కామరాజ్ జీవిత చిత్రంలో సముద్రకని
దక్షిణాదిన పేరున్న ప్రముఖ తమిళ రాజకీయ నాయకుడు కీర్తిశేషులు కామరాజ్ నాడార్. సీనియర్ కాంగ్రెస్ నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన జీవితంపై సినిమా ఇప్పుడు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు సముద్రకని నటిస్తున్నారు. తెలుగు సినిమాలు ‘నాలో...’ (2004), ‘శంభో శివ శంభో’ (2010)కు గతంలో దర్శకత్వం వహించిన సముద్రకని ప్రస్తుతం ‘జెండాపై కపిరాజు’ చిత్రానికి నిర్దేశకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కామరాజ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో ఎస్టేట్ డ్యూటీ అధికారిగా సముద్రకని కీలక సన్నివేశాల్లో కనిపించనున్నారు. కామరాజ్ మరణానంతరం ఆయన ఇంటికి వచ్చే పాత్ర అది. ఈ పాత్రకు అడగగానే, ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించినట్లు దర్శకుడు ఎ. బాలకృష్ణన్ చెప్పారు. ఇప్పటికే మహాత్మాగాంధీ జీవితంపై ‘ముదల్వర్ మహాత్మా’ కూడా తీసిన అనుభవం బాలకృష్ణన్‌కు ఉంది.
చిత్రం ఏమిటంటే, తమిళ ప్రజలు ఆరాధ్య నేతగా కొలిచే కామరాజ్ జీవితంపై ఈ సినిమా నిజానికి పదేళ్ళ క్రితం ఒకసారి రిలీజైంది. ఇప్పుడు కొత్తగా మరో 15 సీన్లు చిత్రీకరించి కలపడమే కాకుండా, పాత సినిమాను డిజిటల్‌గా పునరుద్ధరించి రిలీజ్ చేయనున్నారు. ఈ కొత్త సీన్లలోనే సముద్రకని కనిపిస్తారు. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో కామరాజ్ లాంటి నేతల జీవితకథలు సినిమాగా యువతరానికి ప్రేరణనివ్వడం కోసమే.
ఈ పునఃచిత్రీకరణ, రీ-రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. ‘‘రాజకీయాల్లోని చీకటి కోణమే తెలిసిన ఈనాటి యువతరానికి కామరాజ్ జీవితం తెలిపే సినిమా కావడంతో, ఆనందంగా నటించడానికి అంగీకరించాను’’ అని సముద్రకనిత అన్నారు. చారుహాసన్ లాంటి పలువురు నటించిన ఈ ‘కామరాజ్’ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు కావడం మరో విశేషం.