M.shiva prasad
-
మామూళ్ల మంత్రం...‘మంత్రి’దండం!
ఎమ్మార్పీ ఎక్కడైనా అమలు చేయవచ్చేమో కానీ మద్యం సీసాలపై మాత్రం కాదు... కానేకాదు! మత్తుకు బానిసైన లక్షలాది మంది రోజూ మద్యం సీసాపై రూ.15 అదనంగా చెల్లించుకుంటున్నారు! ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకొని చెల్లిస్తున్న ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోంది? తొలుత సిండికేట్‌కు... అక్కడి నుంచి అధికార పార్టీ నాయకులకు! ఈ వ్యవహారం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులకూ కొంత మొత్తం వెళ్తోందన్న విమర్శలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జిల్లా కలెక్టరుగా పనిచేసి ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా వెళ్లిన పి.లక్ష్మీనరసింహం... ఎక్సైజ్ శాఖను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు! కానీ అధికార పార్టీ నాయకుల ముందు అవేవీ పనిచేయవని రుజువవుతూనే ఉంది! తాజాగా జిల్లా ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డీసీ ఎం.శివప్రసాద్ ఇంట్లో శుక్రవారం జరిగిన ఏసీబీ తనిఖీల్లో ఏకంగా రూ. 4.50 లక్షల నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో 235 మద్యం దుకాణా లు, 17 బార్లు ఉన్నాయి. కానీ బెల్ట్‌షాపులు, అనధికార పర్మిట్ రూమ్‌లు లెక్కలేనన్ని ఉన్నా యి. గత మూడేళ్లుగా అధికార పార్టీ నాయకులు, వారిలో ముఖ్యంగా జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడి కుడిభుజంగా వ్యవ‘హరి’స్తున్న వ్యక్తి కనుసన్నల్లోనే సిండికేట్ నడుస్తోంది. బెల్ట్‌షాపు నిర్వాహకులకు అండదండలు అందిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో గుంటూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చినవెంటనే సామాన్యుల ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తున్న బెల్ట్‌షాపులను నిరోధిస్తామని, దఫదఫాలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ప్రజల్లో సానుకూల స్పందనలు రావడంతో టీడీపీ ప్రభుత్వం మేల్కొంది. బెల్ట్‌షాపులను తామే నిరోధిస్తామంటూ ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆచరణలో అది సాధ్యం కావట్లేదు! సిండికేట్ అండతో బెల్ట్‌షాపులకు బదులు ‘ఇంటి వద్దకే మద్యం’ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఒక్కో వినియోగదారుడు ఆరు వరకూ మద్యం బాటిళ్లు కొనుక్కునేందుకు ఉన్న వెసులుబాటును అలుసుగా తీసుకుంటున్నారు. బెల్ట్‌షాపు నిర్వాహకుడు మద్యం దుకాణాల నుంచి ఆరు బాటిళ్లు ఒకేసారి తీసుకెళ్లి తమ కస్టమర్లు కోరినచోట అందజేసి వస్తున్నాడు. బెల్ట్‌షాపులు నిరోధించేశామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నా చాపకింద నీరులా ఈ అక్రమ మద్యం వ్యాపారం సాగిపోతోంది. ప్రస్తుతం సగటున జిల్లాలో నెలకు రూ.35 కోట్ల వరకూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పండుగలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు అది రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకూ చేరుతోంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరుగుతున్న జిల్లాల్లో శ్రీకాకుళం ముందు వరుసలో ఉందంటే పరిస్థితి ఊహించవచ్చు. అక్రమాలకు తలుపులు బార్లా... లైసెన్స్ ఫీజుకు రూ.2 లక్షలు అదనంగా చెల్లించిన మద్యం దుకాణ యజమానులందరికీ ప్రభుత్వం ఆయా దుకాణాల పక్కనే పర్మిట్‌రూమ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన బాటిల్‌ను అక్కడికి తీసుకెళ్లి తాగడానికి మాత్రమే అనుమతి ఉంది. అలాగే రూ.5 వేలు చెల్లించి అనుమతి తీసుకున్న ఇద్దరేసి నౌకరీనామాలతోనే విక్రయాలు సాగించాలి. కానీ అందుకు భిన్నంగా జిల్లాలోని చాలాచోట్ల పర్మిట్‌రూమ్‌ల్లో వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాన్ని ఉదయం 10.30 గంటలకు తెరిచి... రాత్రి 10.30 గంటలకు మూసేయాలి. పర్మిట్‌రూమ్‌లకు అదే నిబంధన వర్తిస్తుంది. కానీ దుకాణాలు మూసేసి అన్ని రకాల మద్యం బాటిళ్లను పర్మిట్ రూమ్‌ల్లో పెట్టించి తెల్లవారుజాము 4 గంటల నుంచి మొదలు అర్ధరాత్రి 12 గంటల వరకూ విక్రయాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ సవ్యంగా జరగాలంటే లైసెన్స్డ్ వ్యాపారులు సిండికేట్‌కు నెలనెలా రూ.60 వేల వరకూ ముడుపులు చెల్లించాల్సిందే. దీనిలో అగ్రభాగం అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేయడానికిగాను ఎక్సైజ్ శాఖలోని కొంతమంది అధికారులకు కూడా కొంత వాటా వెళ్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో ఇనిచార్జ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఇంట్లో భారీగా నగదు లభించడం వాటికి ఊతమిస్తోంది. మరోవైపు ఎక్సైజ్ శాఖ వ్యవహారాలపై జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో జరగాల్సిన సమీక్ష సమావేశాలు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఈ సమావేశాలు నిర్వహించడంతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్ పి.లక్ష్మీనరసింహం ప్రత్యేకంగా మరింత దృష్టి పెడితే తప్ప ఆ శాఖ దారికొచ్చే పరిస్థితి కనిపించట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఏసీబీ వలలో ఎక్సైజ్ ఇన్చార్జి డీసీ
శ్రీకాకుళం సిటీ: జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ ఎం.శివప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర శుక్రవారం స్థానిక విలేకరులకు వెల్లడించారు. మద్యం వ్యాపారుల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారనే అభియోగాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ ఇంటిపై దాడులు చేశారు. నగరంలో ప్రభుత్వ బాలికల పాఠశాల ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్లో అద్దెకు ఉంటున్న శివప్రసాద్ ఇంట్లో క్షుణ్నంగా సోదాలు నిర్వహించారు. లెక్కలో లేని రూ.4.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును సీజ్ చేశామని, దీనిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. కాగా 2015 నుంచి శివప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా జిల్లా ప్రొషిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖలో పనిచేస్తున్నారు. 2017 ఫిబ్రవరి నుంచి ఇన్చార్జి డీసీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏసీబీ తనిఖీల్లో సీఐలు రమేష్, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
వింటేనే ఉంటారు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించిన మరో అధికారి మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహానికి గురయ్యారు. అటవీ భూముల సంరక్షణ, అటవీ సంపద అక్రమ రవాణా విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తూ ర్పు డివిజన్ అటవీ అధికారి ఎం.శివప్రసాద్‌పై ఐదు నెలలకే వేటు పడింది. జిల్లాలోని తూర్పు, పశ్చిమ డివిజన్ అటవీ అధికారులను పరస్పరం బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పీకే.మహంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పు డివిజన్ అటవీ అధికారి ఎం.శివప్రసాద్‌ను పశ్చిమ డివిజన్‌కు, పశ్చిమ డివిజన్ అటవీ అధికారి జి.నర్సయ్యను తూర్పు డివిజన్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణంగా డీఎఫ్‌వోలను బదిలీ చేస్తే మరో జిల్లాకు పంపించాల్సి ఉండగా, వీరిద్దరిని జిల్లాలోనే అటు ఇటు మార్చడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన ఐదు నెలలకే.. ఎం.శివప్రసాద్ ఐదు నెలల క్రితమే తూర్పు డివిజన్ అటవీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే ఆయనకు మొదటి పోస్టింగ్. కొత్త అధికారి కావడంతో నిబంధన విషయంలో కచ్చితంగా వ్యవహరించారు. తూర్పు డివిజన్ లో అక్రమార్కుల పాలైన అటవీ భూముల పరిరక్షణను ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. అటవీ సంపద, ముఖ్యంగా కల ప అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలో నియోజకవర్గంలోనే అటవీ ప్రాం తం ఎక్కువ. ఇది తూర్పు డివిజన్ అటవీ అధికారిగా శివప్రసాద్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ కలప అక్రమ రవాణా మాఫియాకు మొదటి నుంచి రాజకీయ అండదండలు ఉన్నాయి. వీరికి శివప్రసాద్ అడ్డుగా మారారు. ఇలా చేయవద్దని, స్వాధీనం చేసుకున్న కలప బండ్లను వదిలివేయాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చి నా శివప్రసాద్ పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం వెళ్లారు. ఇది మంత్రి శ్రీధర్‌బాబుకు రుచించలేదని, అందుకే శివప్రసాద్‌ను బదిలీ చేశారని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. అటవీ భూముల పరిరక్షణతో... తూర్పు డివిజన్ అటవీశాఖ పరిధిలో 25 మండలాలు ఉన్నాయి. 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణం లో అటవీ భూములు ఉన్నాయి. అనర్హులు, ఆర్థికంగా ఉన్న వాళ్లు వ్యవసాయం పేరిట అటవీ భూములు పోడుగా మార్చడం, తర్వాత స్వాధీ నం చేసుకోవడం మంథని ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతోంది. ఐదేళ్లుగా అటవీ భూముల ఆక్రమణ ఎక్కవయింది. 600 ఎకరాలు ఇలా పరాధీనమయ్యాయని సమాచారం. కనీసం 200 ఎకరాలను మళ్లీ స్వాధీనం చేసుకునేందుకు శివప్రసాద్ చర్యలు మొదలుపెట్టడంతో బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు నెలల్లోనే జిల్లా మార్చితే బహిరంగంగా విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో జిల్లాలోనే ఇద్దరిని పరస్పరం మార్చినట్లు తెలుస్తోంది.