సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా నండూరి సాంబశివరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జూలై నుంచి సాంబశివరావు ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
కొత్త డీజీపీని ఎంపిక చేసేందుకు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం తోసుపుచ్చింది. ఏడుగురు అధికారుల పేర్లతో రాష్ట్రం పంపిన జాబితాను వెనక్కి పంపింది. అంతేకాకుండా ఆరునెలల లోపు రిటైర్డ్ అయ్యే వారిని పేర్లను తొలగించి తదుపరి జాబితా పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో ఢిల్లీలో బుధవారం జరగాల్సిన యూపీఎస్సీ కమిటీ సమావేశం వాయిదా పడింది. సాంబశివరావు పదవీ విరమణ చేస్తే డీజీపీ రేసులో ఠాకూర్, కౌముదిలు ఉంటారు. అయితే కౌముది ఏపీ డీజీపీగా వచ్చేందుకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. సాంబశివరావు పొడిగింపు లేకుంటే ఠాకూర్ డీజీపీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment