అమలాపురం, న్యూస్‌లైన్ : ‘ఊరింపు ఎక్కువ.. ఉద్ధరింపు తక్కువ’ అన్నట్టు మారింది సవరించిన పంటల బీమా పథకం (ఎంఎన్‌ఏఐఎస్) తీరు. పేరుకు సవరించిన పథకం అంటున్నా ఇంకా పాత పద్ధతుల్లోనే పంటల నష్టం నమోదు చేస్తుండడం.. అసలే విపత్తులతో కుదేలైన రైతులను మరింత కుంగదీసేదిగా ఉంది. పంట నష్టం నమోదుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ పాత విధానంలో పంటకోత ప్రయోగాల ద్వారా వచ్చిన దిగుబడినే పరిగణనలోకి తీసుకుంటోంది. దీనివల్ల భారీ వర్షాలు, హెలెన్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులు బీమా పరిహారాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
జిల్లాలో ఖరీఫ్ వరి సాగుకు సంబంధించి అక్టోబరు 20 తరువాత పంట కోత ప్రయోగాలు ఆరంభమయ్యాయి. ముందుగా సాగు చేసిన తూర్పు డెల్టాలో పంట కోత ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే అక్టోబరు 22 నుంచి వాయుగండం, ఈశాన్య రుతుపవనాలతో వారం పాటు కురిసిన భారీ వర్షాలు తూర్పు డెల్టా రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో వరి దెబ్బ తింది. అనంతరం నవంబరు మొదటి వారం నుంచి మధ్య డెల్టా, మెట్ట తదితర ప్రాంతాల్లో పంటకోత ప్రయోగాలు సాగాయి. పంటకోత ప్రయోగాలు 80 శాతం పూర్తయ్యాక హెలెన్ తుపాను బీభత్సం సృష్టించడంతో వరి పంట దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. వర్షాలు, తుపాన్ల దెబ్బకు జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది.
12 లక్షల టన్నుల నుంచి 4 లక్షలకు పతనమైన దిగుబడి
పంటకోత ప్రయోగాల అనంతరం అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఖరీఫ్ దిగుబడి జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి రావాల్సి ఉంది. విపత్తుల వల్ల దిగుబడి 4 లక్షల మెట్రిక్ టన్నులకు మించలేదు. దీనిలోనూ సగం రంగు మారిన, తేమ ధాన్యం కావడం గమనార్హం. తూర్పు డెల్టాలో ఎకరాకు 25 నుంచి 30 బస్తాలు, మధ్య డెల్టా, మెట్టల్లో ఎకరాకు 20 నుంచి 25 బస్తాల దిగుబడి వస్తుందని పంటకోత ప్రయోగాల్లో తేలింది. అయితే ప్రయోగాల అనంతరం దాపురించిన వర్షాలు, తుపాన్లతో మధ్య డెల్టాలో చాలా చోట్ల పది బస్తాల దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. దారుణంగా నష్టపోయిన రైతులు బీమా పరిహారంపై ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సవరించిన పంటల బీమా పథకంలో సుమారు రూ.217 కోట్లు పరిహారం అందిన విషయం తెలిసిందే. ఈసారి అంతకంటే ఎక్కువ నష్టపోయినా సగం కూడా పరిహారం వచ్చే అవకాశం కనబడడం లేదు. పథకం కొత్తదే అయినా బీమా కంపెనీ అధికారులు పంటకోత ప్రయోగాలకు వచ్చిన దిగుబడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే తుపాను వల్ల పంట తుడిచిపెట్టుకుపోయిన రైతులు బీమా పొందే అవకాశం లేకుండా పోతుంది.
దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారో?
సవరించిన బీమా పథకంలో నారుమళ్ల దశ నుంచి పంటను మార్కెట్‌కు తరలించే వరకు బీమా వర్తిస్తుందని ప్రభుత్వం, బీమా కంపెనీ చెప్పాయి. దీనిని నమ్మిన రైతులు ప్రీమియం 2.25 శాతం నుంచి 5.4 శాతానికి పెంచినా బీమా చేయించుకున్నారు. తీరా పాత విధానంతో లెక్కలు కట్టి పరిహారం చెల్లిస్తారని తెలియడంతో లబోదిబోమంటున్నారు. రైతులు ఆందోళనకు గురవడంతో ఇటీవల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే లక్షల ఎకరాల్లో పంటపోతే కేవలం ఒకటి రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల తమకు న్యాయం చేస్తారనే నమ్మకం కలగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు న్యాయం జరిగేలా ఏ పద్ధతిని పాటించి పంటనష్టం నమోదు చేస్తారో అటు వ్యవసాయ శాఖ అధికారులకు సైతం అంతుపట్టడం లేదు. తుపాను తరువాత కొన్నిచోట్ల మిగిలిన పంటకోత ప్రయోగాలను అధికారులు పూర్తి చేశారు. వీటిలో దిగుబడి పది బస్తాలకు మించడం లేదని గుర్తించారు. తుపాను తరువాత నిర్వహించిన పంటకోత ప్రయోగాలను పరిగణనలోకి తీసుకున్నా తమకు న్యాయం జరగదని తీరప్రాంత మండలాలకు చెందిన రైతులు చెబుతున్నారు. తమ ప్రాంతాల్లో వరిచేలు పడిపోవడంతో పాటు రోజుల తరబడి నీట నాని కుళ్లిపోయిందని, దీంతో కొందరు రైతులు కోతలు కోయించకుండా నేరుగా దమ్ములు చేయించారని చెబుతున్నారు. ఇలాంటి ఆయకట్లలో పంట నష్టం నమోదుకు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారనేది అర్థం కాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
అదే ప్రమాణమైతే పుట్టి మునిగినట్టే
Published Tue, Dec 17 2013 12:24 AM | Last Updated on Sat, Aug 11 2018 8:58 PM
Advertisement
Advertisement