
బంధుత్వాలకు తావుండదు: హరికృష్ణ
హైదరాబాద్ : రాష్ట్రం బాగుండాలి... రాష్ట్ర ప్రజలంతా కలసి ఉండాలని కోరుకుంటున్నట్లు నందమూరి హరికృష్ణ చెప్పారు. తన జన్మదినం సందర్భంగా ఆయన సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని కోరుకున్నారని హరికృష్ణ చెప్పారు. భారతంలో శకుని పాత్ర, రామయణంలో కైకేయి పాత్రల స్పూర్తిగా తన కొడుకును ప్రధానిని చేసేందుకే సోనియా తెలుగు వారి మధ్య చిచ్చుపెట్టిందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే సోనియాగాంధీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రం కోసం, ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని చెప్పారు. తననెవరూ ప్రభావితం చేయలేదని... అయితే కానీ కొందరు పనిగట్టుకుని మరీ తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నందమూరి నుంచి ఆయన ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణ తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోరాదని నిర్ణయించారు. రాష్ట్రం ముక్కలుచెక్కుల అవుతుంటే తను జన్మదినం జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తండ్రి ఆశీస్సులకోసం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన హరికృష్ణ అనేక విషయాలపై మాట్లాడారు. రాజీనామాకు సంబంధించిన పార్టీ నుంచి వచ్చిన పేపర్‌పై సంతకం చేశానని... అయితే ఆ తర్వాత ఆ ఫార్మెట్ తప్పుదని తేలడంతో మరో రాజీనామా ఇచ్చినట్లు తెలిపారు.
మహోద్యమంలో భాగమైనప్పుడు... బంధుత్వాలకు తావుండదని హరికృష్ణ ప్రకటించారు. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లిళ్లకు తన తండ్రి ఎన్టీఆర్ హాజరు కాలేదని గుర్తు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న తన తండ్రి ఆశయ సాధన కోసం తాను పోరాటం చేస్తానని హరికృష్ణ ప్రకటించారు. తన పార్టీఎంపీలు చేసిన రాజీనామాలు తప్పుడువని తెలిపారు. టిఆర్ఎస్‌తో పొత్తు పార్టీకి ముప్పని ఆరోజే చేప్పానని హరికృష్ణ స్పష్టం చేశారు . పొత్తుతో రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందని అధినేతకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.