నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించిన మరో అధికారి మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహానికి గురయ్యారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించిన మరో అధికారి మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహానికి గురయ్యారు. అటవీ భూముల సంరక్షణ, అటవీ సంపద అక్రమ రవాణా విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తూ ర్పు డివిజన్ అటవీ అధికారి ఎం.శివప్రసాద్‌పై ఐదు నెలలకే వేటు పడింది.
జిల్లాలోని తూర్పు, పశ్చిమ డివిజన్ అటవీ అధికారులను పరస్పరం బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పీకే.మహంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పు డివిజన్ అటవీ అధికారి ఎం.శివప్రసాద్‌ను పశ్చిమ డివిజన్‌కు, పశ్చిమ డివిజన్ అటవీ అధికారి జి.నర్సయ్యను తూర్పు డివిజన్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణంగా డీఎఫ్‌వోలను బదిలీ చేస్తే మరో జిల్లాకు పంపించాల్సి ఉండగా, వీరిద్దరిని జిల్లాలోనే అటు ఇటు మార్చడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
బాధ్యతలు చేపట్టిన ఐదు నెలలకే..
ఎం.శివప్రసాద్ ఐదు నెలల క్రితమే తూర్పు డివిజన్ అటవీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే ఆయనకు మొదటి పోస్టింగ్. కొత్త అధికారి కావడంతో నిబంధన విషయంలో కచ్చితంగా వ్యవహరించారు. తూర్పు డివిజన్ లో అక్రమార్కుల పాలైన అటవీ భూముల పరిరక్షణను ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు.
అటవీ సంపద, ముఖ్యంగా కల ప అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలో నియోజకవర్గంలోనే అటవీ ప్రాం తం ఎక్కువ. ఇది తూర్పు డివిజన్ అటవీ అధికారిగా శివప్రసాద్ పరిధిలో ఉంటుంది. ఇక్కడ కలప అక్రమ రవాణా మాఫియాకు మొదటి నుంచి రాజకీయ అండదండలు ఉన్నాయి. వీరికి శివప్రసాద్ అడ్డుగా మారారు. ఇలా చేయవద్దని, స్వాధీనం చేసుకున్న కలప బండ్లను వదిలివేయాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చి నా శివప్రసాద్ పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం వెళ్లారు. ఇది మంత్రి శ్రీధర్‌బాబుకు రుచించలేదని, అందుకే శివప్రసాద్‌ను బదిలీ చేశారని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు.
అటవీ భూముల పరిరక్షణతో...
తూర్పు డివిజన్ అటవీశాఖ పరిధిలో 25 మండలాలు ఉన్నాయి. 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణం లో అటవీ భూములు ఉన్నాయి. అనర్హులు, ఆర్థికంగా ఉన్న వాళ్లు వ్యవసాయం పేరిట అటవీ భూములు పోడుగా మార్చడం, తర్వాత స్వాధీ నం చేసుకోవడం మంథని ప్రాంతంలో యథేచ్ఛగా సాగుతోంది. ఐదేళ్లుగా అటవీ భూముల ఆక్రమణ ఎక్కవయింది. 600 ఎకరాలు ఇలా పరాధీనమయ్యాయని సమాచారం. కనీసం 200 ఎకరాలను మళ్లీ స్వాధీనం చేసుకునేందుకు శివప్రసాద్ చర్యలు మొదలుపెట్టడంతో బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు నెలల్లోనే జిల్లా మార్చితే బహిరంగంగా విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో జిల్లాలోనే ఇద్దరిని పరస్పరం మార్చినట్లు తెలుస్తోంది.