ఎల్ నినో తప్పదా?
వాన చినుకు రైతన్నను వంచిస్తోంది! అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నోటికందక ఒకసారి... చినుకు కోసం ఎదురుచూపులతో ఇంకోసారి... ఏళ్లుగా ఇదే వాతావరణం తీరు. గోరుచుట్టుపై రోకటి చందంగా... ఈ ఏడాది ఎల్ నినో ఒకటి దాపురించనుంది. ఎక్కడో దక్షిణ అమెరికా దగ్గర సముద్రం వెచ్చబడితే... మనకు వానలు తగ్గడమేమిటి? ఏళ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లుగా... వాతావరణం చిత్రవిచిత్రంగా మారుతోందా? రుతుపవనాలు దారితప్పుతున్నాయా? లేక మరేదైనా కారణముందా? ఇదే ఈ వారం మన ‘ఫోకస్’...
గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
దేశంలోని కోట్ల మంది రైతులకు, వ్యాపారానికి ఆ మాటకొస్తే.. దేశ బడ్జెట్‌కు కీలకమైన వాతావరణ అంచనాలు ఇటీవలే వెలువడ్డాయి. గత నెలలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసిన ప్రాథమిక అంచనాల మేరకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడేందుకు 68 శాతం అవకాశం ఉంది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్ నినో (ఎల్ నినో అంటే? చూడండి) దీనికి కారణంగా చెబుతున్నారు. మూడు, నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఈ వాతావరణ దృగ్విషయం ఫలితంగా దక్షిణాసియా ప్రాంతంలో రుతుపవనాలు బలహీనపడతాయి. ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి. ఈ ఏడాది సమస్య ఎల్ నినో కావచ్చుగానీ.. కొన్నేళ్లుగా ఐఎండీ అంచనాలు గతి తప్పడం మాత్రం గమనార్హం. గత ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. వర్షాలు కొంతవరకూ తగ్గుతాయని ఐఎండీ చెబితే అసలు కురిసిన వానలు సగటు కంటే దాదాపు పది శాతం తక్కువగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది కూడా సాధారణ వర్షపాతం అన్న ఐఎండీ అంచనాలు తారుమారై అధిక వర్షాలు నమోదయ్యాయి. అంతెందుకు.. గత 21 ఏళ్లలో భారత వాతావరణ విభాగం లెక్కేసిన అంచనాల ప్రకారం వర్షాలు కురిసింది కేవలం ఆరుసార్లే! కర్ణుడి చావుకు కారణాలు నూరు అన్నట్లు... వాతావరణ అంచనాలు గతి తప్పేందుకూ అనేక కారణాలున్నాయి. ఐఎండీ నిన్న మొన్నటివరకూ ఉపయోగించిన పద్ధతి దీంట్లో ఒకటి. గత యాభై ఏళ్ల సగటు వర్షపాతం, కొన్ని ఇతర సూచికలతో కూడిన ఈ పద్ధతి దీర్ఘకాలిక సగటులో ‘ఫలానా’ శాతం వర్షాలు కురుస్తాయి అని మాత్రమే చెప్పేది. అందుకు ఎంతమేరకు అవకాశముందో మాత్రం చెప్పేది కాదు. గత ఐదారేళ్లలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఆధునిక టెక్నాలజీ సమకూర్చుకోవడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ వాతావరణ సంస్థలు వెలువరించే అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఏప్రిల్‌లో ప్రాథమిక, జూన్‌లో తుది అంచనాలు వెలువరించడం మొదలుపెట్టింది.
వాతావరణ మార్పుల ప్రభావం
పారిశ్రామిక విప్లవ కాలం నుంచి భూమి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వంటివి దీనికి కారణాలు. దీని వల్ల కార్బన్ డైయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, భూగత మీథేన్ వంటి ప్రమాదకర వాయువులు వాతావరణంలోనే ఉండిపోయి.. వేడిని నిల్వ చేసుకుంటాయి. ఈ భూతాపోన్నతి కారణంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయనీ, ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరిగిపోయి సముద్రమట్టాలు పెరిగిపోతాయనీ, తీరప్రాంతంలోని మహానగరాలూ నీటమునుగుతాయనీ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ ఛేంజ్’ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎల్ నినోనే ఒక ఉదాహరణగా తీసుకుంటే.. వాతావరణ వివరాలను నమోదు చేయడం మొదలుపెట్టినప్పటి (1880) నుంచి 2005 వరకూ వచ్చిన ఎల్ నినోల్లో సగం కరవుకు కారణం కాలేదు. కానీ 1990 నుంచి 2005 మధ్యకాలంలో మాత్రం మొత్తం 13 సార్లు వర్షాభావ, కరువు పరిస్థితులు నమోదైతే.. ఇందులో పదిసార్లు అవి ఎల్ నినో వచ్చిన ఏడాదిలోనే ఉండటం గమనార్హం. భూమి సగటు ఉష్ణోగ్రతలు కూడా గత 200 ఏళ్లలో దాదాపు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు పెరిగాయి. కానీ ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూండటం గమనార్హం. రెండేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌ను కుదిపేసిన కుంభవృష్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రెండు వారాల్లోపే అతితక్కువ సమయంలో అత్యధిక వర్షాలు కురవడం, గంగానది శివాలెత్తి తీర ప్రాంతాలను ముంచేయడం మన కళ్లముందే ఉంది. వాతావరణ మార్పుల ప్రభావానికి ఈ సంఘటన ప్రబల తార్కాణమన్నది నిపుణుల అంచనా. అంతకుముందు పాకిస్తాన్లో వచ్చిన కుంభవృష్టికీ (క్లౌడ్‌బరస్ట్), ఇటీవల కశ్మీర్లో వచ్చిన అకాల వరదలకూ వాతావరణ మార్పులే హేతువన్నది నిర్వివాదాంశం.తాజాగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలనే తీసుకుంటే... మామూలు పరిస్థితుల్లో ఈ కాలంలో కురిసే వానలకు పది రెట్లు ఎక్కువ కురవడం మనం గమనించవచ్చు. మార్చి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలంలో కురిసిన వర్షం ఒక ఏడాది వానలో 20 శాతం ఉందని ఐఎండీ తెలిపింది.
ఎల్ నినో ఖాయమేనా?
అంతర్జాతీయ సంస్థలతోపాటు ఐఎండీ కూడా ఈ ఏడాది ఎల్ నినో ఖాయమనే చెబుతున్నాయి. అయితే దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థితిలోనే ఉంటాయనీ,
ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ రుతుపవనాలపై దాని ప్రభావం పెద్దగా ఉండబోదనీ స్కైమెట్సీఈవో జతిన్ సింగ్ అంటున్నారు
తీరుతెన్నులూ మారుతున్నాయి...
దేశంలో ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. ఈ నాలుగు నెలల కాలంలోనే మనక్కావాల్సిన వర్షాల్లో 80 శాతం వరకూ కురుస్తాయి. అయితే ఇటీవల కొన్నిచోట్ల ఎక్కువ వర్షాలు పడటం... అది కూడా అతితక్కువ సమయంలో జరిగిపోవడం సాధారణం అవుతోంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటమూ మనం చూస్తున్నాం. 1980 - 2011 మధ్యకాలాన్ని పరిశీలిస్తే సగటు వర్షపాతం క్రమేపీ తగ్గుతోందనీ, అదేసమయంలో ఉత్తరాఖండ్ వంటి విపరీత పోకడల తీవ్రత పెరుగుతోందనీ స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వాతావరణ విభాగం ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. ‘‘ఒక రోజులో పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న సంఘటనలు దేశం మధ్యప్రాంతంలో ఎక్కువవుతున్నాయి. ఒక మోస్తరు వర్షాలు కురిసే సంఘటనలు తగ్గుతున్నాయి’’ అని గత ఏడాది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటన చేయడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే.. భవిష్యత్తులో రుతుపవనాల అంచనా మరింత సంక్లిష్టమవుతుందని దేశీ, విదేశీ సంస్థలు జరిపిన అధ్యయనాలు స్పష్టం చేస్తూండటం ఆందోళన కలిగించే అంశం.
ఎల్ నినో అంటే?
భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీచే గాలులు, వాటి పీడనాల్లోని తేడాల కారణంగా ఈ వెచ్చటి నీరు ప్రయాణించే దిశ మారిపోతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ వెచ్చటి నీటిని అధిక పీడనంతో కూడిన గాలులు తూర్పువైపు నుంచి పశ్చిమం వైపు తీసుకెళతాయి. అయితే అప్పుడప్పుడు ఇందులో తేడాలు వస్తాయి. గాలులు అంత బలంగా లేకపోవడం, పీడనం కూడా తక్కువగా ఉండటం వల్ల వెచ్చటి నీరు దక్షిణ అమెరికా ప్రాంతంలోనే ఉండిపోతుంది. ఈ వాతావరణ దృగ్విషయాన్నే ఎల్ నినో అని పిలుస్తారు!
నీటి వెచ్చదనంతో గాలి పొరలు వేడెక్కి తేలికగా మారతాయి. పైకి ఎగుస్తాయి. పైనున్న చల్లటిగాలి కిందకు దిగడం మొదలవుతుంది. ఫలితంగా దక్షిణ అమెరికాలోని పెరూ ఎడారుల వద్ద భారీ వర్షాలు నమోదవుతాయి.
గాలుల్లోని తేమంతా అక్కడే ఖర్చవడం వల్ల మేఘాలను మోసుకొచ్చే గాలులు బలహీనపడతాయి. కష్టమ్మీద తూర్పువైపు ప్రయాణిస్తాయి. దీం తో ఆస్ట్రేలియాతోపాటు భారత్, దక్షిణాసియాలో వర్షపాతం తగ్గుతుంది.
{Mిస్మస్కు కొంచెం అటు ఇటుగా సముద్రపు నీరు వెచ్చబడటాన్ని దృష్టిలో ఉంచుకుని పెరూ మత్స్యకారులు దీనికి ఎల్ నినో(పసి బాలుడు) అని పేరు పెట్టారు.
పది ఎలుక తోకలకు కిలో బియ్యం
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఫిలిప్పైన్స్ విచిత్రంగా సన్నద్ధమవుతోంది. ఎల్ నినో కాలంలో సంభవించే దిగుబడి నష్టాన్ని పూడ్చుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఎలుకల వేటను ప్రోత్సహిస్తోంది. పది తోకలను వేటాడి తెచ్చిన రైతులకు కిలో బియ్యాన్ని అందిస్తామని ప్రకటిస్తోంది. దీనివల్ల పంటలకు నష్టాన్ని కలిగించే ఎలుకల్ని చంపినట్టూ అవుతుంది, అవి కాజేసే మేరకు గింజల్ని మిగిల్చినట్టూ అవుతుంది. ఇప్పటివరకు రైతులు సుమారు 37,000 ఎలుక తోకల్ని పోగేయగలిగారు.
25% ఎల్ నినో సంభవించిన ఏడాదిలో సగటున దిగుబడి 25 శాతం తగ్గుతుందని అంచనా!
68% భారత వాతావరణ విభాగం (ఐఎండీ) విడుదల చేసిన ప్రాథమిక అంచనాల మేరకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడేందుకు దాదాపు 68 శాతం అవకాశముంది.
6 గత 21 ఏళ్లలో భారత వాతావరణ విభాగం లెక్కేసిన అంచనాల ప్రకారం వర్షాలు కురిసింది కేవలం ఆరుసార్లే!
10 1880 నుంచి 2005 మధ్యకాలంలో వచ్చిన ఎల్ నినోల్లో సగంసార్లు మాత్రమే తక్కువ వర్షాలు కురిశాయి. అయితే 1950 తరువాత వర్షాభావ సంవత్సరాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 13 కరువు సంవత్సరాలు ఉంటే వాటిల్లో పది ఎల్ నినోలు వచ్చినప్పుడే నమోదవడం గమనార్హం.