ద్రవిడ్ ఒప్పుకుంటాడా?
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 'గోడ'లా నిలబడి మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి టీమిండియాకు ఆశాకిరణంగా మారాడు. క్రీజ్‌ను అంటిపెట్టుకుని ఎన్నోసార్లు భారత క్రికెట్ జట్టును గట్టెక్కించిన ఈ సీనియర్ ఆటగాడి సేవలు మరోసారి టీమ్‌కు అవసరమయ్యాయి. బ్యాట్స్‌మన్, కెప్టెన్, కీపర్‌గా మైదానంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి సగౌరవంగా ఆట నుంచి నిష్క్రమించిన ద్రవిడ్‌ను మార్గదర్శకుడి పాత్ర పోషించాలంటున్నారు సీనియర్లు. కోచ్ అవతారం ఎత్తాలని అభిలషిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన తర్వాత ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రమే కొనసాగుతున్నాడు. గత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అయితే త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఎడిషన్‌లో ద్రవిడ్ ఆడడం లేదు. ఈ సీజన్లో ఆడడని గత ఏడాదే ద్రవిడ్ ప్రకటించాడు. అన్నట్టుగానే వైదొలగాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు రాయల్స్ పగ్గాలు అప్పజెప్పి తప్పుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు మెంటర్(మార్గదర్శకుడు)గా కొత్త పాత్రలోకి ప్రవేశించాడు ద్రవిడ్.
ఇదిలావుంచితే వరుస పరాజయాల బాటలో పయనిస్తున్న టీమిండియాను గాడిలో పెట్టేందుకు రాహుల్ ద్రవిడ్‌ను చీఫ్ కోచ్‌గా నియమించాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. టీమిండియాకు యువ కోచ్ అవసరమన్న గవార్కర్... అందుకు సరైన వ్యక్తి ద్రవిడ్ అని చెప్పారు. ప్రస్తుత కోచ్ ఫ్లెచర్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారని అతడిని తప్పించి ద్రవిడ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించాలన్నారు. ద్రవిడ్ పట్ల అందరికీ గౌరవముందని, అతడి మాట స్టార్ ఆటగాళ్లు కూడా వింటారని అన్నారు.
గవార్కర్ ప్రతిపాదనపై అటు బీసీసీఐ, ఇటు ద్రవిడ్ స్పందించలేదు. కోచ్‌గా నియమిస్తామని బీసీసీఐ ప్రతిపాదిస్తే ద్రవిడ్ కాదనకపోవచ్చు. ఆట కోసం తపించే ద్రవిడ్‌ను కోచ్‌గా పెడితే ఎవరూ వ్యతిరేకించకపోవచ్చు. అయితే కెప్టెన్‌గా రాణించలేకపోయిన ద్రవిడ్ కోచ్‌గా రాణిస్తాడా అన్న అనుమానం కలుగుతోంది. నాయకుడిగా నిలదొక్కులేకపోయిన ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఆట కోసం అతడు పడే కష్టం చూస్తే ఇటువంటి అనుమానాలకు తావుండదు. కోచ్ పదవిలో ద్రవిడ్ తప్పకుండా సత్తా చూపుతాడన్న నమ్మకాన్ని గవార్కర్ వ్యక్తం చేశారు. ద్రవిడ్‌ను కొత్త పాత్రలో చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. జట్టు వెనకుండి నడిపించే బాధ్యత ద్రవిడ్ కు దక్కుతుందో, లేదో చూడాలి.