మనకూ ఓ సంతాప దినం కావాలి!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ దేశస్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 14వ తేదీన జరుపుకుంటే భారత్ ఆగస్టు 15వ తేదీన జరుపుకుంటున్న విషయం తెల్సిందే. మన పాకిస్తాన్ తో యుద్ధం అనంతరం స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్ ఆగస్టు 15వ తేదీని జాతీయ సంతాప దినంగా జరుపుకుంటోంది. ఆగస్టు 15వ తేదీన ఆ దేశ ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, దేశ తొలి అధ్యక్షుడైన షేక్ ముజిబూర్ రహమాన్, ఆయన కుటుంబ సభ్యులను బంగ్లా సైనికాధికారుల బృందం దారుణంగా చంపివేయడమే కారణం.
దేశ స్వాతంత్య్రం ఖరారైన 1947, ఆగస్టు నెలలో భారత్, పాక్ ప్రాంతాల మధ్య మతకల్లోలాలు, ఘర్షణలు చెలరేగి ఇరువైపుల దాదాపు పది లక్షల మంది మరణించారు. ఈ సంఖ్య ఇరువై లక్షల వరకు ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. దేశ విభజన సందర్భంగా దాదాపు1.20 కోటి మంది సరిహద్దులు దాటి భారత్ నుంచి పాక్‌కు, పాక్ నుంచి భారత్‌కు వెళ్లారు. అప్పుడు మనతో కలిసి ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా అల్లర్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం కనుక దాని వెనకనున్న చీకటి కోణాన్ని మరచి పోవడమే మంచిదనుకొని భారత నాయకులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విభజన అల్లర్లను మరచి పోయారు.
జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. దాదాపు పది లక్షల మంది ప్రాణాలు పోయిన నేపథ్యాన్ని మరిచిపోయి ఎలా ఆనందంగా ఉండగలమని అన్నారు. 1947, జూలై 20వ తేదీన జరిగిన ఓ ప్రార్థనా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నేను ఆగస్టు 15వ తేదీన ఆనందంగా ఉండలేను. ఇది చెప్పకుండా మిమ్మల్ని మోసం చేయలేం’ అని అన్నారు. ఆగస్టు 15వ తేదీన ఉపవాసం దినంగా పాటించాలని అదే ఏడాది ఆగస్టు 8వ తేదీన జరిగే ఓ ప్రార్థనా సమావేశంలో గాంధీజీ సూచించారు. ఆనంద దినాలతోపాటు చీకటి రాత్రులను కూడా మరచిపోకూడదని, అందుకని దేశ విభజన సందర్భంగా మరణించిన వారి కోసం ఒక రోజును జాతీయ సంతాప దినంగా పాటించడం మంచిదని చరిత్రకారులు ఎప్పుడో చెబుతున్నారు. జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఇలాంటి జాతీయ సంతాప దినాలను పాటిస్తున్నాయి.
ఆగస్టు 15వ తేదీన జాతీయ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపుకుంటుందన్న, దేశ విభజన మ్యాప్ ఖరారైన ఆగస్టు 17వ తేదీని జాతీయ సంతాప దినంగా పాటించాలని చరిత్రకారులు సూచిస్తున్నారు. సిరిల్ ర్యాడిక్లిఫ్ ఈ మ్యాప్‌ను రూపొందించారు. ఈ విషాధంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు కూడా భాగం ఉన్నందున ఆ దేశాలు కూడా జాతీయ సంతాప దినాన్ని పాటించడం మంచిదంటున్నారు.