National Insurance Company
-
ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు అదనపు మూలధనం
న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు గట్టెక్కేందుకు మరింత తోడ్పాటు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 3,000 కోట్లు అదనపు మూలధనం సమకూర్చే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మూడు సంస్థలు – నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం రూ. 5,000 కోట్లు సమకూర్చింది. ఇందులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అత్యధికంగా రూ. 3,700 కోట్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్‌కు రూ. 1,200 కోట్లు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌కు రూ. 100 కోట్లు దక్కాయి. ప్రభుత్వ రంగంలో మొత్తం నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ మాత్రమే స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
కోవిడ్-19తో మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు
Covid-19: కోవిడ్-19 మహమ్మరి అంటువ్యాధి కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థల సిబ్బంది మరణిస్తే ఆ ఉద్యోగుల నామినీలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో అందించనున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులకు కోవిడ్-19 ఎక్స్ గ్రేషియాను చెల్లించాలని నిర్ణయించినట్లు జనరల్ ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్(జీఐఈఏఐఏ) అధికారి ఒకరు తెలిపారు. ఈ నాలుగు బీమా సంస్థలలో ఒకటైన ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కోవిడ్-19తో మరణించిన ఉద్యోగుల నామినీకి రూ.10 లక్షలను ఏకమొత్తంగా ఎక్స్ గ్రేషియాను చెల్లించినట్లు ప్రకటిస్తూ జూలై 22న సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగి/జీవిత భాగస్వామి/ఆధారిత పిల్లలు, తల్లిదండ్రుల చికిత్స కోసం స్టాఫ్ గ్రూప్ మెడిక్లెయిం పాలసీ కింద కవర్ కానీ వైద్య ఖర్చులను కూడా 100 శాతం తిరిగి చెల్లిస్తామని బీమా కంపెనీ తెలిపింది. "నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే నాలుగు ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్కు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. మిగిలిన మూడు కంపెనీలు త్వరలో తమ సర్క్యులర్లతో బయటకు రావచ్చు" అని జీఐఏఐఏ ప్రధాన కార్యదర్శి కె. గోవిందన్ తెలిపారు. -
పరిష్కారమైన వివాదంపై అప్పీల్ ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: లోక్ అదాలత్‌లో పరిష్కారమైన ఓ వివాదంపై మళ్లీ అప్పీళ్లు దాఖలు చేసిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలను భూస్థాపితం చేసేలా ఇటువంటి పనికిరాని వ్యాజ్యాలను దాఖలు చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేసినందుకు ఆ కంపెనీకి రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లాలో జరిగిన లోక్ అదాలత్‌లో పెంటమ్మ, యేసమ్మ తదితరులకు పరిహారం చెల్లించేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంగీకరించింది. దీంతో లోక్ అదాలత్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సదరు బీమా కంపెనీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నేషనల్ ఇన్సూరెన్స్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, లోక్ అదాలత్‌లో ఉత్తర్వులు జారీ చేసే సమయంలో తమ అధికారుల నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించింది. ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంది. -
రాష్ డ్రైవింగ్‌పై సుప్రీం కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : వాహన ప్రమాద బీమా విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అజాగ్రత్తగా రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైన వారికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని స్పష్టం చేసింది. దిలీప్ భౌమిక్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసును జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు గతంలో త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. కేసు వివరాలు.. తన రాష్ డ్రైవింగ్ కారణంగా త్రిపురకు చెందిన దిలీప్ భౌమిక్ 2012, మే 20న జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. దిలీప్ మృతికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్ట పరిహారాన్ని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. విచారించిన త్రిపుర హైకోర్టు మృతుని కుటుంబ సభ్యులకు 10.57 లక్షల రూపాయలు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పుపై బీమా కంపెనీ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాదనలు వినిపించింది. సొంత తప్పిదం వల్లే కారు ప్రమాదానికి గురై దిలీప్ మరణించాడని పేర్కొంది. మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం దిలీప్ థర్డ్ పార్టీ కిందకి రాడని సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి ప్రాణాలు కోల్పోయిన దిలీప్ భౌమిక్ మృతికి బీమా కంపెనీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. కానీ, వ్యక్తిగత ప్రమాద బీమా పరిహారంగా మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయలు (వడ్డీ అదనం) చెల్లించాలని తెలిపింది. అయితే, రాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదానికి గురైన ఇతరులకు (థర్డ్ పార్టీ) నష్టపరిహారం చెల్లించే విషయంలో ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపించబోదని సుప్రీం వెల్లడించింది. -
మూగజీవాలకు బీమా కాపరిలో ధీమా
న్యూ ఇండియా, ఓరియంటల్, యునెటైడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లు జనరల్ ఇన్సూరెన్స్ చేస్తున్నాయి. జీవాల పెంపకందారులు స్వయంగా జీవాలకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ తో కూడిన రుణాల ద్వారా పంపిణీ చేసిన జీవాలకు ముందే బీమా చేయిస్తుంది. నాలుగు మాసాల నుంచి ఏడేళ్లలోపు జీవాలన్నింటికీ(గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, మేకపోతులు) బీమా చేయవచ్చు. ప్రీమియం రేట్లు పశువైద్యులు నిర్ణయించిన జీవాల విలువపై 3 నుంచి 5 శాతం మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. దేశవాళీ జీవాలకు 4 శాతం, సంకర జాతి జీవాలకు 5 శాతం, విదేశీ జాతి జీవాలకు 3 శాతం, ప్రభుత్వం సబ్సిడీపై అందించే జీవాలకు 2.75 శాతం ప్రీమియం వసూలు చేస్తారు. జనరల్ ఇన్సూరెన్స్ కాబట్టి ప్రీమియం తిరిగిరాదు. జీవాలు మరణిస్తే పరిహారం అందుతుంది. డిస్కౌంట్ ఆఫర్లు వంద నుంచి పది వేల వరకు జీవాలకు ఇన్సూరెన్స్ చేస్తే ప్రీమియంలో 5 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. 50+2 మందను ఇన్సూరెన్స్ చేస్తే ప్రీమియంలో 2.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. జీవాలు 80 కి.మీ. దాటి మేతకు వెళ్తే ప్రీమియం మొత్తం పెరుగుతుంది. పరిహారం ఎప్పుడు లభిస్తుంది ప్రమాదం వల్ల, వ్యాధులు సోకడం వల్ల, ఆపరేషన్ చేయించిన తర్వాత, దోపిడీ జరిగినప్పుడు, అగ్నిప్రమాదాలు, పిడుగులు, వరదలు, భూకంపాలు, కరువు కాటకాలు, తుఫానులు మొదలగు సందర్భాల్లో జీవాలు మరణిస్తే నష్టపరిహారం లభిస్తోంది. ఈ సందర్భాల్లో వర్తించదు ఇన్సూరెన్స్ చేసిన జీవాలకు యుద్ధం వల్ల నష్టం జరిగినా, అంటువ్యాధులు సోకి మరణించినా, ఉద్దేశపూర్వకంగా వ్యాధికి సరైన చికిత్స, ఆహారం అందించకపోయినా, ఒక జీవం చెవిపొగును మరొక జీవానికి మార్చినా, తెలిసీతెలియని వైద్యం అందించినా.. మరణించిన జీవానికి ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం అందించవు. బీమా గడువు పూర్తికావడం, ధ్రువపత్రాలు సరిగ్గా లేకపోవడం, చెవిపొగు లేకపోవడం వంటి సందర్భాల్లోనూ నష్టపరిహారం అందదు. -
అదే ప్రమాణమైతే పుట్టి మునిగినట్టే
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘ఊరింపు ఎక్కువ.. ఉద్ధరింపు తక్కువ’ అన్నట్టు మారింది సవరించిన పంటల బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్) తీరు. పేరుకు సవరించిన పథకం అంటున్నా ఇంకా పాత పద్ధతుల్లోనే పంటల నష్టం నమోదు చేస్తుండడం.. అసలే విపత్తులతో కుదేలైన రైతులను మరింత కుంగదీసేదిగా ఉంది. పంట నష్టం నమోదుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ పాత విధానంలో పంటకోత ప్రయోగాల ద్వారా వచ్చిన దిగుబడినే పరిగణనలోకి తీసుకుంటోంది. దీనివల్ల భారీ వర్షాలు, హెలెన్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులు బీమా పరిహారాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. జిల్లాలో ఖరీఫ్ వరి సాగుకు సంబంధించి అక్టోబరు 20 తరువాత పంట కోత ప్రయోగాలు ఆరంభమయ్యాయి. ముందుగా సాగు చేసిన తూర్పు డెల్టాలో పంట కోత ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే అక్టోబరు 22 నుంచి వాయుగండం, ఈశాన్య రుతుపవనాలతో వారం పాటు కురిసిన భారీ వర్షాలు తూర్పు డెల్టా రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో వరి దెబ్బ తింది. అనంతరం నవంబరు మొదటి వారం నుంచి మధ్య డెల్టా, మెట్ట తదితర ప్రాంతాల్లో పంటకోత ప్రయోగాలు సాగాయి. పంటకోత ప్రయోగాలు 80 శాతం పూర్తయ్యాక హెలెన్ తుపాను బీభత్సం సృష్టించడంతో వరి పంట దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. వర్షాలు, తుపాన్ల దెబ్బకు జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. 12 లక్షల టన్నుల నుంచి 4 లక్షలకు పతనమైన దిగుబడి పంటకోత ప్రయోగాల అనంతరం అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఖరీఫ్ దిగుబడి జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి రావాల్సి ఉంది. విపత్తుల వల్ల దిగుబడి 4 లక్షల మెట్రిక్ టన్నులకు మించలేదు. దీనిలోనూ సగం రంగు మారిన, తేమ ధాన్యం కావడం గమనార్హం. తూర్పు డెల్టాలో ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు, మధ్య డెల్టా, మెట్టల్లో ఎకరాకు 20 నుంచి 25 బస్తాల దిగుబడి వస్తుందని పంటకోత ప్రయోగాల్లో తేలింది. అయితే ప్రయోగాల అనంతరం దాపురించిన వర్షాలు, తుపాన్లతో మధ్య డెల్టాలో చాలా చోట్ల పది బస్తాల దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దారుణంగా నష్టపోయిన రైతులు బీమా పరిహారంపై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సవరించిన పంటల బీమా పథకంలో సుమారు రూ.217 కోట్లు పరిహారం అందిన విషయం తెలిసిందే. ఈసారి అంతకంటే ఎక్కువ నష్టపోయినా సగం కూడా పరిహారం వచ్చే అవకాశం కనబడడం లేదు. పథకం కొత్తదే అయినా బీమా కంపెనీ అధికారులు పంటకోత ప్రయోగాలకు వచ్చిన దిగుబడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే తుపాను వల్ల పంట తుడిచిపెట్టుకుపోయిన రైతులు బీమా పొందే అవకాశం లేకుండా పోతుంది. దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారో? సవరించిన బీమా పథకంలో నారుమళ్ల దశ నుంచి పంటను మార్కెట్‌కు తరలించే వరకు బీమా వర్తిస్తుందని ప్రభుత్వం, బీమా కంపెనీ చెప్పాయి. దీనిని నమ్మిన రైతులు ప్రీమియం 2.25 శాతం నుంచి 5.4 శాతానికి పెంచినా బీమా చేయించుకున్నారు. తీరా పాత విధానంతో లెక్కలు కట్టి పరిహారం చెల్లిస్తారని తెలియడంతో లబోదిబోమంటున్నారు. రైతులు ఆందోళనకు గురవడంతో ఇటీవల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే లక్షల ఎకరాల్లో పంటపోతే కేవలం ఒకటి రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల తమకు న్యాయం చేస్తారనే నమ్మకం కలగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు న్యాయం జరిగేలా ఏ పద్ధతిని పాటించి పంటనష్టం నమోదు చేస్తారో అటు వ్యవసాయ శాఖ అధికారులకు సైతం అంతుపట్టడం లేదు. తుపాను తరువాత కొన్నిచోట్ల మిగిలిన పంటకోత ప్రయోగాలను అధికారులు పూర్తి చేశారు. వీటిలో దిగుబడి పది బస్తాలకు మించడం లేదని గుర్తించారు. తుపాను తరువాత నిర్వహించిన పంటకోత ప్రయోగాలను పరిగణనలోకి తీసుకున్నా తమకు న్యాయం జరగదని తీరప్రాంత మండలాలకు చెందిన రైతులు చెబుతున్నారు. తమ ప్రాంతాల్లో వరిచేలు పడిపోవడంతో పాటు రోజుల తరబడి నీట నాని కుళ్లిపోయిందని, దీంతో కొందరు రైతులు కోతలు కోయించకుండా నేరుగా దమ్ములు చేయించారని చెబుతున్నారు. ఇలాంటి ఆయకట్లలో పంట నష్టం నమోదుకు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారనేది అర్థం కాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.