లెజెండ్.. ఎవరికి బ్యాండ్!? | Legend Nandamuri Balakrishna all set for political debut | Sakshi
Sakshi News home page

లెజెండ్.. ఎవరికి బ్యాండ్!?

Published Wed, Apr 2 2014 9:39 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

లెజెండ్..  ఎవరికి బ్యాండ్!? - Sakshi

లెజెండ్.. ఎవరికి బ్యాండ్!?

 ‘నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్.. నాకు ఒకడు ఎదురొచ్చినా వాడికే రిస్క్.. తొక్కిపడేస్తా..’ ఇది లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్. ఈ మాటలు వెండితెరపై చెబితే ఆయన అభిమానులకు ఆనందమే. తాజాగా బాలయ్య చేసిన రాజకీయ ప్రకటన మాత్రం జిల్లాలోని తెలుగు తమ్ముళ్లను కంగారుపెడుతోంది. బావ చంద్రబాబు ఎక్కడ్నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ్నుంచి రెడీ అని బాలకృష్ణ ప్రకటించడంతో పార్టీలోని ఆశావహుల గుండెలు గుభేల్మంటున్నాయి. బాలయ్య గెలవడం మాటెలా ఉన్నా.. పోటీ పేరుతో వచ్చి ఎవరి సీటుకు ఎసరుపెడతారోనని భయపడిపోతున్నారు.
 
      *బాలకృష్ణ ప్రకటనతో జిల్లాలో రాజకీయ ప్రకంపనలు
      *గన్నవరం, పెనమలూరు, నూజివీడుల్లో లెక్కలు తారుమారు
      *ఎన్టీఆర్ వారసులను అంతగా ఆదరించని జిల్లావాసులు
      *టీడీపీలో మరో వర్గపోరుకు సూచికలు

 
 తెలుగుదేశం పార్టీలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నవారిని కాదని కొత్తవారిని తీసుకొచ్చి తమ నెత్తికెక్కిస్తున్నారంటూ టీడీపీ ఆశావహులు కారాలుమిరియాలు నూరుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ పరిస్థితి ఇదే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పోటీకి సై అనడంతో రాజకీయ తెరపైకి మరో కృష్ణుడు వస్తున్నట్లే. ఈ పరిణామాన్ని సీట్లు ఆశిస్తున్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుడివాడ నియోజకవర్గంపై ధీమా కుదరక పోవడం బాలకృష్ణ అక్కడి నుంచి పోటీకి నిరాకరించినట్టు సమాచారం. ఆయనకు పదిలమైన నియోజకవర్గం కోసం సొంత వేగులు రంగంలోకి దిగారు. గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీచేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆయన సొంత మనుషులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ఆయన మూడింటిలో ఎక్కడి నుంచి పోటీకి సిద్ధమైనాఅక్కడ ఏళ్ల తరబడి ఆశలుపెట్టుకున్న వారి రాజకీయ భవిష్యత్తు మూడినట్టే.

 సర్దు‘బాట’లో గన్నవరం..
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ  వర్గపోరుతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.  ఒకే సామాజికవర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, వల్లభనేని వంశీ మోహన్ నడుమ సీటు పోరు సాగుతోంది. ఇటీవల ఆ సీటు నాదంటే నాదంటూ ఇద్దరూ రచ్చకెక్కడంతో వారి సామాజికవర్గానికే చెందిన పెద్దలు సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అయినా వారిద్దరు చాపకింద నీరులా మళ్లీ రాజకీయ పోరు సాగిస్తూనే ఉన్నారు. తనకు సీటు రాకుంటే ఎన్టీఆర్ వారసులను గన్నవరం బరినుంచి పోటీచేయిస్తానని  దాసరి ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇద్దరి తగవు తీర్చేందుకు బాలకృష్ణను రంగంలోకి దింపే వ్యూహం చంద్రబాబు పన్నుతున్నారని భావిస్తున్నారు. వీరిద్దర్నీ కాదని బాలయ్యకు  సీటిచ్చినా నెగ్గుకొచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.

 పెనమలూరులోనూ అదే తంతు..
 పోనీ బాలకృష్ణను పెనమలూరు పంపితే  ఎలా ఉంటుందని ఆలోచిస్తే అక్కడా వర్గపోరు నడుస్తోంది. రెండువర్గాలు ఏకంగా చంద్రబాబు సమక్షంలో కొట్టుకునే వరకు దారితీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పెనమలూరు సీటుపై మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, బోడే ప్రసాద్ పట్టుగా ఉన్నారు.  ఇది చాలదన్నట్టు చలసాని పండు సతీమణి చలసాని పద్మావతి, విజయవాడ నగర మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ, దేవినేని చంద్రశేఖర్ కూడా ఈ సీటుపై ఆశలుపెట్టుకుని తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకదశలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం పదిలం కాకపోవడంతో పెనమలూరుకు తీసుకొస్తారన్న ప్రచారం కూడా సాగింది. వైవీబీ మాత్రం తనకు సీటు రాకుంటే చంద్రబాబు తనయుడు లోకేష్‌ను ఇక్కడి నుంచి పోటీచేయించాలని కోరడం పార్టీలో పెనుదుమారం లేపింది. తాజాగా బాలకృష్ణ పేరు వినిపించడంతో ఆశావహులు బెంబేలెత్తుతున్నారు.

 ముద్దరబోయినకు ఝలకిస్తారా!
గన్నవరం, పెనమలూరు కుదరకపోతే కనీసం నూజివీడు నుంచైనా బాలకృష్ణను పోటీకి దించితే ఎలా ఉంటుందనే దానిపై ఆయన అనుయాయులు లెక్కలు కడుతున్నట్టు సమాచారం. ఈ సీటుపై ఆశపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఝలక్ ఇస్తారా..అనే ఆసక్తికర చర్చసాగుతోంది. కేవలం టికెట్ ఇస్తారన్న ఆశతోనే పార్టీ మార్చి ఇప్పటికే నూజివీడులో  కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న ముద్దరబోయిన కస్సుబుస్సుమనే ప్రమాదం లేకపోలేదు.  ఈ రకంగా జిల్లాలో ఏదో ఒక చోట నుంచి బాలయ్యను పోటీ చేయిస్తే ఆయన ఇమేజ్ మిగిలిన నియోజవకవర్గాల్లోనూ పనిచేస్తుందన్న చంద్రబాబు ఎత్తుగడ బెడిసికొట్టే  ప్రమాదం ఉందని తెలుగుతమ్ముళ్లు మధనపడుతున్నారు.    
 
 ఎన్టీఆర్ వారసులకు ఆదరణ ఏదీ..
 
ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ  జిల్లా నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వారసుడి ప్రభావం ఎంతమేరకు ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ను ఆదరించిన సొంత గడ్డ ఆయన వారసులను మాత్రం అంతగా పట్టించుకోలేదనే సంగతి గత ఎన్నికల ఫలితాలను చూస్తే అవగతమవుతుంది. ఎన్టీఆర్‌ను పార్టీ పెట్టిన తొలినాళ్లలో గుడివాడ బాగా ఆదరించింది.  అదే గుడివాడ ఆ తర్వాత  హరికృష్ణను నాల్గోస్థానానికి పరిమితం చేసింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు, అత్తవారి ఊరు కొమరవోలు గ్రామాలు గతంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవి.

2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఎన్టీఆర్ సొంత గ్రామం, అత్తగారి ఊరు రెండూ పామర్రు నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. 1983 సార్వత్రిక ఎన్నికలు, 1985 మధ్యంతర ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీచేయగా ఆయన తనయుడు జయకృష్ణ ఇక్కడ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్ 26,538 ఓట్ల్ల మెజార్టీ తెచ్చుకోగా 1985లో కేవలం 7,597ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. కాగా ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య రంగంలోకి దిగినా అంతగా కలిసిరాదనే సంగతి గత ఎన్నికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement