మేఘమా..జాలి చూపుమా ! | Farmers hopes on Southwest monsoon | Sakshi
Sakshi News home page

మేఘమా..జాలి చూపుమా !

Published Wed, Jun 18 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

మేఘమా..జాలి చూపుమా !

మేఘమా..జాలి చూపుమా !

ఖరీఫ్ దోబూచులాడుతోంది. కారుమేఘం కరుణించనంటోంది. రుతుపవనాలు అదిగో ఇదిగో అనడమే తప్పిస్తే.. వర్షం జాడ కరువైంది. అక్కడక్కడా విత్తనం వేసినా.. వడగాడ్పుల ధాటికి మొలక మాడుతోంది. వరుణుడు ముఖం చాటేయడం రైతన్న ఆశలను ప్రశ్నార్థకం చేస్తోంది. పెట్టుబడి సమస్యతో అతికష్టం మీద సాగుకు సమాయత్తమైన అన్నదాత బతుకు భారమవుతోంది.
 
కర్నూలు(అగ్రికల్చర్) : సాధారణంగా జూన్ రెండో వారంలో రుతు పవనాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. ప్రస్తుతం మూడో వరం గడుస్తున్నా ఆ జాడే కనిపించని పరిస్థితి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.1 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 58.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. నెల మొదట్లో ఒకట్రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసినా రుతు పవనాలు విస్తరించకపోవడంతో ఎండత తీవ్రత రెట్టింపయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ విడత విత్తన పనులు మొదలైనప్పటికీ ఎల్‌నినో ప్రభావం, రుతు పవనాల జాప్యం ఖరీఫ్‌పై ప్రభావం చూపుతోంది. ఖరీఫ్ సాధారణ సాగు 5,85,351 హెక్టార్లు కాగా.. జిల్లాలోని 20,724 హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. ఇందులో అత్యధికంగా 13,169 హెక్టార్లలో పత్తి సాగయింది.
 
తగిన తేమ లేకపోవడంతో 5 వేల హెక్టార్లలో పత్తి విత్తనం మొలకెత్తకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది పత్తి 1.50 లక్షల హెక్టార్లలో సాగవగా.. ఈసారి 2 లక్షల హెక్టార్లు దాటవచ్చని తెలుస్తోంది. పత్తి సహా వేరుశనగ, ఇతర అన్ని పంటల సాగుకు జూలై చివరి వరకు అవకాశం ఉన్నా పత్తి, ఆముదం, కంది పంటలను జూన్ చివరిలోగా వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళిక ప్రకారం జిల్లాలో అత్యధికంగా వేరుశనగ 1,34,916 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉంది.
 
ఇందుకోసం జిల్లాకు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ సబ్సిడీపై పంపిణీకి మంజూరైంది. 1,327 హెక్టార్లలో సాగు చేపట్టినా విత్తన పంపిణీ ఊసే కరువైంది. ఏపీ సీడ్స్ వంటి సప్లయ్ ఏజెన్సీలకు వేరుశనగ సరఫరా చేసే దళారీలు(ఆర్గనైజర్లు) ప్రభుత్వం నుంచి భారీ ధరను ఆశిస్తున్నారు. ప్రభుత్వం వీరికిచ్చే ధరను ఇంతవరకు ఖరారు చేయకపోవడంతో వేరుశనగ పంపిణీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జీలుగ, పిల్లి పెసర విత్తనాల జాడే లేకపోవడం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది.
 
బ్లాక్‌లో పత్తి విత్తనాలు
కొన్ని బ్రాండెడ్ కంపెనీల పత్తి విత్తనాలను వ్యాపారులు బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జాదు, అజిత్ 155 తదితర రకాలను వ్యాపారులు రూ.1100 నుంచి ఆపై ధరకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లో అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు అమ్ముతునా వ్యవసాయ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇవి నకిలీ విత్తనాలు కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం.
 
పెట్టుబడి సమస్య: ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారం కోసం రైతుల వ్యవసాయ రుణాలు, మహిళల డ్వాక్రా రుణాల మాఫీని ప్రకటించి లబ్ధి పొందారు. అధికారం దక్కగానే మొద టి సంతకంగా రుణమాఫీ అమలుకు విధి విధానాలను రూపొందించేందుకు కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఈ హామీని వాయిదా వేసేందుకే ఆయన ఈ కొత్త డ్రామాకు తెర తీసినట్లు చర్చ జరుగుతోంది. రుణమాఫీ హామీ నేపథ్యంలో బ్యాంకులు పంట రుణాల పంపిణీకి ముందుకురాని పరిస్థితి నెలకొంది.
 
 పైగా రుణాలను చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈ కారణంగా రైతులను పెట్టుబడి సమస్య వెంటాడుతోంది. ఎకరం భూమిలో పత్తి విత్తనం వేయాలంటే కనీసం రూ.10 వేలు అవసరం. విధిలేని పరిస్థితుల్లో మే, జూన్ నెలల్లో జిల్లాలో 10 వేల మందికి పైగా రైతులు బంగారం కుదువ పెట్టి రూ.50 కోట్లకు పైగా అప్పులు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రూ.3, రూ.5 వడ్డీతోనూ మరికొందరు పెట్టుబడి మొత్తం సమకూర్చుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement