Nagarjuna Sagar Assembly Constituency
-
గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: జైవీర్‌రెడ్డి
నిడమనూరు: తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాన్‌ఆయకట్టు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని ఊట్కూర్‌లో ఉదయం మొదలైన ప్రచారం రాత్రి వెంగన్నగూడెంలో ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ముప్పారం, ఊట్కూర్, బంటువారిగూడెం, ఎర్రబెల్లి గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గర్భిణులు డెలవరీ కోసం వాహనాల్లో వెళ్తే ఈ రోడ్లపైనే పరుడు అవుతుందనే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నందికొండవారిగూడెంలో గోవు పిచ్చమ్మ అనే వృద్ధురాలు జైవీర్‌రెడ్డి ప్రచారం రథం వద్దకు వచ్చి జానారెడ్డి కొడుకు ఏడయ్యా అంటూ అడిగింది. అక్కడ ఉన్న వారు ఆమెను తీసుకెళ్లి జానారెడ్డి కొడుకు జైవీర్‌రెడ్డి అంటూ చూపించారు. తనను వెతుకుంటూ వచ్చిన వృద్ధురాలిని ఆయన ఆప్యాయంగా పలకరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, రంగశాయిరెడ్డి, రఘువీర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లయ్య, మాజీ ఎంపీపీ వెంకటరమణ, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల పార్టీ అద్యక్షుడు సత్యం, శివమారయ్య, పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే పేదలు, రైతులకు మేలు పెద్దవూర : కాంగ్రెస్ పార్టీతో నిరుపేదలకు, రైతులకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని జయరాంతండాకు చెందిన బీజేపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రమావత్ దేవ్‌సింగ్‌తో పాటు పలువురు మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలను కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, శ్రీనునాయక్, సోమ్లా, భీమా పాల్గొన్నారు. -
వీడియో క్లిప్పింగ్ చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా
నల్గొండ: తన తండ్రి కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా అన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు సవాల్ విసిరారు. బుధవారం నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి హాలియా సభలో చెప్పింది నిజమైతే వీడియో క్లిప్పింగ్ చూపించాలన్నారు. ఉచిత విద్యుత్ నాలుగేళ్లు ఇస్తే బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని నాడు ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి అన్నారని సీఎం కేసీఆర్ మంగళవారం హాలియా ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించడంపై జైవీర్‌రెడ్డి స్పందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, మాజీ ఎంపీపీ యడవెల్లి రంగశాయిరెడ్డి, అంకతి సత్యం, కొండా శ్రీనివాసరెడ్డి, శివమారయ్య, నూకల వెంకట్‌రెడ్డి, అంకతి వెంకటరమణ, బొల్లం శ్రీనివాస్ యాదవ్, ప్రభాకరరెడ్డి, వల్లబరెడ్డి, వివేక్ కృష్ణ, మేరెడ్డి వెంకటరెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్లు తిరస్కరణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) సోమవారం పూర్తయింది. ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 428 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 73 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 355 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల అధికారులు ఓకే చెప్పారు. అత్యధికంగా తుంగతుర్తి, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. మునుగోడులో మాత్రం ఒక్క నామినేషన్ మాత్రమే తిరస్కరణకు గురైంది. నామినేషన్లను ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు నిశితంగా పరిశీలించి.. సరిగా లేనివాటిని తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో మాజీ మంత్రులు జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు నామినేషన్లు ఉన్నాయి. వారితో పాటు పలువురు స్వతంత్రుల నామినేషన్లు ఉన్నాయి. ఇక ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆ తర్వాత బరిలో ఉండేది ఎంతమంది అనే విషయం తేలనుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లు ఇవీ.. ► నల్లగొండ నియోజకవర్గంలో 39మంది నామినేషన్లు వేయగా అందులో ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ► నకిరేకల్‌లో 33 మంది అభ్యర్థులకుగాను ఇద్దరి నామినేషన్లు తిరస్కరించారు. ► మునుగోడులో 51 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఒక్కరి నామినేషన్‌ను తిరస్కరించారు. ► దేవరకొండలో 18 మంది నామినేషన్లు వేయగా ఐదుగురివి తిరస్కరణకు గురయ్యాయి. ► మిర్యాలగూడ నియోజకవర్గంలో 45 మంది నామినేషన్లు వేయగా, అందులో 12 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. ► నాగార్జునసాగర్‌లో 28 నామినేషన్లకు గాను ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రపోజర్స్ సంతకాలు సరిపడా చేయించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రపోజర్స్ సంతకాలు చేయాల్సి ఉండగా.. కేవలం ఒక్కరే చేశారు. ► సూర్యాపేట నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 10 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ► తుంగతుర్తి నియోజకవర్గంలో 33 మంది నామినేషన్లు వేయగా, అందులో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన మోత్కుపల్లి నర్సింహులు అఫిడవిట్ సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ► హుజూర్‌నగర్‌లో 40 మంది నామినేషన్లను దాఖలు చేయగా, ఐదుగురి నామినేషన్లను తిరస్కరించారు. ► కోదాడ నియోజకవర్గంలో 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ► ఆలేరు నియోజకవర్గంలో 31 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 9 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ► భువనగిరిలో 29 మంది నామినేషన్లు వేయగా నలుగురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. రేపటి వరకు ఉపసంహరణ నామినేషన్లు ఉపసంహరించుకోవడాని మంగళ, బుధవారాల్లో అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు కొందరు బరిలో నిలిచేందుకు స్వతంత్రంగా నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగించే పనిలో ముఖ్య నాయకులు ఉన్నారు. స్వతంత్రులను కూడా తమవైపునకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఉపసంహరణ ప్రక్రియ ముగిసి బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తేలనున్నారు. -
TS Election 2023: సాగర్ బరిలో జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి
నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి టికెట్ దక్కింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ పోటీ చేస్తుండగా ఈ సారి అందరి చూపు నాగార్జునసాగర్ వైపే మళ్లింది. జానారెడ్డి మొదటిసారి ఎన్నికలకు దూరం కావడం విశేషం. ఇద్దరు యువ నాయకులకు యూత్ పాలోంగ్ ఉన్న నేపథ్యంలో పోరు రసవత్తరంగా మారనుంది. జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లారు. పెద్దవూర మండలం గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్‌రెడ్డి.. తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ చదరంగంలో నడయాడిన జానారెడ్డి.. తనయుని విజయం కోసం వెనక నుంచి పాటుపడనున్నారు. అయితే.. తన రాజకీయ వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఎంత వరకు సఫలమవుతారో చూడాలి మరి..! -
నాగార్జునసాగర్ బరిలో జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమరానికి కాంగ్రెస్ నాయకులు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. 12 నియోజకవర్గాల పరిధిలో 94 మంది దరఖాస్తులు సమర్పించారు. అందులో ఎవరికి టికెట్ లభిస్తుందో.. ఎవరికి నిరాశ ఎదురవుతుందో త్వరలోనే తేలనుంది. మూడు నియోజకవర్గాల్లో అధిక పోటీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వారిపై పోటీ చేసేందుకే ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ దరఖాస్తులకు చివరి గడువు కావడంతో ఆరోజు వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి 94 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోగా, మరి కొందరు తమ తరఫున ఇతరులను పంపించి గాంధీ భవన్లో దరఖాస్తు చేయించారు. వారిలో నల్లగొండ జిల్లా నుంచి 40 మంది, సూర్యాపేట జిల్లా నుంచి 29 మంది, యాదాద్రి జిల్లా నుంచి 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మూడు నియోజకవర్గాల్లో టికెట్ కావాలంటూ దరఖాస్తు చేసిన వారి సంఖ్య పది దాటిపోయింది. అత్యధికంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 18 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆలేరు నుంచి పోటీచేసేందుకు 16 మంది ఉత్సాహం కనబరిచారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన తుంగతుర్తి నుంచి 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కావాలంటూ ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా దరఖాస్తు చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ హుజూర్నగర్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఆయన తనయలు జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ నుంచి, రఘువీర్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి టికెట్ ఆశించి దరఖాస్తు చేసుకున్నారు. వీరేశం వస్తారా.. మరెవరికై నా ఇస్తారా? బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టికెట్ ఆశించినా అధిష్టానం ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. అయితే, ఇప్పటివరకు ఆయన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్లో చేరారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్‌పార్టీ ఎవరిని పోటీలో ఉంచుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సీనియర్లను కాదని ఇచ్చేనా? ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులు, గతంలో పోటీ చేసిన వారిని కాదని కొత్త వారికి టికెట్ కేటాయిస్తారా? లేదంటే పాత వారికే ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండే అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే వారికే టికెట్లను కేటాయిస్తారా? అన్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ తేల్చాల్సి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఇప్పుడు కూడా టికెట్లను అడుతున్నారు. నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని మరొకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే కష్టమేనన్న వాదన పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సూర్యాపేటలోనూ అదే పరిస్థితి నెలకొంది. మునుగోడులో ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన స్రవంతికి ఇస్తారా? ఆ ఎన్నికల నాటి నుంచే టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారా? ఒక వేళ కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే వారికి కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక హుజూర్‌నగర్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్ ఆశించి మొదటి నుంచి పనిచేసుకుంటున్నారు. అక్కడ కూడా ఆశావహులు దరఖాస్తు చేశారు. మరోవైపు కోదాడ నుంచి పద్మావతి రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి వస్తుందా? ఒక్కరికే ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేస్తుందా? వేచి చూడాలి. ఇక భువనగిరి నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన కుంభం అనిల్‌రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు. అక్కడ ఎవరికి ఇస్తారనేది వేచి చూడాల్సింది. కాంగ్రెస్ పార్టీలో భారీగా ఆశావహుల దరఖాస్తులు దరఖాస్తుల వివరాలు ఇవీ.. నియోజకవర్గం దరఖాస్తుల సంఖ్య నల్లగొండ 5 నకిరేకల్ 6 మునుగోడు 3 దేవరకొండ 7 మిర్యాలగూడ 18 నాగార్జునసాగర్ 1 సూర్యాపేట 5 తుంగతుర్తి 15 హుజూర్నగర్ 4 కోదాడ 5 ఆలేరు 16 భువనగిరి 9 మొత్తం 94 -
Nalgonda: ఆశావహులకు నిరాశ!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో ఆశావహులకు బీఆర్ఎస్ మొండిచేయి చూపింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కొంత కాలంగా ఆశావహులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి తమకు టికెట్ ఇస్తారని, పెద్దల ఆశీస్సులు ఉన్నాయంటూ చెప్పుకున్నారు. కొందరు ఫౌండేషన్ల ద్వారా ప్రజల్లోకి వెళ్లగా, మరికొందరు సాధారణంగానే ప్రయత్నాలు చేసుకున్నారు. అయినా సోమవారం ప్రకటించిన జాబితాలో సిట్టింగ్‌లకే టికెట్లను కేటాయించడంతో ఆశావహులకు నిరాశ తప్పలేదు. ► నల్లగొండలో కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ఆర్కేఎస్ ఫౌండేషన్ పేరుతో కొంత కాలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. టికెట్ కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి కూడా ఈసారి అవకాశం ఇస్తే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. సోమవారం ప్రకటించిన జాబితాలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికే స్థానం కల్పించారు. ► మునుగోడు నియోజకవర్గంలోనూ కర్నాటి విద్యాసాగర్, బోళ్ల శివశంకర్, నారబోయిన రవి టికెట్ ఆశించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి మునుగోడు టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయినా, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్నే కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో అక్కడ ఆశావహులకు భంగపాటు తప్పలేదు. ► నాగార్జునసాగర్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది. బుసిరెడ్డి ఫౌండేషన్ పేరుతో బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి మాత్రం నోముల భగత్‌కే టికెట్ ఖరారు చేశారు. ► దేవరకొండలో దేవేందర్ నాయక్, కోదాడలో శశిధర్‌రెడ్డికి కూడా భంగపాటు తప్పలేదు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెలే వేముల వీరేశం కూడా టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా నిరాశే మిగిలింది. ► టికెట్ దక్కకపోవడంతో భవిష్యత్‌పై సమాలోచనలు -
నాగార్జునసాగర్ నియోజకవర్గం రాజకీయా..విజేతలు వీరే..
నాగార్జున సాగర్ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ది నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై విజయం సాదించినా, ఆయన అనతికాలంలో అనారోగ్యంతో కన్నుమూశారు.దాంతో ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నోమలు భగత్ ను టిఆర్ఎస్ తన అబ్యర్దిగా రంగంలో దించింది. ఈ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస పక్షాన మాజీ మంత్రి అయిన జానారెడ్డి పోటీచేసినా ఫలితం దక్కలేదు. భగత్ 18872 ఓట్ల మెజార్టీతో గెలిచారు. భగత్ కు 89804 ఓట్లు రాగా, జానారెడ్డికి 70932 ఓట్లు వచ్చాయి. బిజెపి తరపున పోటీచేసిన రవి నాయక్ 7676 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. అలాగే టిడిపి అబ్యర్ది మువ్వా అరుణ కుమారి కేవలం 1714 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. కాగా 2018 ఎన్నికలలో నోముల నరసింహయ్య 7171 ఓట్ల ఆదిక్యత వచ్చింది. నరసింహయ్యకు 83655 ఓట్లు రాగా, జానారెడ్డికి 76884 ఓట్లు వచ్చాయి.యాదవ వర్గానికి చెందిన నరసింహయ్య 1999, 2004 ఎన్నికలలో సిపిఎం పక్షాన నకిరేకల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడ్‌గా మారింది. అదే సమయంలో నోముల పార్టీ వైఖరులతో విబేదించి టిఆర్ఎస్లో చేరి సాగర్ నుంచి పోటీచేసి 2014లో ఓటమి చెంది,2018లో గెలుపొందారు. దీనితో ఆయన మూడో సారి గెలిచినట్లయింది. కాని దురదృష్టవశాత్తు మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో ఆయన కుమారుడు భగత్ గెలిచారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2014లో జానారెడ్డి ఏడో సారి విజయం సాధించారు. ఈయన తన సమీప ప్రత్యర్ధి, టిఆర్ఎస్లో చేరిన మాజీ సిపిఎం నేత నోముల నరసింహయ్యను 16476 ఓట్ల తేడాతో ఓడిరచారు. తెలంగాణలో అత్యధికసార్లు గెలిచిన ప్రముఖులలో జానారెడ్డి ఒకరు. 1983 నుంచి ఒక్క టరమ్‌లో తప్ప 2018 వరకు సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డికి ఉంది. అలాగే తెలంగాణలో మంత్రిగా కూడా ఈయనదే రికార్డు. సమైక్య రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలకు పైగా మంత్రి పదవి చేసిన రికార్డు జానారెడ్డి సొంతం. 2004 నుంచి ఐదేళ్ళపాటు హోం మంత్రిగా పనిచేసిన ఈయనకు రాజశేఖరరెడ్డి రెండో టరమ్‌లో మంత్రి పదవి లభించక పోవడం విశేషం. ఆ తరువాత రోశయ్య క్యాబినెట్లో కూడా ఛాన్స్ రాలేదు. తదుపరి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జానారెడ్డి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఈయన కీలక భూమిక పోషించడం విశేషం. నోముల నరసింహయ్య నకిరేకల్ నియోజకవర్గం రిజర్వు కాకముందు రెండుసార్లు అక్కడ నుంచి శాసన సభకు ఎన్నికై సిపిఎం పక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీతో విబేధించి టిఆర్ఎస్లో చేరారు. గతంలో చలకుర్తి పేరుతో ఉన్న నియోజకవర్గం 2009లో నాగార్జున సాగర్‌గా మారింది. చలకుర్తి 1967లో ఏర్పడగా అప్పటి నుంచి తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలుపొందితే, ఇండిపెండెంటు ఒకరు విజయం సాధించారు. జానారెడ్డి 1978లో జనతాపార్టీ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1983, 85లలో టిడిపి తరుపున, 1989, 99, 2004, 2009, 2014లలో కాంగ్రెస్ఐ తరుపున గెలిచారు. 1994లో నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించకుండా గెలవాలన్న లక్ష్యంతో ఎక్కడ తిరగలేదు. ఆ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. జానారెడ్డి 1983-89 మధ్య ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో ఉండగా, 1992లో కోట్ల క్యాబినెట్‌లోను, 2004లో వైఎస్ క్యాబినెట్‌లోను, తదుపరి కిరణ్ క్యాబినెట్‌లోను పనిచేశారు. చలకుర్తిలో నిమ్మల రాములు మూడుసార్లు గెలిచారు. సాగర్, చలకుర్తిలలో కలిపి ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం గెలిస్తే, ఐదు సార్లు బిసిలు (యాదవ) వర్గం గెలిచారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బొల్లం రవిని పరామర్శించిన బీఆర్ఎస్ నేత మన్నెం రంజిత్ యాదవ్
నల్గొండ: ఇటీవల కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండల బీఆర్ఎస్ నేత బొల్లం రవి యాదవ్‌ను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. ఆయన పాటు బీఆర్ఎస్ నేతలు ఆవుల పురుషోత్తం యాదవ్, హాలియా ఏయంసి డైరెక్టర్ పోశం శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ సీనియర్ నాయకులు అబ్దుల్ హలీం, గురజాల సైదులు, కుంటిగొర్ల రాజశేఖర్, పగిడిమర్రి అనిల్ కుమార్ ఉన్నారు. -
గగనతలంలో కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే నల్లగొండ నాగార్జున సాగర్‌కు చెందిన బీఆర్ఎస్ నేత మన్నెం రంజిత్ యాదవ్ కేటీఆర్ పట్ల తన అభిమానాన్ని మరోలా చాటుకున్నారు. గగనతలంలో కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మన్నెం రంజిత్ యాదవ్. ఇంగ్లండ్ నాటింగ్హమ్లో ఓ ఛాపర్‌కు కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీని వేలాడదీసి ఆకాశంలో ప్రదర్శిస్తూ వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలియజేశారు.