మళ్లీ సెగలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం
పశ్చిమ గాలుల ప్రభావం
విశాఖపట్నం: దాదాపు వారం రోజుల పాటు వాతావరణం చల్లదనాన్ని పంచింది. రుతుపవనాల రాకకు ముందు కురిసే వానలతో వేడిని చల్లార్చింది. సుమారు ఇరవై రోజుల పాటు కొనసాగిన ఉష్ణతాపంపై నీళ్లు చల్లింది. మేఘాలు, చిరుజల్లులతో అంతా హాయిగా ఉందనుకుంటున్న తరుణంలో మళ్లీ ఉష్ణతాపం మొదలైంది. సెగలు పుట్టిస్తోంది. దీంతో జనం బయటకు వెళ్లడానికి వెనకంజ వేస్తున్నారు. నడినెత్తిన పడుతున్న భానుడి కిరణాలను తాళలేక పోతున్నారు. సూర్యతాపం నుంచి ఉపశమనం పొందడానికి గొడుగులను ఆశ్రయిస్తున్నారు. రెండ్రోజుల క్రితం నగరంలో ఈ నెల 8న 26.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది శీతాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రత. ఆ మర్నాడు (మంగళవారం) ఒక్కసారిగా పది డిగ్రీలు పెరిగి 37 డిగ్రీలకు చేరుకుని వేసవి తాపాన్ని గుర్తు చేసింది.
బుధవారం 36.4 డిగ్రీలు రికార్డయి దాదాపు అంతే ఉష్ణతీవ్రత కొనసాగింది. ప్రస్తుతం పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మళ్లీ ఊపందుకున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరికొన్నాళ్లు ఇవి కొనసాగుతాయని అంటున్నారు. అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావ ంతో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి కురుస్తాయని, అయినప్పటికీ ఉష్ణతీవ్రత ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి వచ్చే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు.