పోలీసుల అదుపులో మాఫియా డాన్
ఉత్తర ఆఫ్రికాలో పట్టుబడ్డ బన్నంజె రాజ
బెంగళూరు : రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మాఫియాడాన్ బన్నంజె రాజను ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర హోంశాఖ అధికారులు అతన్ని బంధించి రాష్ట్రానికి తీసుకురావడానికి సమాయత్తమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూలతహా ఉడిపి జిల్లాలోని బన్నంజె గ్రామానికి చెందిన రాజేంద్ర అలియాస్ బన్నంజె రాజ 1990లో పీయూసీ చదివే సమయంలోనే తన సహ పాఠకుడైన ఒకరిని కళాశాల మొదటి అంతస్తు నుంచి కిందికి తోసి వేశాడు. జైలు జీవితం అనంతరం బైటకు వచ్చిన అతను బెదిరించి డబ్బు వసూలు చేయడంతోపాటు వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవాడు మొదట్లో ఛోటారాజన్ అనుచరుడిగా గుర్తించబడ్డా అటుపై అండర్ వరల్డ్‌లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. తర్వాత హత్యలు, కిడ్నాపులు, భూ కబ్జాలకు పాల్పడి కోట్లాది రూపాయలు వసూలు చేసేవాడు.
బెంగళూరులోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 11 కేసులతో పాటు రాష్ట్ర వ్యాప్త్తంగా వేర్వేరు జిల్లాల్లో మొత్తం 26 కేసులు నమోదయ్యాయి. 1998లో దుబాయికు పారిపోయి అక్కడి నుంచి కర్ణాటకలోని పారిశ్రామిక వేత్తలను బెదిరించి డబ్బు వసూలుకు పాల్పడేవాడు. ఇదిలా ఉండగా ఇటీవల తన మకాంను మొరాకోకు మార్చి అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడే వాడు. ఇతనిపై ఇంటర్‌పోల్ కూడా రెడ్కార్నర్ను కూడా జారీ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు బన్నంజె రాజను అరెస్టు చేసి ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసులకు కూడా తెలియజేశారు. అప్రమత్తమైన పోలీసులు బన్నంజె రాజను అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకురావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, 2009లోనే ఇతన్ని దుబాయిలోని పోలీసులు అరెస్టు చేసినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర పోలీసులు అప్పట్లో రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు.