nandigama by election
-
నందిగామలో 69.49 శాతం పోలింగ్ నమోదు
(నందిగామ - అనిల్ ) నందిగామ: కృష్ణాజిల్లాలోని నందిగామ శాసనసభ స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఆ నియోజకవర్గంలో మొత్తం 69.49 శాతం ఓట్లు పోలైయ్యాయి. ఆ శాసనసభ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పోలైన ఓట్లు చంద్రలపాడు (72.02), నందిగామ (65.21), వీరులపాడు (76.27), కంచికచర్ల (69.49). ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు విజయం సాధించారు. అయితే ఆయన గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబురావు ఎన్నికల్లో నిలబడ్డారు. -
'బాబు వచ్చాక... జాబులు పోయాయి'
విజయవాడ: కృష్ణాజిల్లాలోని నందిగామ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిగా బి.బాబురావును పోటీలో నిలబెడుతున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం చేసేందుకే తమ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.... కానీ బాబు వచ్చిన తర్వాత ఉన్న జాబులు పోయాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయ బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు కేటాయిస్తే ఎన్ని సంవత్సరాల్లో రైతు రుణాలు మాఫీ చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. -
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థిగా బాబూరావు
ఎమ్మెల్యే మృతితో ఖాళీ అయిన నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. తంగిరాల ప్రభాకరరావు మృతి కారణంగా ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమెకు సానుభూతిగా వేరే పార్టీలేవీ పోటీ చేయకుండా ఉండాలని, ఏకగ్రీవంగా ఆమెను ఎన్నిక చేయాలని తెలుగుదేశం పార్టీ కోరింది. అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలనే నిర్ణయించుకుంది. గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క స్థానం కూడా దక్కని విషయం తెలిసిందే. ఈసారి నందిగామ స్థానంలో ఏపీసీసీ కార్యదర్శి బోడపాటి బాబూరావుతో పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరు ఖరారు చేశారు.