nandamuru
-
నందమూరు పాత అక్విడెక్ట్ తొలగింపు
తాడేపలి్లగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్ర కాలువ ముంపు రైతులకు శుభతరుణం మొదలైంది. ఏళ్ల కాలంగా ఈ రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న నందమూరు పాత అక్విడెక్ట్ తొలగింపు పనులు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం, వీరంపాలెం తదితర గ్రామాల్లో 326 హెక్టార్లలోని బాడవా రైతాంగానికి ముంపు సమస్య తీరనున్నది. కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు ఈ పనులు చేపట్టారు. శుక్రవారం కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఎట్టకేలకు రైతులే రంగంలోకి దిగి ఉద్యమ బాట పట్టడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. ఫలించిన రైతుల ఆందోళన సార్వాలో కురిసిన వర్షాలకు జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం వీరంపాలెం గ్రామాల ఆయకట్టులోని పంట భూములు నీటమునిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబరు 23వ తేదీన ఆయకట్టు బాడవ రైతులు నందమూరు అక్విడెక్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే తామే పాత అక్విడెక్ట్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేశారు. ఎట ్టకేలకు దిగివచ్చిన అధికార యంత్రాంగం అప్పట్లో పాత అక్విడెక్ట్ వద్ద గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టారు. ఈ నేపథ్యం లోనే పాత అక్విడెక్ట్‌ను తొలగిస్తామని ఇరిగేషన్ అధికారులు వాగ్దానం చేశారు. పాత అక్విడెక్ట్ పనులను శుక్రవారం చేపట్టారు. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
లారీ బోల్తా : ఇద్దరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లెజెండ్.. ఎవరికి బ్యాండ్!?
‘నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. నాకు ఒకడు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. తొక్కిపడేస్తా..’ ఇది లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ పంచ్ డైలాగ్. ఈ మాటలు వెండితెరపై చెబితే ఆయన అభిమానులకు ఆనందమే. తాజాగా బాలయ్య చేసిన రాజకీయ ప్రకటన మాత్రం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లను కంగారుపెడుతోంది. బావ చంద్రబాబు ఎక్కడ్నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ్నుంచి రెడీ అని బాలకృష్ణ ప్రకటించడంతో పార్టీలోని ఆశావహుల గుండెలు గుభేల్మంటున్నాయి. బాలయ్య గెలవడం మాటెలా ఉన్నా.. పోటీ పేరుతో వచ్చి ఎవరి సీటుకు ఎసరుపెడతారోనని భయపడిపోతున్నారు. *బాలకృష్ణ ప్రకటనతో జిల్లాలో రాజకీయ ప్రకంపనలు *గన్నవరం, పెనమలూరు, నూజివీడుల్లో లెక్కలు తారుమారు *ఎన్టీఆర్ వారసులను అంతగా ఆదరించని జిల్లావాసులు *టీడీపీలో మరో వర్గపోరుకు సూచికలు తెలుగుదేశం పార్టీలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నవారిని కాదని కొత్తవారిని తీసుకొచ్చి తమ నెత్తికెక్కిస్తున్నారంటూ టీడీపీ ఆశావహులు కారాలుమిరియాలు నూరుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇదే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పోటీకి సై అనడంతో రాజకీయ తెరపైకి మరో కృష్ణుడు వస్తున్నట్లే. ఈ పరిణామాన్ని సీట్లు ఆశిస్తున్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుడివాడ నియోజకవర్గంపై ధీమా కుదరక పోవడం బాలకృష్ణ అక్కడి నుంచి పోటీకి నిరాకరించినట్టు సమాచారం. ఆయనకు పదిలమైన నియోజకవర్గం కోసం సొంత వేగులు రంగంలోకి దిగారు. గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆయన సొంత మనుషులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ఆయన మూడింటిలో ఎక్కడి నుంచి పోటీకి సిద్ధమైనాఅక్కడ ఏళ్ల తరబడి ఆశలుపెట్టుకున్న వారి రాజకీయ భవిష్యత్తు మూడినట్టే. సర్దు‘బాట’లో గన్నవరం.. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ వర్గపోరుతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఒకే సామాజికవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, వల్లభనేని వంశీ మోహన్ నడుమ సీటు పోరు సాగుతోంది. ఇటీవల ఆ సీటు నాదంటే నాదంటూ ఇద్దరూ రచ్చకెక్కడంతో వారి సామాజికవర్గానికే చెందిన పెద్దలు సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అయినా వారిద్దరు చాపకింద నీరులా మళ్లీ రాజకీయ పోరు సాగిస్తూనే ఉన్నారు. తనకు సీటు రాకుంటే ఎన్టీఆర్ వారసులను గన్నవరం బరినుంచి పోటీచేయిస్తానని దాసరి ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇద్దరి తగవు తీర్చేందుకు బాలకృష్ణను రంగంలోకి దింపే వ్యూహం చంద్రబాబు పన్నుతున్నారని భావిస్తున్నారు. వీరిద్దర్నీ కాదని బాలయ్యకు సీటిచ్చినా నెగ్గుకొచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. పెనమలూరులోనూ అదే తంతు.. పోనీ బాలకృష్ణను పెనమలూరు పంపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తే అక్కడా వర్గపోరు నడుస్తోంది. రెండువర్గాలు ఏకంగా చంద్రబాబు సమక్షంలో కొట్టుకునే వరకు దారితీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పెనమలూరు సీటుపై మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, బోడే ప్రసాద్ పట్టుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు చలసాని పండు సతీమణి చలసాని పద్మావతి, విజయవాడ నగర మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, దేవినేని చంద్రశేఖర్ కూడా ఈ సీటుపై ఆశలుపెట్టుకుని తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకదశలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం పదిలం కాకపోవడంతో పెనమలూరుకు తీసుకొస్తారన్న ప్రచారం కూడా సాగింది. వైవీబీ మాత్రం తనకు సీటు రాకుంటే చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఇక్కడి నుంచి పోటీచేయించాలని కోరడం పార్టీలో పెనుదుమారం లేపింది. తాజాగా బాలకృష్ణ పేరు వినిపించడంతో ఆశావహులు బెంబేలెత్తుతున్నారు. ముద్దరబోయినకు ఝలకిస్తారా! గన్నవరం, పెనమలూరు కుదరకపోతే కనీసం నూజివీడు నుంచైనా బాలకృష్ణను పోటీకి దించితే ఎలా ఉంటుందనే దానిపై ఆయన అనుయాయులు లెక్కలు కడుతున్నట్టు సమాచారం. ఈ సీటుపై ఆశపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఝలక్ ఇస్తారా..అనే ఆసక్తికర చర్చసాగుతోంది. కేవలం టికెట్ ఇస్తారన్న ఆశతోనే పార్టీ మార్చి ఇప్పటికే నూజివీడులో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న ముద్దరబోయిన కస్సుబుస్సుమనే ప్రమాదం లేకపోలేదు. ఈ రకంగా జిల్లాలో ఏదో ఒక చోట నుంచి బాలయ్యను పోటీ చేయిస్తే ఆయన ఇమేజ్ మిగిలిన నియోజవకవర్గాల్లోనూ పనిచేస్తుందన్న చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టే ప్రమాదం ఉందని తెలుగుతమ్ముళ్లు మధనపడుతున్నారు. ఎన్టీఆర్ వారసులకు ఆదరణ ఏదీ.. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ జిల్లా నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వారసుడి ప్రభావం ఎంతమేరకు ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ను ఆదరించిన సొంత గడ్డ ఆయన వారసులను మాత్రం అంతగా పట్టించుకోలేదనే సంగతి గత ఎన్నికల ఫలితాలను చూస్తే అవగతమవుతుంది. ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టిన తొలినాళ్లలో గుడివాడ బాగా ఆదరించింది. అదే గుడివాడ ఆ తర్వాత హరికృష్ణను నాల్గోస్థానానికి పరిమితం చేసింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు, అత్తవారి ఊరు కొమరవోలు గ్రామాలు గతంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవి. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఎన్టీఆర్ సొంత గ్రామం, అత్తగారి ఊరు రెండూ పామర్రు నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. 1983 సార్వత్రిక ఎన్నికలు, 1985 మధ్యంతర ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీచేయగా ఆయన తనయుడు జయకృష్ణ ఇక్కడ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ 26,538 ఓట్ల్ల మెజార్టీ తెచ్చుకోగా 1985లో కేవలం 7,597ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. కాగా ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య రంగంలోకి దిగినా అంతగా కలిసిరాదనే సంగతి గత ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. -
రాజకీయాలపై ప్రస్తుతం ఆసక్తి లేదు
నందమూరు(కొవ్వూరు రూరల్), న్యూస్‌లైన్: ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ శనివారం కొవ్వూరు మండలం నందమూరులో బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తారని వినిపిస్తోంది వినాయక్: కొద్ది రోజుల క్రితం ఈ విషయం పొక్కింది. కొందరు రాజకీయ నేతలు నన్ను పోటీ చేయనని అడిగారు. ప్రస్తుతం నాకు రాజకీయాలపై అంతగా ఆశక్తి లేదు. ఈ విషయమే వారికి చెప్పాను. కారణం వినాయక్: ప్రస్తుతం నా దృష్టంతా సినిమా దర్శకత్వంపైనే. నా స్నేహితుడు బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు వస్తారు. వినాయక్: నేను దర్శకుడిని అవుతానని ఊహించలేదు. అయ్యాను. నా జీవితంలో ఏదీ ముందుగా ఇలా చేద్దామని అనుకోను. అనుకోకుండా జరుగుతాయంతే. ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదు. అంతా భగవంతుడి దయ. పవన్‌కల్యాణ్ పార్టీపై మీ కామెంట్ వినాయక్: పార్టీపై నేను స్పందించను కానీ ఆయన సగటు మనిషి ఆవేదన వ్యక్తం చేశారని భావిస్తున్నా. ప్రస్తుతం ఏ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు వినాయక్: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా మాత్రమే చేస్తున్నాను. క్లైమాక్స్, రెండు పాటలు మినహా చిత్ర నిర్మాణం పూర్తయింది. సోమవారం నుంచి దుబాయ్‌లో షూటింగ్ చేస్తాం. హీరోయిన్గా సమంత నటిస్తోంది. ఇది కమర్షియల్ చిత్రం. అన్ని హంగులు ఉంటాయి. చిరంజీవితో సినిమా చేస్తానన్నారు ఎంత వరకూ వచ్చింది వినాయక్: ఎన్నికలు అయిన తరువాత ఆయనతో కథా చర్చలు జరుపుతాను. ఆయన ఒప్పుకున్న వెంటనే సినిమా ప్రారంభిస్తాం. -
బంధుత్వాలకు తావుండదు: హరికృష్ణ
హైదరాబాద్ : రాష్ట్రం బాగుండాలి... రాష్ట్ర ప్రజలంతా కలసి ఉండాలని కోరుకుంటున్నట్లు నందమూరి హరికృష్ణ చెప్పారు. తన జన్మదినం సందర్భంగా ఆయన సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని కోరుకున్నారని హరికృష్ణ చెప్పారు. భారతంలో శకుని పాత్ర, రామయణంలో కైకేయి పాత్రల స్పూర్తిగా తన కొడుకును ప్రధానిని చేసేందుకే సోనియా తెలుగు వారి మధ్య చిచ్చుపెట్టిందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే సోనియాగాంధీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని చెప్పారు. తననెవరూ ప్రభావితం చేయలేదని... అయితే కానీ కొందరు పనిగట్టుకుని మరీ తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నందమూరి నుంచి ఆయన ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణ తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోరాదని నిర్ణయించారు. రాష్ట్రం ముక్కలుచెక్కుల అవుతుంటే తను జన్మదినం జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తండ్రి ఆశీస్సులకోసం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన హరికృష్ణ అనేక విషయాలపై మాట్లాడారు. రాజీనామాకు సంబంధించిన పార్టీ నుంచి వచ్చిన పేపర్‌పై సంతకం చేశానని... అయితే ఆ తర్వాత ఆ ఫార్మెట్ తప్పుదని తేలడంతో మరో రాజీనామా ఇచ్చినట్లు తెలిపారు. మహోద్యమంలో భాగమైనప్పుడు... బంధుత్వాలకు తావుండదని హరికృష్ణ ప్రకటించారు. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లిళ్లకు తన తండ్రి ఎన్టీఆర్ హాజరు కాలేదని గుర్తు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న తన తండ్రి ఆశయ సాధన కోసం తాను పోరాటం చేస్తానని హరికృష్ణ ప్రకటించారు. తన పార్టీఎంపీలు చేసిన రాజీనామాలు తప్పుడువని తెలిపారు. టిఆర్ఎస్తో పొత్తు పార్టీకి ముప్పని ఆరోజే చేప్పానని హరికృష్ణ స్పష్టం చేశారు . పొత్తుతో రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందని అధినేతకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.