ఎన్నికల నిధుల కోసం ప్రత్యేక ట్రస్ట్
ఏర్పాటుకు పార్టీల సూత్రప్రాయ అంగీకారం
సంస్కరణలపై పార్టీలతో సీఈసీ సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ధనబలానికి, కండబలానికి ముకుతాడు వేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆధ్వర్యంలో జాతీయ ఎన్నికల ట్రస్ట్(ఎన్ఈటీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు దేశంలోని పలు పార్టీలు సూత్రప్రాయంగా మద్దతు ప్రకటించాయి. అయితే దీనిపై ఇంకా సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందన్నాయి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి రాజకీయ పార్టీలకు నిధులు, లా కమిషన్ సిఫార్సులపై సీఈసీ రాజకీయ పక్షాలతో సోమవారం సంప్రదింపులు జరిపింది. 38 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
కార్పొరేట్ నిధుల కోసం ఈసీ ఆధ్వర్యంలో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దాన్నుంచి పార్టీలకు నిధుల పంపిణీ జరగాలన్న లా కమిషన్ సిఫార్సుకు 70 శాతం మంది ప్రతినిధులు మద్దతు తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎంత డబ్బు అవసరమౌతుందన్నది నిర్ణయించటం కష్టమైన పని అని కొన్ని పార్టీలు పేర్కొన్నాయి. ఎన్నికల కోసం ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్న ప్రజాధనాన్ని విద్య, మౌలిక సదుపాయాల వంటి వాటికోసం వెచ్చించాలన్న గట్టి అభిప్రాయం వ్యక్తమైంది.
అమెరికాలో మాదిరిగా ప్రత్యర్థులు టెలివిజన్ చానళ్ల ప్రత్యక్ష చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటే ఖర్చు గణనీయంగా తగ్గించవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపులో వివిధ ఈవీఎంలలో ఓటింగ్ జరిగిన విధానం బయటపడకుండా ఉండేందుకు టోటలైజర్ మెషిన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. దీని ద్వారా ఓట్లను మిక్సింగ్ చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎన్నికల నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు అవసరంపై అన్ని పార్టీలూ సానుకూలంగా స్పందించాయన్నారు.