Musical Show
-
ఫేస్బుక్ పేజీ ద్వారా ‘సోల్‌మేట్’ ప్రదర్శన
షిల్లాంగ్: కరోనా పోరాటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిచేందుకు ప్రముఖులు, బడా పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఆ జాబితాలో మేఘాలయ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాండ్ కంపెనీ సోల్‌మేట్ చేరింది. సోషల్ మీడియా (ఫేస్బుక్ పేజీ) ద్వారా ప్రదర్శన ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ద్వారా నిధులు సేకరిస్తామని సోల్‌మేట్ బ్యాండ్ మ్యూజికల్ ఆర్టిస్ట్ రూడీ వాల్లాంగ్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికి, కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నవారికి వచ్చిన మొత్తం అందిస్తామని అన్నారు. కాగా, తమ ఫేస్బుక్ పేజీలో గత ఆదివానం సోల్‌మేట్ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమనుల నుంచి మంచి స్పందన వచ్చింనదని రూడీ తెలిపారు. ‘రూరల్ 7ట్రెప్ ఎయిడ్ కోవిడ్-19’పేరుతో విరాళాలు సేకరించామని వెల్లడించారు. ‘మేమున్న ప్రదేశం నుంచే లైవ్‌లో ప్రదర్శన ఇచ్చాం. మనదేశం నుంచే కాక విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా ఆర్థిక సాయం చేశారు. దాదాపు 8 లక్షల రూపాయలు సమకూరాయి. మరిన్ని విరాళాలు సేకరించి లాక్‌డౌన్‌తో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నవారికి .. వైరస్ నియంత్రణకై శ్రమిస్తున్నవారికి వాటిని అందిస్తాం. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మ్యూజిషిన్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నాం. ఆ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాం. కాగా, కరోనా కేసులు లేని రాష్ట్రాల్లో మేఘాలయ కూడా ఒకటి. ఆర్థిక పరంగా చూసుకుంటే లాక్డౌన్ సరైంది కాదని నా అభిప్రాయం’అని రూడీ పేర్కొన్నారు. -
'సైరా' మ్యూజిక్ డైరెక్టర్ లైవ్ కన్సర్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది నవంబర్ 24న తొలిసారి హైదరాబాద్‌లో మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జోనితా గాంధీ, దివ్యా కుమార్ తదితరులు పాల్గొనబోతున్నారు. సంగీత ప్రియులకు ఈ కార్యక్రమం వీనుల విందుగా ఉంటుందనడంలో సందేహం లేదని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. 'ఇంద్రధనుష్ - అమిత్ త్రివేది లైవ్ కాన్సర్ట్' అనే పేరుతో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనిషి తన జీవితంలో సంతోషం, బాధ, ప్రేమ ఇలాంటి ఎన్నో అనుభవాలను చవిచూస్తాడని, అలాంటి అనుభవాల కలయికనే ఇంద్రధనుస్సు అని సంబోధిస్తుంటారని అందుకే ఈ ప్రోగ్రామ్‌కు ఇంద్రధనుష్ అనే పేరుని పెట్టామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో అమిత్ సౌండ్‌లో కొత్త టెక్నాలజీని అందరికీ పరిచయం చేయబోతున్నారు. థియేటర్స్‌లో మ్యూజిక్ కంపోజర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అమిత్ త్రివేది పలు జింగిల్స్, యాడ్ ఫిలింస్‌కు పనిచేశారు. 'ఆమిర్' చిత్రంతో 2008లో మ్యూజిక్ డైరెక్టర్‌గా అమిత్ త్రివేది ఎంట్రీ ఇచ్చారు. 'దేవ్ డి' చిత్రం కోసం అనురాగ్ కశ్యప్‌తో జత కట్టారు. ఈ చిత్రానికిగాను అమిత్ త్రివేదికి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఉడాన్, వేకప్ సిద్, మన్ మర్జియాన్ వంటి చిత్రాలకు ఈయన తన సంగీతాన్ని అందించారు. ఇండియన్ సినిమాల్లో కొత్త సంగీతాన్ని పరిచయం చేసిన సంగీత దర్శకుల్లో అమిత్ త్రివేది తనదైన మార్కును చూపించారు. కేవలం పాశ్చాత్య సంగీత పోకడలతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. శాస్త్రీయ సంగీతంపై మంచి అవగాహన ఉంది. తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్ చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి'తో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఇక అమిత్ త్రివేది తొలిసారి హైదరాబాద్‌కు రానుండటంతో ఘనస్వాగతం పలికేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పాట మరిచిపోయింది.. నవ్వుల పాలు
న్యూయార్క్ : ఆమె పాడే పాటలకు వేలాది మంది అభిమానులు.. తను ఇచ్చే మ్యూజిక్ షోలతో అభిమానులకు, ఈవెంట్ ప్రొడ్యూసర్లకు పండగే. ఈ సింగర్ మైకు చేత పట్టి పాట పాడితే అవార్డులు సైతం దాసోహం అవుతాయి. ఆమె ఎవరో కాదు మూడు గ్రామీ పురస్కారాల గ్రహీత, అమెరికన్ పాప్ సింగర్, రచయిత అలిసియా బెత్ మూర్(పింక్). ఓ ఈవెంట్ సంస్థ న్కూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో పింక్ బృందంతో మ్యూజికల్ షోను ఏర్పాటు చేసింది. ఈ షోలో సొంతంగా కంపోజ్ చేసి, ఇప్పటికే ఎన్నో స్టేజిల మీద పాడి విజయవంతమైన పాటను పాడటానికి పింక్ సిద్ధం అయ్యారు. తన టీంతో కలిసి పాట పాడటం ప్రారంభించిన పింక్ మధ్యలో తడబడ్డారు. పాట చరణాలు మరిచిపోయి కోరస్ బృందం సహాయంతో పాట పూర్తి చేశారు. ఆ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు నవ్వుతూ ఉండటంతో పాట పాడటం అయిపోయాక క్షమించండి పాట మరిచిపోయాను అని పింక్ తెలిపింది. -
చెన్నై కోసం... రహమాన్ షో
ఎన్ని చేతులు సాయం చేసినా ఇంకా భారీ సాయం అందితే కానీ చెన్నై మామూలు స్థితికి వచ్చేలా లేదు. తుపాను దెబ్బకు పలువురు నిరాశ్రయు లయ్యారు. ఆస్తి నష్టం అపారం. దీంతో, తన వంతుగా ఏదైనా చేయాలని ఎ.ఆర్. రహమాన్ అనుకున్నారు. జనవరి 16న చెన్నైలో మ్యూజికల్ షో చేయనున్నారు. వచ్చే డబ్బును బాధితుల సహాయార్థం ఇవ్వనున్నారు. -
బ్రిట్నీ కాలు జారె...అభిమానుల గుండె జారె!
అది లాస్ ఏంజిల్స్‌లోని ఓ క్యాసినో. ఆ రోజు ఇసుక వేస్తే రాలనంత జనంతో ఆ క్యాసినో కిటకిటలాడిపోయింది. దానికి కారణం - బ్రిట్నీ స్పియర్స్. పాప్ ప్రపంచంలో తిరుగు లేదనిపించుకున్న ఈ బ్యూటీ ఆ రోజు ఓ మ్యూజికల్ షో చేయడానికి సమాయత్తమయ్యారు. అందుకే అభిమానులు అక్కడ గుమిగూడిపోయారు. ఆ రోజు ఎప్పటిలానే బ్రిట్నీ స్పియర్స్ అందంగా ముస్తాబై, వేదిక పైకి వచ్చారు. మైక్ అందుకుని, పాడడం మొదలుపెట్టారు. డాన్స్ కూడా మొదలైంది. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో బ్రిట్నీ కాలు జారింది. ఆ జారుడుకు చీలమండ దగ్గర ఆమెకేదో అసౌకర్యంగా అనిపించింది. కానీ, అభిమానులనూ, షో నిర్వాహకులనూ నిరాశపరచడం ఇష్టం లేక పళ్ళ బిగువున డాన్స్ కొనసాగించారు. కానీ, నొప్పి పెరిగిపోవడంతో ప్రదర్శన ఆపి, ఎకాఎకిన ఆస్పత్రికి వెళ్లిపోయారామె. దాంతో అభిమానుల గుండె జారిపోయింది. బ్రిట్నీకి ఏమైందో ఏమోనని కంగారుపడిపోయారు. ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా ‘‘నా మీద ప్రేమాభిమానాలు కనబరుస్తున్నందుకు ధన్యవాదాలు. చీలమండ దగ్గర బాగా దెబ్బ తగిలింది. మరేమీ ఫరవాలేదు. త్వరగా తగ్గిపోతుంది’’ అని అభిమానులకు తన ఆరోగ్య పరిస్థితిని బ్రిట్నీ తెలియజేశారు. దాంతో అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు.