Nalgonda / Mahbubnagar
-
ఆ రెండూ ప్రతిష్టాత్మకమే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉపఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ తర్వాత ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిని తిరిగి గెలుచుకోవడంపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక రాగా, ఈ నెల 13న జరిగే లోక్‌సభ పోలింగ్తోపాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. మరోవైపు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా పల్లా పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది.లాస్య నందిత సోదరి కోసం.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తమ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించగా, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని పనిచేస్తున్నారు.అయితే ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ఆశావహులు గజ్జెల నాగేశ్ కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా, ఎర్రోⶠ్ల శ్రీనివాస్ సంగారెడ్డి ప్రచార సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నివేదిత తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రచారంపై ఆ ప్రభావం పడకుండా చూడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్‌షోల్లో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్శాసనమండలి ఆరంభం నుంచి బీ ఆర్ఎస్ అభ్యర్థులే ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఈ స్థానానికి జరుగు తున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. రాకేశ్ రెడ్డి మంగళ వారం నల్ల గొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. బీఆర్ ఎస్ టికెట్ పార్టీ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్ రాజు తదితరులు ఆశించారు. అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ న్వయంతో పనిచేయడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించాలని భావి స్తోంది. దీంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధి నేత కేసీఆర్ ఈ నెల 12న లేదా 14న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో తెలంగాణభవన్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
పుష్కర సందోహం
మూడోరోజు పోటెత్తిన భక్తజనం * మహబూబ్‌నగర్ జిల్లాలో 13.5 లక్షల మంది, నల్లగొండలో 3.5 లక్షల మంది పుణ్యస్నానాలు * పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ.. ఘాట్లను పరిశీలించిన డీజీపీ సాక్షి ప్రతినిధులు,నల్లగొండ/మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల మూడోరోజు భక్తులు పోటెత్తారు. అశేష జనవాహినితో ఘాట్లు జన సంద్రమయ్యాయి. మూడ్రోజుల వరుస సెలవులతో శుక్రవారం నుంచి పెరిగిన భక్తుల రద్దీ ఆదివారం మరింత ఊపందుకుంది. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఆదివారం దాదాపు 13.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. బీచుపల్లి, అలంపూర్, సోమశిల పుష్కరఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే జనప్రవాహం పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. అలంపూర్‌లోని గొందిమళ్లలో దాదాపు 1.30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని దర్శించారు. బీచుపల్లిలో దాదాపు 2 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. సోమశిలలో 80 వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. అచ్చంపేటలోని పాతాళగంగలో సైతం భక్తుల సంఖ్య పెరిగింది. గద్వాలలోని నది అగ్రహారంలో తెల్లవారుజాము నుంచే పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు బారులు తీరారు. జూరాల, పస్పుల, ఆత్మకూర్, క్యాతూర్ తదితర ప్రాంతాల్లోనూ రద్దీ కనిపించింది. డీజీపీ అనురాగ్‌శర్మ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ పుష్కరఘాట్‌ను, నల్లగొండ జిల్లాలోని వాడపల్లి ఘాట్‌ను సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులను, సామాన్య భక్తులను అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల అంచనాలకు మించి భక్తులు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక నల్లగొండ జిల్లాలో పుణ్యస్నానాలకు 3.50 లక్షల మంది తరలివచ్చారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద 1.60 లక్షలు, వాడపల్లి శివాలయం ఘాట్‌వద్ద సుమారు 70 వేల మంది, మట్టపల్లిలో 80 వేల మందికి పైగా స్నానాలు చేశారు. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో భక్తుల తాకిడి రోజువారీ మాదిరిగానే ఉంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్.. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు కిలోమీటర్ల మేర బారులుదీరాయి. హైవేపై రోజుకు సరాసరి 16 వేల వాహనాలు ప్రయాణిస్తుండగా.. శనివారం 4 వేలు, ఆదివారం 2 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించాయి. పుష్కర ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ పర్యవేక్షణ సాక్షి, హైదరాబాద్: పుష్కరాలు జరిగే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయా జిల్లాల మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రంగాపూర్, సోమశిల, అలంపూర్, బీచ్పల్లి ప్రాంతాల్లో ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తారు. మంగళవారం నల్లగొండ జిల్లా వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లిలో ఆ జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి పర్యవేక్షిస్తారు. ఈ రెండు జిల్లాల పర్యవేక్షణలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు.