నసీర్ పకీర్ పై తొలి చార్జీషీటు దాఖలు
న్యూఢిల్లీ: యువకులను ఐఎస్ఐఎస్ ఉగ్రసంస్థలోకి ఆహ్వానిస్తున్నాడన్న ఆరోపణలతో గత డిసెంబర్ లో అరెస్టయిన నసీర్ పకీర్ పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) తొలి చార్జిషీటు దాఖలు చేసింది. జిల్లా జడ్జి జస్టిస్ అమర్ నాథ్ ఎదుట పకీర్ పై విచారణ చేసి చార్జిషీటులో పలు అభియోగాలు నమోదు చేశారు. ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాడని, యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నాడని అతడిపై ఆరోపణలున్నాయి.
సోషల్ మీడియాను వాడుకుంటూ ముస్లిం యువకులతో చర్చిస్తున్నాడని, దేశంలోనే కాదు విదేశాలలో ఉన్న ఇతర ఉగ్రసంస్థలతోనే నిందితుడికి సంబంధాలున్నాయని తెలుస్తోంది. జూన్ 9 వరకు అతడికి జ్యూడిషీయల్ కస్డడీని పొడిగించారు. గత అక్టోబర్ లో నసీర్ పకీర్ ఐఎస్ఐఎస్ లో చేరడానికి ప్రయత్నాలు చేశాడని అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ లో అతడు భారత్ కు తిరిగి వచ్చిన సమయంలో హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారంతో నసీర్ ను అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో పేర్కొంది.