బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత
జిల్లా జాయింట్ కలెక్టర్-1 సీహెచ్ శ్రీధర్
గుంటూరు ఈస్ట్ : బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు, జీడీఎఫ్సీఆర్, కార్మిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. తొలుత హిందూ కళాశాల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, పిల్లలను చదివించాలని ర్యాలీలో నినాదాలు చేశారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్-1 సి.హెచ్.శ్రీధర్‌ను కలిసి బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో భాగంగా సంతకం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అన్నారు.
స్వచ్ఛంద సంస్థలతో పాటు, అన్ని శాఖల అధికారులు ఈ వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ కొనసాగడం వల్ల సమాజంలో అనిశ్చిత పరిస్థితులు పెరుగుతాయన్నారు. అందరూ తమ పిల్లలను చదివించాలన్నారు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు పీడీ ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం సంపూర్ణంగా అమలు చేయడం ద్వారా బాలకార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపవచ్చన్నారు.
కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కాశీవిశ్వనాథం మాట్లాడుతూ తమ పరిధిలో ఎక్కడైనా బాలకార్మిక వ్యవస్థ ఉంటే వెంటనే తమకు సమాచారం అందించాలని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరకుమార్, వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ పి.వి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వరల్డ్ విజన్ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు.