ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. ఒకరి మృతి
భీమవరం(పశ్చిమగోదావరి): వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం ఆకివీడులో గురువారం రాత్రి జరిగింది. గ్రామ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద 216వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంట్లోకి వేగంగా వెళ్తున్న లారీ దూసుకెళ్లింది.
దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.