Muttukuru
-
ఏపీజెన్కో ప్రాజెక్టులో పగిలిపోయిన ఈఎస్పీ హాపర్స్
ముత్తుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో శుక్రవారం 2వ యూనిట్‌కి సంబంధించిన (ఈఎస్పీ) యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ హాపర్స్ పగిలిపోయాయి. 30 టన్నుల బూడిద సామర్థ్యం కలిగిన 2 హాపర్స్ హటాత్తుగా పగిలిపోవడంతో ప్రాజెక్టు అంతా ఫ్లైయాస్(బూడిద) వ్యాపించి, దట్టంగా పైకిలేచింది. ఇప్పటికే 1వ యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిపివేయగా, ఈ ఘటనతో 2వ యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. బూడిదతో నిండిపోయే ఈ ఇనుప రేకులతో తయారు చేసిన హాపర్స్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, బూడిదను తొలగించాల్సిన బాధ్యత ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టు సంస్థ నిర్వహిస్తోంది. అయితే, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, యాష్ ప్లాంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే, ఈ హాపర్స్ నుంచి బూడిద సక్రమంగా వెలుపలకు రాకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి, పగిలిపోయి ఉంటాయని మరో వాదన వినిపిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి జరిగే క్రమంలో నిత్యం వేల టన్నుల ఫ్లైయాస్ వెలుపలకు చేరుతుంది. ఈ క్రమంలో 2 హాపర్స్ నిండిపోయి, పగిలిపోవడం వల్ల ఈ ప్రాంతమంతా బూడిద అలుముకొంది. పూర్తిగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు. దీంతో కిందపడే బూడిదను ట్రాక్టర్ల ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. మండుటెండల్లో విద్యుచ్ఛక్తికి విపరీతమైన డిమాండ్ ఉన్న పరిస్థితిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగలేదు. -
తండ్రిని రాడ్‌తో కొట్టి చంపిన కొడుకు
సాక్షి, ముత్తుకూరు(నెల్లూరు): కన్న తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన మండలంలోని బ్రహ్మదేవి గిరిజనకాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లంపల్లి సుబ్రహ్మణ్యం (35)కు వివాహమైంది. అయితే భార్యాభర్తలు విడిపోయారు. అతను కూలీ పనులకు వెళ్తుంటాడు. కుమారుడు వెంకటేశ్వర్లు స్థానిక హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. సుబ్రహ్మణ్యం మద్యం సేవించినప్పుడల్లా తన తల్లి మొలకమ్మ, కొడుకు, భార్యను దూషించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుబ్రహ్మణ్యం మద్యం మత్తులో తిట్టడం మొదలుపెట్టడంతో కొడుకు భరించలేకపోయాడు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపం పట్టలేక కొడుకు స్కూల్ బెంచ్ ఇనుప రాడ్‌తో తండ్రి తల వెనుక భాగంలో కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన బ్రహ్మదేవిలో కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కృష్ణపట్నం సీఐ షేక్ ఖాజావలీ, ఎస్సై అంజిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: పెళ్లిచూపులకు వెళ్తూ అనంతలోకాలకు) -
ముత్తుకూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రచారం
-
సర్వేపల్లి.. విలక్షణం!
రాజకీయ చైతన్యానికి సర్వేపల్లి నియోజకవర్గం పెట్టింది పేరు. విజ్ఞులైన ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కృష్ణపట్నం ఓడరేవు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గంలో వచ్చే నెల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాక్షి, ముత్తుకూరు: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సర్వేపల్లి నియోజకవర్గం(జనరల్)లో ఐదు మండలాలున్నాయి. మొదటిసారిగా 1955 సంవత్సరంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బెజవాడ గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి కమ్యూనిస్టుపార్టీ, ఒకసారి వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ముగ్గురు అభ్యర్థులు మాత్రం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కొత్త సెంటుమెంటు సృష్టించారు. సర్వేపల్లి నుంచి పోటీ చేసిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. 1967లో ఎస్సీ రిజర్వ్డ్ డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి 1955 ఎన్నికల్లో ఆత్మకూరు, సర్వేపల్లి నుంచి పోటీ చేసి, గెలుపొందారు. అనంతరం సర్వేపల్లికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి సోమిరెడ్డి పెద్దనాన్న సోమిరెడ్డి ఆదినారాయణరెడ్డిపై తోటపల్లిగూడూరుకు చెందిన వంగల్లు కోదండరామరెడ్డి ఏడు వేల ఓట్ల మెజారీతో గెలుపొందారు. 1962 ఎన్నికల్లో తోటపల్లిగూడూరు మండలంలోని పాపిరెడ్డిపాళేనికి చెందిన వేమారెడ్డి వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిటింగ్ ఎమ్మెల్యే కోదండరామరెడ్డిపై 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు ఈయన నరుకూరు గ్రామానికి మునసబుగా పనిచేశారు. 1967లో సర్వేపల్లి ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు గ్రామానికి చెందిన స్వర్ణా వేమయ్య కమ్యూనిస్టు యోధుడైన పుచ్చలపల్లి సుందరయ్యకు సన్నిహితుడు. కీలక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వేమయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి జోగి శంకరరావుపై 266 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1972 ఎన్నికల్లో అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన మంగళగిరి నానాదాసు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో స్వర్ణా వేమయ్యపై గెలుపొందారు. ఉద్దండులపై సీవీ శేషారెడ్డి విజయం 1978లో సామాన్య రైతు కుటుంబం నుంచి చిత్తూరు వెంకటశేషారెడ్డి రంగంలోకి దిగారు. మడమనూరు, పంటపాళెం సర్పంచ్‌గా పనిచేశారు. ఈయన ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయ గురువైన ఆనం భక్తవత్సలరెడ్డి, ఉద్దండుడైన గునుపాటి రామచంద్రారెడ్డితో తలపడ్డారు. 21,962 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో రాష్ట్రమంతటా ఎన్టీయార్ ప్రభంజనం రాజ్యమేలింది. తోటపల్లిగూడూరు మండలంలోని రావూరువారికండ్రిగకు చెందిన న్యాయవాది చెన్నారెడ్డి పెంచలరెడ్డి టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి బరిలో నిలిచారు. 15,277 ఓట్ల మెజార్టీతో సీవీ శేషారెడ్డిపై విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో ముత్తుకూరుకు చెందిన వ్యవసాయ పట్టభద్రుడు ఈదూరు రామకృష్ణారెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కోటంరెడ్డి విజయకుమార్‌రెడ్డిపై 21,566 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989 ఎన్నికల్లో ఆయన తిరిగి పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీవీ శేషారెడ్డి టీడీపీ అభ్యర్థి పూండ్ల దశరథరామిరెడ్డిపై 13,148 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రభుత్వ విప్ పదవి చేపట్టి సర్వేపల్లిలో అభివృద్ధి పనులు పరుగులు తీయించారు. అల్లీపురానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సారా వ్యతిరేక ఉద్యమం ద్వారా సర్వేపల్లిలోకి ప్రవేశించారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై సోమిరెడ్డి 33,775 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి రెండోసారి సీవీ శేషారెడ్డిపై పోటీ చేసి, 16,902 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆదాల ప్రభాకరరెడ్డి 2004లో సోమిరెడ్డి దూకుడుకు కళ్లెం వేశారు. 2004 ఎన్నికల్లో సోమిరెడ్డిపై 7,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడుసార్లు ఓడిన సోమిరెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి రెండో సారి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డిపై 10,256 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెల్లూరు జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లి బరిలోకి దిగారు. పొదలకూరు మండలంలోని తోడేరు గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి, సోమిరెడ్డిపై 5,451 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తొలిసారిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సర్వేపల్లిలో వరుసగా మూడు సార్లు పరాజయం పాలైన సోమిరెడ్డి టీడీపీ పాలనలో ఎమ్మెల్సీ పదవి చేజిక్కించుకున్నారు. దీని ద్వారా వ్యవసాయ మంత్రి పదవి పొందారు. నాల్గోసారి టీడీపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్సార్సీపీ తరపున రెండోసారి పోటీలో నిలి చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డితో తలపడుతున్నారు. వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పెరిగిన ప్రజాభిమానం, చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో మూటకట్టుకున్న టీడీపీ అప్రతిష్ట వల్ల సర్వత్రా ఫ్యాన్ హవా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పొదలకూరులో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలకమైన సమస్యలు ప్రస్తావించారు. నిమ్మ రైతులు, ఆక్వా రైతులు, ప్రాజెక్ట్‌ల్లో స్థానికులకు ఉద్యోగాలపై ఇచ్చిన వాగ్దానాలు, వేట విరామంలో మత్స్యకారులకు పెంచిన పరిహారం మొత్తం, ముత్తుకూరు మండలంలోని ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాలకు మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ హామీ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం నింపింది. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అధికశాతం మంది టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరడం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కలిసొచ్చింది. దీనికి తోడు సర్వేపల్లిలో మంత్రి హోదాలో సోమిరెడ్డి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించలేకపోవడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.. సర్వేపల్లి నియోజకవర్గం మండలాలు : ముత్తుకూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు పోలింగ్ కేంద్రాల సంఖ్య: 282 మొత్తం పంచాయతీలు 116 మొత్తం ఓటర్లు 2,18,120 పురుషులు 1,07,258 మహిళలు 1,10,846 -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
ముత్తుకూరు: భర్తపై అనుమానంతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరు ఎస్సై సాంబశివరావు కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా, సాన్కోహ్లి గ్రామానికి చెందిన బంజాకుమార్‌స్వాయి–బాసంతిస్వాయి(24) దంపతులు స్థానిక గురుకుల పాఠశాల ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బంజాకుమార్ పోర్టులోని అక్షర ఇండస్ట్రీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. డ్యూటీ నుంచి ఆలస్యంగా వచ్చిన భర్తను సోమవారం భార్య నిలదీసింది. అయితే సక్రమంగా సమాధానం చెప్పకుండా మంగళవారం ఉదయం భర్త డ్యూటీపై గుమ్మడిపూండికి వెళ్లిపోయాడు. ప్రశ్నించిన తనను సముదాయించకపోగా, సక్రమంగా బదులివ్వని భర్తపై అనుమానం పెంచుకుంది. రాత్రి ఉరేసుకుని మృతి చెందింది. రైలు దిగే బంజాకుమార్‌ను నెల్లూరు నుంచి తీసుకు వచ్చేందుకు సురేష్ అనే స్నేహితుడు మోటారు సైకిల్ కోసం ఇంటికి వెళ్లి చూడగా బాసంతి ఉరేసుకుని ఉండడంతో హతాశుడయ్యాడు. భర్త ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలకు వెళ్తే ఇల్లు దోచేశారు
ముత్తుకూరు : దైవదర్శనం కోసం తిరుమలకు వెళ్లిన ఓ కుటుంబం తిరిగి వచ్చేలోగా దొంగలు ఇల్లు దోచేశారు. ముత్తుకూరు బజారువీధిలో ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరాజేశ్వరి ఫర్టిలైజర్స్ యజమాని అన్నాల విజయమారుతీరావు మిద్దెపై ఇంటికి తాళాలు వేసి, భార్య, కొడుకు, కోడలు కలిసి బుధవారం తిరుమలకు వెళ్లారు. తిరిగి గురువారం రాత్రి వచ్చే సరికి ఇల్లు చోరీకి గురైనట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి కుడివైపు సందులోని తలుపుల తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. పడక గదిలోని బీరువా తాళాలు పగులగొట్టి, లాకర్లో ఉన్న రూ, 50వేల నగదు, ఒక కిలో వెండి వస్తువులు, 4 గ్రాముల బంగారు కమ్మలు అపహరించుకుపోయారు. వీటి విలువ రూ.1.25 లక్షలుంటుందని బాధితులు తెలిపారు. వేలిముద్రలు పడకుండా దొంగలు నీళ్లతో కడిగేశారు. ఆధారాలు లభించకుండా పప్పుల పొడి చల్లేశారు. శుక్రవారం ఎస్సై శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ క్షుణంగా పరిశీలించి ఆధారాలు సేకరించింది. బాధితుడు విజయమారుతీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
సాయిబాబా ఆలయంలో చోరీ
ముత్తుకూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతి పరిధిలోని ఈదలవారిపాలెం గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని రెండు హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు రూ. 50 వేల రూపాయలతో పాటు, కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన
ముత్తుకూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగిన సంఘటన ఇది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్లో మద్యం దుకాణం ఏర్పాటుపై అందిన దరఖాస్తు మేరకు ఎక్సైజ్ సీఐ నరహరి శనివారం సాయంత్రం అక్కడికి చేరుకుని సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేపట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న దాదాపు 100 మంది స్థానికులు మద్యం దుకాణం వద్దంటూ బైఠాయించి నినాదాలు చేశారు. అయితే దుకాణం ఏర్పాటు కేవలం ప్రతిపాదనల దశలోనే ఉందని ఏర్పాటు సంగతిని పైఅధికారులు చూసుకుంటారని ఎక్సైజ్ సీఐ నరహరి తెలిపారు. స్థానికుల ఆందోళన చాలాసేపటి వరకు కొనసాగింది.