monkeys attack
-
కోతుల చేతిలో దారుణంగా హతమైన బాలుడు
గాంధీనగర్ : చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటనలు చూశాం. అయితే గుజరాత్లో ఓ 10ఏళ్ల బాలుడిపై కోతులు అత్యంత దారుణంగా దాడి చేసి చంపాయి. బాలుడి కడుపును చీల్చి పేగులు బయటికి తీసి మరీ చంపేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సల్కి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దేగామ్ తాలూకాలోని ఓ గుడికి సమీపంలో బాలుడిపై కోతులు దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దీపక్ ఠాకూర్ అనే బాలుడు స్నేహితులతో ఆడుకుంటుండగా కోతుల గుంపు ఒకటి అక్కడికి వచ్చి వారిని భయపెట్టింది.వెంటనే కోతులన్నీ కలిసి బాలుడిపై దూకాయి. అతడి ఒంటిపై చర్మాన్ని తొలగించి గోళ్లు పొట్ట లోపలికి దించి పేగులు బయటికి తీశాయి. దాడి తర్వాత వెంటనే దీపక్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలోనే డాక్టర్లు దీపక్ చనిపోయినట్లు ధృవీకరించారు. సల్కి గ్రామలో ఈ వారంలోనే కోతులదాడికి సంబంధించి ఇది మూడో ఘటన అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అయితే ఆ రెండు ఘటనల్లో బాధితులను కాపాడినట్లు తెలిపారు. ఇక్కడ మనుఘులపై వరుసగా దాడులు చేస్తున్న కోతులను పట్టుకున్న వారికి వేల రూపాయల రివార్డులను కూడా అధికారులు ప్రకటిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇదీ చదవండి..ప్రేమను పెంచే ఆహారపాత్ర.. కొత్త జంటలకు ప్రత్యేకమట! -
వానరాల వీరంగం.. తీవ్రగాయాలతో గృహిణి మృతి
మహబూబాబాద్ రూరల్: వానరాల మూక చేష్టలతో తీవ్రంగా గాయపడిన ఓ గృహిణి మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ అర్జున్‌రెడ్డి ఆస్పత్రి సమీపంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల కథనమిది. స్థానికంగా నివసించే ఎండీ గౌస్ భార్య సాబీరా బేగం (55) ఎప్పట్లాగే ఉదయం నిద్రలేచి ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇంటిపై సిమెంటు దిమ్మెకు కట్టిన విద్యుత్ తీగను కోతుల గుంపు ఊపడంతో.. ఆ దిమ్మె ఒక్కసారిగా ఊడిపోయింది. అదే సమయంలో వాకిలి ఊడ్చి ఇంట్లోకి వెళ్లడానికి కదులుతున్న సాబీరాబేగంపై దిమ్మె పడిపోయింది. దీంతో ఆమె తలకు లోపలి భాగంలో తీవ్రగాయమై.. కాలు విరిగింది. రక్తస్రావంతో కుప్పకూలిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. -
కోతుల దాడి: తండ్రి చేతుల్లోంచి ఎత్తుకెళ్లి మరీ..
లక్నో: ఉత్తర ప్రదేశ్ బరేలీ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలోంచి అతని నాలుగు నెలల పసికందును ఎత్తుకెళ్లిన కోతులు.. భవనం నుంచి కింద పడేశాయి. ఈ దుర్ఘటనలో చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలీలోని డుంకా ప్రాంతంలో బాధిత కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తి తన బిడ్డను ఎత్తుకుని బిల్డింగ్ పైన నడుస్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన ఓ కోతుల గుంపు అతనిపై దాడి చేసింది. అతన్ని తీవ్రంగా గాయపరిచి.. బిడ్డను ఎత్తుకెళ్లాయి. సాయం కోసం అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. వాళ్ల మీదా కోతులు దాడికి పాల్పడ్డాయి. పలువురిని కరిచాయి. దీంతో కొందరు రాళ్లు, కర్రలు విసరడంతో గందరగోళంలో ఆ కోతులు బిడ్డను కిందకు విసిరేశాయి. మూడంతస్తుల బిల్డింగ్ కావడంతో బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. నామకరణం వేడుక కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఇది జరగడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. షాహీ పోలీసులతో పాటు ఈ ఘటనపై స్థానిక అటవీ శాఖ దర్యాప్తు చేపట్టారు. -
ఊర్లు వదిలిపోవట్లే.. జనానికి సవాల్‌గా మారిన కోతులు
బుచ్చెయ్యపేట: అనకాపల్లి జిల్లాలో కోతుల నిర్మూలనకు రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామాల్లో కోతులను నిర్మూలించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ గ్రామాల్లో వేలాది కోతులు ఐదారేళ్లుగా తిష్ఠవేశాయి. అరటి, చెరకు, కొబ్బరి, మామిడి, వరి, తమలపాకు, కూరగాయలు, తదితర పంటలపై దాడి చేసి ఫలసాయాన్ని తింటూ పాడు చేస్తున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో తమ భూములను ఖాళీగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటా ఒక్కో రైతు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇళ్లలోకి చొరబడి... బుచ్చెయ్యపేట మండలం లోపూడి, బంగారుమెట్ట, ఎల్.బి.పురం, శింగవరం, పి.డి.పాలెం, చిన అప్పనపాలెం, భీమవరం, వడ్డాది, పాయకరావుపేట తదితర పరిసర గ్రామాల్లో కోతులు పంటలను పాడు చేయడమే కాకుండా ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను పట్టుకుపోతున్నాయి. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. రోడ్లపై తిష్ఠ వేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీటిని నిర్మూలించాలని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి, కలెక్టర్‌కు, వ్యవసాయ శాఖ మంత్రికి వందలాది మంది రైతులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో కోతులను అటవీ ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి ఆదేశాల మేరకు ముందుగా జిల్లాలో బంగారుమెట్ట, సత్యవరం గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అటవీ, వ్యవసాయ శాఖ అధికార్లు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. వీటిని పట్టేవారిని తీసుకొచ్చి బోనుల ద్వారా అటవీ ప్రాంతాల్లోకి తరలించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఆరేళ్లుగా కోతుల బెడద.. మా గ్రామంలో రెండు వేల కోతులు సంచరిస్తున్నాయి. ఆరేళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. పెట్టుబడులు పెట్టిన పంటలపై దాడి చేసి తినేస్తున్నాయి. ఏడాదికి రూ. రెండు లక్షల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాం. ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. – యెనుముల వాసు, రైతు సంఘం నాయకుడు, బంగారుమెట్ట, బుచ్చెయ్యపేట మండలం మిగిలిన గ్రామాల్లో కోతులను నిర్మూలించాలి రైతుల ఇబ్బందులను రైతు సంఘం నాయకుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. కోతులు నిర్మూలనకు తొలుత బంగారుమెట్ట, సత్యవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు జిల్లాలో మిగిలిన గ్రామాల్లో కోతుల నిర్మూలనకు అధికార్లు చర్యలు చేపట్టాలి. – చిక్కాల రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ -
‘బుర్ర’కు పదును పెట్టి.. కోతులను తరిమి!
పలమనేరు: మామిడి తోటలో బీభత్సం సృష్టిస్తున్న వానరాల నుంచి పండ్లను కాపాడుకునేందుకు ఆ రైతు వినూత్న ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు. పలమనేరు మండలంలోని రంగినాయునిపల్లికి చెందిన సుబ్రమణ్యం నాయుడుకు 20 ఎకరాల మామిడి తోపుంది. ఇప్పుడు కాయలు పక్వానికి వచ్చి త్వరలో కోత కోయాల్సి ఉంది. కోతుల కారణంగా పంటను ఎలా కాపాడుకోవాలనుకునే క్రమంలో కర్ణాటకలోని ముళబాగిలు ప్రాంతంలో వానరాలు భయపడే బొమ్మలను విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్ళి రూ.500 పెట్టి భయంకరమైన, వికృతమైన తల ఆకారాన్ని తెచ్చుకున్నాడు. దాన్ని రైతు తలకు బిగించుకొని కోతుల వద్దకెళితే అవి భయపడి పారిపోతున్నాయి. ఆ వికృతమైన తలవైపునకు కోతులు అసలు చూడడం లేదని రైతు తెలిపాడు. కోతులను తరిమేస్తున్న ఈ బొమ్మను చూసేందుకు చుట్టుపక్క రైతులు కూడా ఆసక్తిగా వస్తున్నారు. -
ప్రిన్సిపల్ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం
భోపాల్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొంత శాంతించడంతో పలు రాష్ట్రాల్లో కొన్ని జాగ్రత్తలు, ఆంక్షల నడుమ విద్యాలయాలు తెరుచుకుంటున్నాయి. కొన్ని నెలల తర్వాత తెరుచుకోవడంతో పాఠశాలలు అధ్వానంగా మారాయి. కొన్నిచోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వాటిని పాఠశాల సిబ్బందితో కలిసి విద్యార్థులు కూడా శుభ్రం చేశారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోనూ విద్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే ఓ పాఠశాలలో తలుపులు తెరవగానే ప్రిన్సిపల్ భయపడ్డాడు. తన కుర్చీలో అనుకోని అతిథి ప్రత్యక్షమవడంతో ఖంగు తిన్నాడు. మధ్యప్రదేశ్‌లో 11, 12వ తరగతులు కూడా సోమవారం (జూలై 26వ తేదీ) నుంచి ప్రారంభమయ్యాయి. గ్వాలియర్ జిల్లాలోని డబ్రాలో పాఠశాల తెరవగానే కోతులు ప్రత్యక్షమయ్యాయి. తరగతి గదుల్లో అవి విద్యార్థుల్లాగా కూర్చున్నాయి. నానా హంగామా చేశాయి. ఇక ప్రిన్సిపల్ తన గది తెరవగా అక్కడ కూడా వానరాలు బీభత్సం సృష్టించాయి. ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చుని ప్రిన్సిపల్నే భయపెట్టాయి. విద్యార్థులు కూడా భయపడడంతో ప్రిన్సిపల్ ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు ధైర్యం చేసి వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. -
కోతుల దాడి..గుండెపోటుతో వ్యక్తి మృతి
ముస్తాబాద్: వానరమూక చేసిన దాడి నుంచి ఆ పశువుల కాపరి ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ గాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు చెందిన కర్నె వెంకటి(52) శనివారం పశువులను మేపేందుకు గ్రామ శివారులోకి వెళ్లాడు. అక్కడ గుట్టల ప్రాంతంలో కోతులు గుంపుగా వచ్చి వెంకటిపై దాడి చేశాయి. స్వల్ప గాయాలకు గురైన వెంకటి గ్రామస్తులకు ఫోన్ చేశాడు. వారు అతడిని ముస్తాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. కోతుల దాడితో తీవ్ర భయాందోళనలకు గురైన వెంకటి గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అతనికి భార్య మణెవ్వ, కూతురు లక్ష్మి ఉన్నారు. -
వానరాల దాడి.. గర్భిణికి గాయాలు
మెదక్ రూరల్: కోతుల దాడితో భయపడిన ఓ గర్భిణి భవనం నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన సంఘటన మెదక్ మండలం బ్యాతోల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొనిగండ్ల స్రవంతి ఐదు నెలల గర్భిణి. సాయంత్రం వేళ తన భవనంపై ఆరబెట్టిన బట్టలను తెచ్చేందుకు పైకి ఎక్కింది. దీంతో కోతులు స్రవంతిపై దాడి చేశాయి. భయపడిన ఆమె వాటి నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో స్రవంతి రెండు చేతులు విరిగిపోయాయి. వెంటనే కుటుంబీకులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.