'అమ్మ' విరాళం రూ.100 కోట్లు
కొల్లాం(కేరళ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగే' ప్రాజెక్టుకు ఆధ్యాత్మికవేత్త మాతా అమృతంగమయి దేవి భూరి విరాళం ప్రకటించారు. రూ.100 కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 11న మాతా అమృతంగమయి మఠంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి రూ.100 కోట్ల డీడీ అందజేయనున్నారు. ఈ మొత్తంతో గంగా నది పరివాహక ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించనున్నారు.
'నమామి గంగే'కు తమ వంతు అందించే విషయంపై మార్చి 28న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో అమ్మ చర్చలు జరిపారని అమృతంగమయి మఠం వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణకు ముందుకు వచ్చిన అమ్మకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పినట్టు తెలిపింది. ప్రజారోగ్య రక్షణకు, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో 2010లో అమల భారతం కాంపెయిన్(ఏబీసీ) కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించింది. దీని ద్వారా లక్షలాది వాలంటీర్లు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపింది.