
సాక్షి, అమరావతి: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకులేదని, పదవీ విరమణ తరువాత 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో నిర్మించిన ఇండోర్ జిమ్, ఫిజియోథెరపీ హెల్త్ సెంటర్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, సింథటిక్ టెన్నిస్ కోర్టులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అని మీడియా ప్రశ్నించడంతో తనకు ఆ ఆలోచన లేదన్నారు. మీడియాకు చెప్పాకే తన భవిష్యత్ కార్యాచరణ చేపడతానని వెల్లడించారు.
రాష్ట్రంలో మావోయిస్టు తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలోగానీ, కులపరమైన ఆందోళలను అదుపు చేయగలగడంలోగానీ గట్టి ప్రయత్నమే చేశానని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ శాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు ప్రయత్నం చేశానని చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తిగా సహకరించారని చెప్పారు.