గుర్రం ఎక్కించి సముద్రంలో పడేశా
చెన్నై : గుర్రం ఎక్కించి, సముద్రంలో పడేసి విజయ్‌కు శిక్షణ ఇచ్చి నటుడిగా తయారు చేశానని ఆయన తండ్రి సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నో సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా నయాపుడై అనే చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. చాయాగ్రహకుడు, దర్శకుడు జీవన్ 19 ఏళ్ల కొడుకు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో పా.విజయ్, చాందిని యువ జంటగా నటించగా ఎంఎస్.భాస్కర్. జీవీ చంద్రశేఖర్, నాన్ కడవుల్ రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు.
చిత్ర వివరాలను వెల్లడించడానికి చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తన కొడుకు హీరోగా నటిస్తానని అన్నప్పుడు రోజూ వేకువజామున 4.30 గంటలకు స్టంట్‌మాస్టర్ జాగ్వర్‌తంగంతో పాటు జాగింగ్‌కు తీసుకెళ్లి గుర్రం ఎక్కించి, సముద్రంలో పడేసి శిక్షణ ఇచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు.
అలా నటన, డ్యాన్స్‌ల్లో ట్రైనింగ్ ఇచ్చి విజయ్ ని హీరోగా తయారు చేశానన్నారు. అలాంటిది ఇక చిత్ర నిర్మాణం,దర్శకత్వం వద్దు అని తన భార్యతో చర్చించి విశ్రాంతి తీసుకుందామని నిర్ణయించుకుంటున్న తరుణంలో నిర్మాత కలైపులి థాను ఒక సారి ఫోన్ చేసి ఎక్కడున్నారని అడగ్గా ఇంట్లో ఉన్నానని చెప్పానన్నారు. తరువాత ఇంటికొచ్చి కొంత మొత్తం అడ్వాన్స్ చేతిలో పెట్టి తన చిత్రంలో నటిస్తున్నారు మీరు... ఒక కుర్రాడు వచ్చి కథ చెబుతారు అని వెళ్లి పోయారన్నారు. ఆ తరువాత విజయ్‌కిరణ్ అనే కుర్రాడు వచ్చాడన్నారు. తనతో కథ ఎంత సేపట్లో చెప్పగలవని అడిగానన్నారు. అందుకతను తన ట్యాబ్ తీసి తను తీయబోయే కథను అందులో చూపించాడని చెప్పారు. సినిమా కూడా ల్యాప్‌టాప్‌తోనే తీస్తావా? అని అడగ్గా అవునని తలూపాడని తెలిపారు. ఇందులో తనతో దర్శకుడు నటింపజేయడంతో పాటు పిల్లలతో కలిపి కామెడీ చేయించారని చెప్పారు. ఒక రోజు విజయ్‌కిరణ్ తన వద్దకు వచ్చి కథ చెప్పారన్నారు.
వెంటనే కథానాయకుడిగా ఎవరనుకుంటున్నావని అడగ్గా దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ అని టక్కున చెప్పారన్నారు. ఆశ్చర్యపోవడం తన వంతు అయ్యిందన్నారు. కారణం తన మదిలో మెదిలింది ఎస్ఏ.చంద్రశేఖర్‌నే కావడం అన్నారు. అనంతరం ఎస్ఏ.చంద్రశేఖర్‌ను కలిసి మీరి చిత్రంలో నటించండి ఆ తరువాత ఇదే చిత్రాన్ని హిందీలో అమితాబ్, అభిషేక్‌తో తీస్తానని చెప్పానన్నారు.నయాప్పుడై చిత్రాన్ని దర్శకుడు చెప్పిన దానికంటే బాగా తెరకెక్కించారని, తాజ్‌నూర్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని ఎస్.థాను తెలిపారు.