Nana Patel
-
పెట్రోల్ వివాదంలో అమితాబ్, అక్షయ్
ముంబై సెంట్రల్ : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్‌కుమార్‌లు స్పందించకుంటే వారి సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు నానా పటోలే హెచ్చరించారు. అంతేగాకుండా వారి షూటింగులను కూడా అడ్డుకుంటామన్నారు. డిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున భండార జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌లు సోషల్ మీడియాలో ‘మేం కార్లయితే కొనగలం కానీ, పెట్రోల్ కొనలేం’ అని వ్యంగ్యంగా పలు పోస్టింగ్‌లు పెట్టారనీ, అలాంటిది ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సెలబ్రిటీలు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజస్వామ్య వ్యవస్థలో ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే ఇలాంటి సెలబ్రిటీలు ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం వారి బాధ్యతగా భావించాలన్నారు. కాగా గడిచిన నెల రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో తొలిసారి పెట్రోల్ ధర లీటర్ వంద రూపాయలను దాటింది. భారీగా పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం కోసమే.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే అమితాబ్, అక్షయ్‌కుమార్ లాంటి సెలబ్రిటీల పేర్లను వాడుకుంటోందని విమర్శించారు. షూటింగ్‌లను, సినిమా ప్రదర్శనలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో భాగస్వామియే కానీ, రాష్ట్రానికి యజమాని కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపుల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావని, ఫలితంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుందని విమర్శించారు. -
బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నాగ్‌పూర్: ప్రభుత్వ వ్యూహాల గురించి పార్టీ నాయకులు ప్రశ్నిస్తే ప్రధానమంత్రి మోదీకి నచ్చదని మహారాష్ట్ర బీజేపీ ఎంపీ నానా పటోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటేరియన్ల సమావేశంలో తాను రైతుల సమస్యలను లేవనెత్తగా మోదీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. గ్రీన్ ట్యాక్స్‌ను పెంచాలని, వ్యవసాయ రంగాల్లో కేంద్రం పెట్టుబడులను పెంచాలని, ఓబీసీలకు ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేయాలని తాను సమావేశం మాట్లాడానని తెలిపారు. తన ఆలోచనలను అభినందించని మోదీ.. 'కొంచెం నోరు మూసుకుంటావా' అని అడిగారని చెప్పారు. 'మీరు పార్టీ మ్యానిఫెస్టోను చదివారా?.. ప్రభుత్వ పథకాల గురించి మీకు తెలుసా?' అని మోదీ తనను ప్రశ్నించారని తెలిపారు. గోండియా-భందారా నియోజకవర్గం నుంచి నానా పటోల్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నాయకుడు ప్రపూల్ పటేల్‌పై గెలుపొందారు. అయితే, తాజాగా బీజేపీ ప్రపూల్ పటేల్‌తో సన్నిహితంగా ఉంటుండటంతో ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీ తనను టార్గెట్ చేసిందని శుక్రవారం ఆయన ఆరోపించారు. తనకేం భయం లేదని అన్నారు. తనకు మంత్రి కావాలని లేదని, ప్రస్తుతం ఉన్న మంత్రులు భయంతో బతుకుతున్నారని అన్నారు. కాగా, ఓ బీజేపీ ఎంపీ ప్రధానమంత్రిని విమర్శించడం ఇదే తొలిసారి. నానా పటోల్ స్టేట్మెంట్స్పై మాట్లాడేందుకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నిరాకరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రైతుల బాధలను తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు నానా పటోల్. కేంద్రం నుంచి రైతులకు సాయం తెవడంలో సీఎం విఫలం చెందారని అన్నారు. కేవలం నిధుల కొరత వల్లే విదర్భ ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ అటకెక్కాయని చెప్పారు. ఫడ్నవీస్ ప్రాంతమైన నాగ్‌పూర్‌కు మాత్రమే నిధులు సమకూరుతున్నాయని ఆరోపించారు. నాగ్‌పూర్‌కు మెట్రోరైలు, కొత్త పరిశ్రమలు వస్తుండటం వల్ల దాని చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నాయని చెప్పారు.