Namami Gange project
-
ఏడాది చివరకు కాలుష్యరహిత యమున
న్యూఢిల్లీ: రాబోయే డిసెంబర్ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారన్నారు. 1,300కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశరాజధానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది. కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. నదిలోకి మురుగునీరు వదిలే 18 డ్రెయిన్స్ ఉన్నాయని, వీటిని మూసివేసి, మురుగునీటిని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని అశోక్ చెప్పారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు. -
‘నమామి గంగా’పై మోదీ సమీక్ష
కాన్పూర్: గంగా నది శుద్ధీకరణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలకు ప్రత్యక్ష తార్కాణంగా నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నమామి గంగా ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి మొదటి భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శనివారం ఈ భేటీ జరిగింది. నదీ జలాలను రక్షించేందుకు అది ప్రవహిస్తున్న రాష్ట్రాలకు 2015–20 వరకు రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చిందని సంబంధిత వ్యవహారాల అధికారులు తెలిపారు. భేటీ అనంతరం మోదీ అరగంట పాటు గంగానదిలో బోటు షికారుకు వెళ్లారు. ప్రయాణం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఘాట్ మెట్లు ఎక్కుతుండగా ఆయన పట్టు జారి పడిపోయారు. వెంటనే ఆయన వెంట ఉన్న బలగాలు ఆయనకు సహాయం చేశాయి. అన్ని మెట్లలో ఒక మెట్టు ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఘటన జరిగినట్లు ఎస్పీజీ బలగాలు తెలిపాయి. -
గంగా నదిలో మోదీ పడవ ప్రయాణం
-
గంగా నదిలో మోదీ పడవ ప్రయాణం
కాన్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో శనివారం పవవ ప్రయాణం చేశారు. కాన్పూర్లోని అటల్ ఘాట్ నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ప్రధానితోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ (సీఎం నితీష్కుమార్ స్థానంలో) ఉన్నారు. ప్రతిష్టాత్మక నమామి గంగా కార్యక్రమంలో భాగంగా గంగా ప్రక్షాళనకు జరుగుతున్న పనులను ప్రధాని పర్యవేక్షించారు. తొలిసారిగా జరుగుతున్న నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. గంగా ప్రక్షాళన తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ కాన్పూర్లో పర్యటిస్తున్నారని పీఎంఓ కార్యాలయం ట్విటర్లో పేర్కొంది. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రధాని మోదీకి కాన్పూర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కాగా, నమామి గంగా ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేసి గంగా నదిని శుద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. -
గంగా ప్రక్షాళన గంగపాలు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నా అంతట నేను ఇక్కడికి రాలేదు. నన్ను ఎవరూ ఇక్కడికి పంపించ లేదు. తల్లి గంగనే నన్ను ఇక్కడికి రప్పించిందని భావిస్తున్నాను’ అని 2014, ఏప్రిల్ 24వ తేదీన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అదే రోజు ఆయన వారణాసి నుంచి లోక్సభకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను బాబా బోలేనాథ్ ఆశీర్వాదంతో శబర్మతి ఆశ్రమాన్ని ఎలా తీర్చిదిద్దానో అలాగే వారణాసిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను అని కూడా మోదీ అదే రోజు సాయంత్రం తన బ్లాగ్లో రాసుకున్నారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే వారణాసికి వచ్చి గంగకు హారతి ఇచ్చారు. గంగానది ప్రక్షాళన కోసం 20,000 కోట్ల రూపాయలతో ‘నమామి గంగా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గంగా నదిలో కాలుష్యం శాతం 2014లో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గంగా నది ప్రక్షాళనకు మొత్తం 20 వేల కోట్ల రూపాయలను కేటాయించగా, వాటిని 2020 అంటే, మరో రెండేళ్లలో ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన ప్రాజెక్టుల పూర్తి ఎంత వరకు వచ్చాయో తెలుసుకునేందుకు మీడియా ఆర్టీఐ కింద పలు దరఖాస్తులు దాఖలు చేయగా, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మురుగు కాల్వల ప్రక్షాళన, పారిశ్రామిక వ్యర్థాల ట్రీట్మెంట్, గంగా నది ఉపరితలం క్లీనింగ్ కోసం నమామి గంగా పథకంలో భాగంగా కేంద్రం 221 ప్రాజెక్టులను ప్రకటించింది. వాటికి 2,238.73 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. 221 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 58 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 26 శాతం ప్రాజెక్టులు మాత్రమే పూర్తయినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. 105 సీవరేజ్, ఎస్టీపీ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రాజెక్టులన్నింటినీ 2019, మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మూడేళ్ల కాలంలో 26 శాతానికి మించి పూర్తికాని ప్రాజెక్టులను వచ్చే ఆరేడు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ఆయనకే తెలియాలి. ఆయనకంటే ముందు జల వనరుల శాఖ మంత్రిగా గంగా నది ప్రక్షాళన ప్రాజెక్ట్ను పర్యవేక్షించిన ఉమా భారతి 2017, ఫిబ్రవరి 21వ తేదీన మీడియాతో మాట్లాడుతూ 2018, జూలై నెల నాటికి ప్రాజెక్ట్ పూర్తికాకపోతే గంగానదిలోనే దూకి ఆత్మార్పణం చేసుకుంటానని శపథం చేశారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాకపోతే గంగా నది ఒడ్డున ఆమరణ దీక్ష చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆమె శపథాలు, ప్రతిజ్ఞల సంగతి పక్కన పెడితే ఆమె ఆధ్వర్యంలో పనులు మందగమనంతో కూడా నడవడం లేదని గ్రహించిన మోదీ ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో ఆమెను జలవనరుల శాఖ నుంచి తప్పించి, ఆ శాఖను నితిన్ గడ్కరీకి అప్పగించింది. మునుపటికన్నా ఇప్పుడు గంగా జలాల కాలుష్యం శాతం పెరిగిందంటే ప్రాజెక్టుల పేరిట ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన సొమ్మంతా గంగ పాలేనా? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. -
'అమ్మ' విరాళం రూ.100 కోట్లు
కొల్లాం(కేరళ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగే' ప్రాజెక్టుకు ఆధ్యాత్మికవేత్త మాతా అమృతంగమయి దేవి భూరి విరాళం ప్రకటించారు. రూ.100 కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 11న మాతా అమృతంగమయి మఠంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి రూ.100 కోట్ల డీడీ అందజేయనున్నారు. ఈ మొత్తంతో గంగా నది పరివాహక ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించనున్నారు. 'నమామి గంగే'కు తమ వంతు అందించే విషయంపై మార్చి 28న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో అమ్మ చర్చలు జరిపారని అమృతంగమయి మఠం వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణకు ముందుకు వచ్చిన అమ్మకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పినట్టు తెలిపింది. ప్రజారోగ్య రక్షణకు, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో 2010లో అమల భారతం కాంపెయిన్(ఏబీసీ) కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించింది. దీని ద్వారా లక్షలాది వాలంటీర్లు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపింది.