Nanduri sambasiva rao
-
ఆ ఇద్దరి వల్లే ఈ స్థాయికి చేరుకున్నా: డీజీపీ నండూరి
సాక్షి, అమరావతి : తాను ఈ స్థాయికి రావడానికి తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు బాలకృష్ణ మూర్తి, రామకృష్ణా రావుల కృషి ఎంతో ఉందని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. ఏడవ తరగతిలో తమ ఉపాధ్యాయుడు రామకృష్ణా రావు చెప్పిన పాఠం తనకు యూపీఎస్సీ పరీక్షలో ప్రశ్నగా వచ్చిందన్నారు. వీడ్కోలు సభలో మాట్లాడుతూ నుండూరి సాంబశివరావు ఉద్వేగానికి లోనయ్యారు. 1984లో సివిల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు. బెల్లంపల్లిలో 1987లో ఏఎస్పీగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయి శాంతిని నెలకొల్పారని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పని చేయగలరనే ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతగానో సహకరించారని, తనకు పదవి ఎప్పుడూ అలంకారం కాదని అన్నారు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కొన్ని కొత్త నిర్ణయాలు, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించానని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎవరినైనా మాటలతో నొప్పించాను కానీ రాతలతో ఎప్పుడూ ఎవరినీ బాధించలేదని చెప్పారు. సాంబశివరావు నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాల కొండయ్య మాట్లాడుతూ.. నండూరి సాంబశివ రావు తనకు ఒక అన్న లాంటి వారని వ్యాఖ్యానించారు. తాను వివిధ శాఖల్లో పనిచేసేటప్పుడు అయిదు సార్లు ఆయన నుంచి బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. తామిద్దరం కాకినాడలో ఒకే ఎస్పీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నామని వెల్లడించారు. నండూరి సాంబశివరావు ఇచ్చిన స్ఫూర్తితో పని చేస్తానని చెప్పారు. సాంబశివరావు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
మీడియాకు చెప్పాకే చేపడతా
సాక్షి, అమరావతి: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకులేదని, పదవీ విరమణ తరువాత 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో నిర్మించిన ఇండోర్ జిమ్, ఫిజియోథెరపీ హెల్త్ సెంటర్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, సింథటిక్ టెన్నిస్ కోర్టులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అని మీడియా ప్రశ్నించడంతో తనకు ఆ ఆలోచన లేదన్నారు. మీడియాకు చెప్పాకే తన భవిష్యత్ కార్యాచరణ చేపడతానని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టు తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలోగానీ, కులపరమైన ఆందోళలను అదుపు చేయగలగడంలోగానీ గట్టి ప్రయత్నమే చేశానని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ శాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు ప్రయత్నం చేశానని చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించారని చెప్పారు. -
పూర్తిస్థాయి డీజీపీగా సాంబశివరావు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జూలై నుంచి సాంబశివరావు ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొత్త డీజీపీని ఎంపిక చేసేందుకు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తోసుపుచ్చింది. ఏడుగురు అధికారుల పేర్లతో రాష్ట్రం పంపిన జాబితాను వెనక్కి పంపింది. అంతేకాకుండా ఆరునెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని పేర్లను తొలగించి తదుపరి జాబితా పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో ఢిల్లీలో బుధవారం జరగాల్సిన యూపీఎస్సీ కమిటీ సమావేశం వాయిదా పడింది. సాంబశివరావు పదవీ విరమణ చేస్తే డీజీపీ రేసులో ఠాకూర్, కౌముదిలు ఉంటారు. అయితే కౌముది ఏపీ డీజీపీగా వచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. సాంబశివరావు పొడిగింపు లేకుంటే ఠాకూర్ డీజీపీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అనురాగ్‌శర్మను కలిసిన ఏపీ డీజీపీ సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నండూరి సాంబశివరావు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మను సోమవారం తన కార్యాలయంలో కలుసుకున్నారు. నూతనంగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు మర్యాద పూర్వకంగా డీజీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు డీజీపీలు పాలసీ అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. -
ఏపీ కొత్త డీజీపీగా సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ డెరైక్టర్ జనరల్(డీజీపీ)గా ప్రస్తుతం ఏపీఎస్సార్టీసీ ఎండీగా ఉన్న నండూరి సాంబశివరావు నియమితులు కానున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డీజీపీ రాముడు ఈనెల 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు సాంబశివరావు ఇన్చార్జి డీజీపీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత డీజీపీ ర్యాంకు అధికారుల జాబితాను ఏపీ సర్కారు కేంద్రానికి పంపిస్తుంది. అందులో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ కమిటీ ఎంపిక చేసి ఏపీ సర్కారుకు సిఫారసు చేస్తుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఏపీ సర్కారు డీజీపీగా నియమించుకుంటుంది. -
ఆర్టీసీ ఎండీ ఒంగోలు వాసే
ఒంగోలు: ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమితులైన నండూరి సాంబశివరావు స్వస్థలం ఒంగోలులోని మిరియాలపాలెం. తండ్రి రామకోటయ్య మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవారు. తల్లి సూరమ్మ గృహిణి. కష్టపడి చదువును కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిష్టించడం పట్ల ఒంగోలు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పాఠశాల విద్యనంతా పీవీఆర్ పాఠశాలలో 1967-1972 కాలంలో పూర్తిచేశారు. స్థానిక సీఎస్ఆర్ శర్మా కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీలో మెకానికల్-మెరైన్ ఇంజినీరింగ్‌ను 1974-79 లో పూర్తిచేశారు. ఇక్కడ కూడా టాపర్ అండ్ లాజరస్ ప్రైజ్ విజేతగా నిలిచారు. అనంతరం మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (మెకానికల్ ఇంజనీరింగ్)ను ఐఐటీ కాన్పూర్‌లో 1979-81 కాలంలో అభ్యసించారు. సివిల్స్‌లో రాణించి 1984లో ఐపీఎస్ హోదాలో ఆయన పోలీసు డిపార్టుమెంట్లో చేరారు. మార్చి 2010 నుంచి 2013 మే వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ డెరైక్టర్ పని చేశారు. 2013 మే నుంచి ఆయన అత్యవసర సేవల విభాగమైన ఫైర్ అండ్ ఎమర్జన్సీ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయనను తాజాగా ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన సతీమణి కూడా ఒంగోలు శర్మా కాలేజీలోనే చదువుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు జిల్లా వాసి కాగా, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ సాంబశివరావు కూడా ఒంగోలు వాసే కావడం గమనార్హం.