సాక్షి, అమరావతి : తాను ఈ స్థాయికి రావడానికి తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు బాలకృష్ణ మూర్తి, రామకృష్ణా రావుల కృషి ఎంతో ఉందని ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. ఏడవ తరగతిలో తమ ఉపాధ్యాయుడు రామకృష్ణా రావు చెప్పిన పాఠం తనకు యూపీఎస్‌సీ పరీక్షలో ప్రశ్నగా వచ్చిందన్నారు. వీడ్కోలు సభలో మాట్లాడుతూ నుండూరి సాంబశివరావు ఉద్వేగానికి లోనయ్యారు. 1984లో సివిల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు. బెల్లంపల్లిలో 1987లో ఏఎస్పీగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయి శాంతిని నెలకొల్పారని వ్యాఖ్యానించారు.
ఏపీ పోలీసులకు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పని చేయగలరనే ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ఎంతగానో సహకరించారని, తనకు పదవి ఎప్పుడూ అలంకారం కాదని అన్నారు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కొన్ని కొత్త నిర్ణయాలు, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించానని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎవరినైనా మాటలతో నొప్పించాను కానీ రాతలతో ఎప్పుడూ ఎవరినీ బాధించలేదని చెప్పారు.
సాంబశివరావు నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాల కొండయ్య మాట్లాడుతూ.. నండూరి సాంబశివ రావు తనకు ఒక అన్న లాంటి వారని వ్యాఖ్యానించారు. తాను వివిధ శాఖల్లో పనిచేసేటప్పుడు అయిదు సార్లు ఆయన నుంచి బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. తామిద్దరం కాకినాడలో ఒకే ఎస్పీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నామని వెల్లడించారు. నండూరి సాంబశివరావు ఇచ్చిన స్ఫూర్తితో పని చేస్తానని చెప్పారు. సాంబశివరావు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment