు. తర్వాత ఫోన్ చేసినా స్పందించలేదు. గురువారం ఉదయం బేగరి మల్లేశం వారి పొలానికి వెళ్లగా మైపాల్ తన పొలంలోని వేపచెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. దీంతో మల్లేశం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి అప్పులు ఉన్నాయని వాటిని ఎలా తీర్చాలని బాధపడుతుండే వాడని భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి.. -
కొన్నది ఎకరం.. కొట్టేసింది 4.35 ఎకరాలు.. వాహనం ఆపి సోదా చేయగా..
సాక్షి, మోమిన్‌పేట(వికారాబాద్): ఓ మహిళా రైతును మోసం చేసి.. ఆమెకు తెలియకుండా 4.35 ఎకరాల భూమిని కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన సంఘటన మోమిన్‌పేటలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.. దేవరంపల్లికి చెందిన మ్యాదరి అంజమ్మకు గ్రామంలోని సర్వే నంబర్లు 97, 99లో ఐదెకరాల 35గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఒక ఎకరా భూమిని చీమల్‌దరి గ్రామానికి చెందిన గొర్లకాడి క్రాంతికుమార్, అతని స్నేహితులకు విక్రయించింది. ఎకరం కొనుగోలు చేసిన కాంత్రికుమార్.. అంజమ్మ పేరున ఉన్న 5.35 ఎకరాల మొత్తం భూమిని డిసెంబరు 10, 2020 రోజున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎకరా అమ్మగా వచ్చిన డబ్బును తన కూతుళ్లకు సమానంగా ఇవ్వాలని అంజమ్మ నిర్ణయించుకుంది. మిగిలిన నాలుగెకరాల భూమిని కుమారులకు పంచాలని భావించింది. అయితే తన పాసు పుస్తకంలోని మొత్తం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే మోసాన్ని ఆలస్యంగా గుర్తించి.. సదరు వ్యక్తులను నిలదీసింది. చదవండి: కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు ఈ విషయమై కొంతమంది సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో అంజమ్మ భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేసేందుకు కాంత్రికుమార్, అతని స్నేహితులు ఒప్పుకొన్నారు. కాలం గడుస్తున్నాకొద్ది విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. ఇక లాభం లేద నుకున్న అంజమ్మ తనకు జరిగిన అన్యాయంపై ఇటీవల పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా క్రాంతికుమార్ గురువారం మధ్యాహ్నం మేకవనంపల్లి వైపు వెళ్లున్నట్లు సమాచారం తెలుసుకొన్న సీఐ వెంకటేశం, ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తమ సిబ్బందితో వెళ్లి కారును చేజ్ చేసి పట్టుకున్నారు. వాహనాన్ని ఆపి సోదా చేయగా రూ.3.08లక్షలు నగదుతో పాటు ఒక తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. తల్వార్ ఎందుకు ఉపయోగిస్తున్నావని ప్రశ్నించగా.. తాను భూముల క్రయవిక్రయాలు చేస్తుంటానని, ప్రాణ రక్షణ కోసం కారులో తల్వార్ పెట్టుకున్నానని సీఐకి చెప్పాడు. దీంతో అతనిపై అక్రమంగా మారణాయుధాలు కలిగిన నేరంతో పాటు మోసం చేసిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరచరిత్రే.. క్రాంతికుమార్‌పై గతంలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. 2007, 2013, 2020లో మూడు, 2022లో రెండు కేసులు బుక్ అయ్యాయి. ఇందులో అక్రమంగా భూమి క్రయవిక్రయాలు, మర్డర్ కేసు, ప్రస్తుత చీమల్‌దరి సర్పంచుపై బెదిరింపులకు పాల్పడటం వంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
ఏం తమాషా చేస్తున్నావా.. నిన్నెందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పు?
సాక్షి, మోమిన్‌పేట: ‘ఏం తమాషా చేస్తున్నావా.. నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పు’..? అంటూ కలెక్టర్ నిఖిల పంచాయతీ కార్యదర్శిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్ చార్ట్ ప్రచారం నీ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తేలిపోయిందని మండిపడ్డారు. గ్రామంలో చేపట్టే ఎన్ఆర్ఈజీఎస్ పనులను దగ్గరుండి చేయించాల్సిన బాధ్యత సెక్రటరీలదేనని స్పష్టంచేశారు. కలెక్టర్ నిఖిల శుక్రవారం ఎన్కేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కృష్ణచైతన్యరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితవాడలో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. శ్మశానవాటికకు గోడ నిర్మించాలని, ఇందుకు అవసరమైన నిధులు తానే ఇస్తానని సర్పంచ్ అంతమ్మకు హామీ ఇచ్చారు. కబ్రస్థాన్‌కు వెళ్లే మార్గం పాడవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ముస్లింలు కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె రోడ్డును పరిశీలించి, నివేదిక అందజేయాలని ఎంపీడీఓ శైలజారెడ్డిని ఆదేశించారు. చర్యలతో బాధ్యతలు గుర్తుచేస్తా.. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాను జనగాం జిల్లాలో పనిచేసినప్పుడు మొదట కార్యదర్శులు ఇలానే ప్రవర్తించారని.. పనిలో ఆలసత్వం ప్రదర్శించిన నలుగురిపై వేటు వేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇక్కడ కూడా కార్యదర్శులు బాధ్యతగా పని చేయడం లేదని అసహనం వ్యక్తంచేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే బాధ్యతలు గుర్తొస్తాయని తెలిపారు. సెక్రటరీలు ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో ఉండాలని సూచించారు. ధర్నాలకు భయపడేది లేదని, ఎవరిపని వారు చేస్తే సమస్యలేవీ ఉండవన్నారు. కార్యదర్శుల పని కేవలం లైట్లు, నీళ్లు, మురుగు కాల్వలే కాదని, ఉపాధి పనులు సైతం పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. నూతన చట్టంలో కార్యదర్శుల జాబ్‌కార్డు పూర్తిగా పొందిపర్చినట్లు వివరించారు. కృష్ణచైతన్యరెడ్డికి వెంటనే మెమో జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. 15 రోజుల్లో మళ్లీ వస్తానని, గ్రామంలో పరిస్థితులు మారకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఎన్కేపల్లిలో రిజిస్టర్లను తనిఖీ చేస్తున్న కలెక్టర్ నిఖిల -
ఈ జత ధర రూ.32 వేలు
మోమిన్‌పేట : మోమిన్‌పేటలో శనివారం జరిగిన మేకల సంతలో అత్యధిక ధరకు రెండు గొర్రె పొట్టేళ్లు అమ్ముడుపోయాయి. జతగా ఉన్న ఈ రెండు పొట్టేళ్లు ఏకంగా రూ.32 వేలు ధర పలకడం హాట్ టాపికైంది. ఈ నెలలో బక్రీద్ పండుగ ఉండడంతో ఇంత ధర పలికిందని తెలుస్తోంది. మోమిన్‌పేటకు చెందిన షేక్ బాబ్జాని వాటిని కొనుగోలు చేశాడు. -
నీళ్లు లేవు.. మీ పిల్లల్ని తీసుకెళ్లండి
‘‘పాఠశాలలో నీళ్లు లేవు.. మీ అమ్మాయి ఇబ్బందులకు గురవుతోంది. స్కూల్‌కు వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లండి. మళ్లీ నీటి పునరుద్ధరణ జరిగిన అనంతరం ఫోన్ చేస్తాం. అప్పుడు తీసుకురండి’’ అంటూ కస్తూర్బాగాంధీ పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చెబుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు పాఠశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితి మోమిన్‌పేట మండలం చంద్రాయన్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఉంది. మోమిన్‌పేట: నెల రోజులుగా తాగునీరు, వినియోగించడానికి నీరు లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రోజులకోమారు స్నానాలు చేస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. స్వయంగా ఉపాధ్యాయులే విద్యార్థినిల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లలను కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్లమని పురమాయిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. గ్రామానికి దూరంగా అడవిలో ఉన్న పాఠశాల కావడం నీరు లేక వ్యక్తిగత పనులకు ఆరు బయటకు వెళ్తున్నారు. రాత్రివేళ బహిర్భూమికి వెళ్లేందుకు విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దెబ్బకు విద్యార్థులు పాఠశాలను వీడుతున్నారు. పాఠశాల ఖాళీ అవుతున్నా ఉన్నతాధికారులు నెల రోజులుగా పట్టించుకోకపోవడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఇది.. మోమిన్‌పేట మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 240 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 11 మంది ఉపాధ్యాయులు, 8 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ పాఠశాల అంతటికి ఒకటే బోరు బావి ఉంది. గత ఏప్రిల్ వరకు బోరుబావిలో బాగానే వచ్చిన నీరు అకస్మాత్తుగా రావడం లేదు. జూన్‌లో పాఠశాల పునఃప్రారంభం కాగానే బోరులో ఉన్న మోటారు పని చేయడం లేదు. కొత్తగా ఇంకో మోటారు బిగిస్తే గంటకు 2 బిందెల నీరు కూడా రావడం లేదు. బోరుబావి అడుగున కూలిపోవడంతో నీటికి కటకట ఏర్పడింది. తిరిగి ఫ్లషింగ్ లేదా కొత్త బోరు వి తవ్వించాలి. నెల గడుస్తున్నా చర్యలు ఏవి తీసుకోకపోవడంతో విద్యార్థినుల బాధలు చెప్పలేనివి. పాఠశాల ఇన్చార్జి ప్రత్యేకాధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చలనం లేదు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల కష్టం చూడలేక వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లండి.. ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వారంలో పాఠశాల పూర్తిగా ఖాళీ కావడం ఖాయంగా తెలుస్తోంది. అయితే దీనిపై విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే పదో తరగతి విద్యార్థినిల సంగతేమిని ప్రశ్నిస్తున్నారు. సమస్య వెంటనే పరిష్కరించి విద్యార్థులకు సక్రమంగా బోధన కొనసాగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పోలీసుల పేరు చెప్పి డబ్బు వసూలు..
మొమిన్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : పోలీసుల పేరు చెప్పి ఓ మహిళ నుంచి డబ్బులు వసూలు చేస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొమిన్‌పేట మండలం ఎంకేపల్లి గ్రామానికి చెందిన యాదమ్మను నరసింహులు అనే వ్యక్తి.. 'నువ్వు బాణామతి, చేతబడి చేస్తున్నావు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. నాకు సీఐ, ఎస్ఐ తెలుసు. రూ.40 వేలు ఇవ్వకపోతే కేసు పెట్టిస్తా..త్వరలోనే జైలుకు కూడా పోతావ్' అని బెదిరించాడు. దీంతో బయపడ్డ యాదమ్మ తన ఒంటిపై ఉన్న బంగారాన్ని కుదవపెట్టి రూ.30 వేలు తీసుకువచ్చి నరసింహులుకు ఇచ్చింది. రెండు రోజుల తర్వాత ఒంటిపై బంగారం లేకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులతో కలిసి మొమిన్‌పేట పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
పేలుడు పదార్థాలు స్వాధీనం
మోమిన్‌పేట్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 300 డిటోనేటర్లు, 300 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న రోడ్డు పక్కన గుంటలు తీస్తున్నవారి వద్ద కొన్ని డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూర్తి వివరాలు బయటపడ్డాయి. పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన నలుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. -
ఆటోను దొంగిలించిన యువకుడు
మొమిన్‌పేట (రంగారెడ్డి) : ఆటోను దొంగిలించుకొని తీసుకువెళ్తున్న యువకుడు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొమిన్‌పేటలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన సురేష్(20) అనే యువకుడు మెదక్ జిల్లా నుంచి ఆటోను దొంగలించుకొని తీసుకువెళ్తుండగా.. తనిఖీలు నిర్వహిస్తున్న మొమిన్‌పేట పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు'
వికారాబాద్: గిరిజన బాలికపై కన్నతండ్రే అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన హృదయాన్ని కలచివేసిందని రంగారెడ్డి జిల్లా ఏఎస్పీ చందనా దీప్తి అన్నారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ఓ తండ్రి ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇది చాలా అమానుషమైన చర్య అని పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదన్నారు. మెగావత్ కమాల్ మృగంలా ప్రవర్తించాడని, మనిషినన్న సంగతి మర్చిపోయాడని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం మీద ఒక్కసారిగా అపనమ్మకం ఏర్పడుతుందన్నారు. మగవారిని 100 శాతం నమ్మొద్దని ఆమె సూచించారు. మహిళలు, అమ్మాయిలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలన్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించినందుకు గర్వంగా ఉందని చందనా దీప్తి చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే సమాజంలో మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన గిరిజన బాలిక సిమ్రాన్(14)పై కన్నతండ్రే అత్యాచారం చేసి, హత్య చేసినట్టు తేలడం పోలీసులతో పాటు అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. -
'ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదు'
-
ఎన్యూమరేటర్లకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు
మోమిన్‌పేట: ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు స్వచ్ఛందంగా వస్తున్న ఎన్యూమరేటర్లకు ఉద్యోగ సంఘాలు స్వాగతం పలుకనున్నాయి. ఈ మేరకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రత్యక్షమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేకు పలు ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండ కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న వారు, ఆశా వర్కర్లు, సాక్షరభారత్ కో-ఆర్డినేటర్లు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొనడంపై ఉద్యోగ సంఘా లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రాజీవ్ యువ కిరణాలు పథకం కింద కాంట్రాక్టు పద్ధతిపై లైవ్లీహుడ్ స్పెషలిస్టు, ఎంఐఎస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైవ్లీహుడ్ స్పెషలిస్టు పోస్టుకు పోస్టుగ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎంఎస్ ఆఫీస్ తెలిసి, కమ్యూనిటీ డెవలప్మెంట్లో పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. ఎంఐఎస్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ (కంప్యూటర్స్), బీటెక్ (కంప్యూటర్స్), ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు 40 ఏళ్లకు మించి ఉండకూడదన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రాజెక్ట్ డెరైక్టర్ మెప్మా, రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.