నీటి ప్రాజెక్టుల పూర్తికి నిపుణుల కమిటీ: కేసీఆర్
ముంబై: మహారాష్ట్ర, తెలంగాణల మధ్య నీటిప్రాజెక్టుల పూర్తికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నిర్ణయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు సమావేశమై నీటిప్రాజెక్టులపై చర్చించారు. అంతేకాకుండా భూసేకరణ, నష్ట పరిహారం, కోర్టు కేసుల పరిహారం, ముంపు ప్రజల అభ్యంతరాలపై నిపుణుల కమిటీ చర్చించనుంది. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పరస్పర సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో ముంపుకు గురయ్యే వారికి మహారాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
అనంతరం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాకు సహకరించాలని కేసీఆర్ ఫడ్నవీస్ ను కోరగా దానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా గోదావరిలో 160 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యే ప్రాంతాలను వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గా న్వేషణకు ఇద్దరు ముఖ్యమంత్రలూ అంగీకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...పొరుగు రాష్ట్రాలతో ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ పూరితంగా వ్యవహరించమని ఆయన పేర్కొన్నారు.