దారితప్పి.. అమ్మదరి చేరి...
అమ్మ, ఇల్లు, బడి మినహా ఆ నాలుగేళ్ల బాలికకు మరో ప్రపంచం తెలియదు. అమ్మ పంపితే.. ఉప్మా బడికంటూ బయలుదేరి దారితప్పింది. బిత్తరచూపులు చూస్తున్న ఆ బాలికను ఓ సైకిల్ మెకానిక్ చేరదీశాడు. ‘సాక్షి’ చొరవతో సైకిల్ మెకానిక్, పోస్ట్మన్ జరిపిన అన్వేషణతో.. ఆరున్నర గంటల తర్వాత ఆ బాలిక తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఉలిమేశ్వరం గ్రామానికి చెందిన డెక్కా శ్రీనివాస్, రాణికి ఇద్దరు కుమార్తెలు. నాలుగు రోజుల క్రితం కాండ్రకోటకు మకాం మార్చారు. పెద్ద కుమార్తె నాలుగేళ్ల మౌనికను రాణి తమ్ముడు దొరబాబుతో శనివారం అంగన్వాడీ కేంద్రానికి పంపింది. దొరబాబు ఆ పాపను ఓ కళాశాల విద్యార్థికి ఇచ్చి పంపించాడు. అతడు మరోచోట ఆ బాలికను దించి, వెళ్లిపోయాడు. చాలాసేపు ఏడుస్తున్న ఆ బాలికను సైకిల్ మెకానిక్ జట్లా చంద్రరావు చేరదీశాడు. అదే ప్రాంతంలో ఉంటున్న రాకుర్తి వెంకటలక్ష్మి ఆ పాపకు భోజనం పెట్టింది. సమాచారం అందుకున్న ‘సాక్షి’ విలేకరి చొరవతో మెకానిక్ చంద్రరావు, పోస్ట్మన్ పొన్నాడ సత్య గంగాధరం కలిసి ఉలిమేశ్వరంలో పాప చిరునామా అన్వేషించారు. అక్కడి స్థానికులు బాలికను గుర్తించడంతో వీరి ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు ఆరున్నర గంటల ఉత్కంఠ తర్వాత కాండ్రకోటలోని తల్లిదండ్రులకు బాలికను అప్పగించారు.
– పెద్దాపురం