mutyalamma
-
ఘనంగా ముత్యాలమ్మ జాతర
హుజూర్నగర్ : శ్రావణమాసంలో ప్రతి ఏటా పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పీర్లకొట్టం వీధి సమీపంలోని మూడుగుళ్ల ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి చీరెలు, గాజులు, పసుపు కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో వందలాదిగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ప్రభలు కట్టి డప్పువాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రభ బండ్లు ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక మూడుగుళ్ల ముత్యాలమ్మ ఆలయం వద్ద భక్తులకు మంచినీరు సరఫరా చేశారు. ముత్యాలమ్మ జాతర సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూర్నగర్ సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రంజిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఘనంగా ముత్యాలమ్మ జాతర
హుజూర్నగర్ : పట్టణంలో ప్రతి ఏడాది శ్రావణమాసంలో రెండు రోజుల పాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక పోచమ్మ చెరువు సమీపంలోని పెద్ద ముత్యాలమ్మ దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించిన అనంతరం మెుక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి చీరెలు, గాజులు, పసుపు, కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద వాసవీ, వనితాక్లబ్‌ల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు మంచినీరు సరఫరా చే శారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం పట్టణంలో భారీగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ప్రభలు కట్టి, బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రభ బండ్లు ప్రదక్షిణలు చేయగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, వైస్‌చైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డిలతో పాటు పాలకవర్గ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. జాతరలో రెండోరోజైన సోమవారం చిన్న ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లిస్తారని ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. పటిష్ట బందోబస్తు ముత్యాలమ్మ జాతర సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూర్నగర్ సీఐ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడమే గాక పెద్ద ముత్యాలమ్మ ఆలయం వద్దకు వెళ్లే రహదారులను వన్‌వేగా మార్చారు. ప్రభ బండ్ల ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
వైభవంగా ముత్యాలమ్మ ప్రతిష్టా మహోత్సవం
తూర్పుగోదావరి (ముంగండ): ముంగండ మండలంలోని ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ నూతన ఆలయ, విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవతా ప్రార్ధన, యాగశాల ప్రవేశంతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజ, పుణ్య వాహచనం, పంచగవ్యం, దీక్షా అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, ధ్వజారోహణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సత్యనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో గ్రామస్ధులతో పాటు పరిశర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారి ఆలయ పునర్మిణానికి గ్రామస్తులు, ఆడపడుచులు, దాతలు సహకారం అందించారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ నాయకులు విలేకరులకు తెలిపారు. చివరి రోజైన గురువారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని వారు వివరించారు.