రాజాకు కోపం వచ్చింది...
చెన్నై: ఇళయరాజా స్వరపర్చిన పాటలను ప్రసారం చేయాలంటే ఇక ఎఫ్ ఎం రేడియోస్టేషన్లు, టీవీలు ఇక ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఇళయరాజా తాజా ప్రకటన చూస్తే ఇక వాళ్లు వేరే దారి వెతుక్కోవాల్సిందే అనిపిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు, ఇసైజ్ఞాని ఇళయరాజాకు కోపం వచ్చింది. నేను స్వరపర్చిన పాటలన్నింటి పైనా హక్కులు నావే.. కావాలంటే రైట్స్ కొనుక్కోండంటూ.. వివిధ ఎఫ్ఎం రేడియోస్టేషన్లు, టీవీలపై కొరడా ఝళిపించారు. తన అనుమతి లేకుండా తను కంపోజ్ చేసిన వేలాది పాటలను ఎలా వాడుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకముందు తన పాటలను వాడుకోవాలనుకునే వారెవరైనా తననుంచి గానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి గానీ అనుమతి తీసుకోవాలని తెగేసి చెబుతున్నారు. తన అనుమతి లేనిదే తన పాటలు ప్రసారం చేయడం చట్టవిరుద్దమంటున్నారు.
అంతేకాదు ఇలా వచ్చిన మొత్తంలో కొంతభాగాన్ని నిర్మాతలకు పంచి ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే మేధో సంపత్తి హక్కు మీద మళ్ళీ తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. నేను దుక్కిదున్ని సాగుచేశాను... నా పంటను అమ్ముకున్నాను నిజమే.. అంతమాత్రాన నేను నాటిన చెట్టును కూడా తీసుకుంటానంటే ఎలా అంటూ వాదిస్తున్నారు.