National school games
-
NSG: బాక్సింగ్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులకు పతకాలు
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “బాక్సింగ్ ” అండర్ -17, 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందం పతకాలు గెలుచుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్‌కు నాలుగు కాంస్యాలు దక్కాయి. ఈ సందర్భంగా.. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఈ బాక్సింగ్ పోటీలు జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఢిల్లీలో జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. పతకాలు గెలుచుకుంది వీళ్లే ►అండర్ 19- బాలికల (45-48 కేజీలు) విభాగంలో మొహ్మద్ హీనా కౌసర్ (నారాయణ జూనియర్ కాలేజీ ,విశాఖపట్నం)- కాంస్య పతకం. ►అండర్ 19- బాలికల (48-51 కేజీలు ) విభాగంలో కోలుసు నిహారిక (విశాఖ గవర్నమెంట్ జూనియర్ కాలేజి,విశాఖపట్నం )- కాంస్య పతకం. ►అండర్ 19- బాలికల (51-54 కేజీలు) విభాగంలో గంగవరపు అక్షిత (గవర్నమెంట్ జూనియర్ కాలేజి ,రాజమహేంద్రవరం,తూర్పు గోదావరి జిల్లా)- కాంస్య పతకం. ►అండర్ 17- బాలికల (46-48 కేజీలు) విభాగంలో మైలపిల్లి మేఘన (సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్ ,విశాఖపట్నం జిల్లా ) - కాంస్య పతకం. చదవండి: National School Games: ఆంధ్రప్రదేశ్ తైక్వాండో బృందానికి పతకాలు Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్ -
జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఏపీకి పతకాలు
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న నేషనల్ స్కూల్ గేమ్స్ షూటింగ్ పోటీల్లో బాలికల బృందం బంగారు పతకం సాధించింది. షూటర్లు తమన్యు సిరంగి (412.9), గొంటు లక్ష్మీ సమన్విత (410.4), ఆహాన రాఠీ (406.6) బృందం 1229.9 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. బాక్సింగ్‌లో ఆరు పతకాలు శుక్రవారం మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బాలుర బాక్సింగ్ అండర్–14, 17, 19 విభాగాల్లో ఏపీ విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. బోండా లక్ష్మణ్ (ఎస్వీఎల్ఎన్ఎస్ విద్యాపీఠ్ జూనియర్ కాలేజీ) రజతం, దాసరి ప్రవీణ్ కుమార్ (జీవీఎంసీ హైస్కూల్ , మాధవధార) కాంస్యం, జన్ని వసంతరావు (శ్రీ బాలాజీ జూనియర్ కళాశాల, భీమసింగి) కాంస్యం, ఆకుల అశోక్ కుమార్ (సోఫియా జూనియర్ కళాశాల, జ్ఞానపురం) కాంస్యం, ఆయుష్ (ఎంఏబీ పీ జూనియర్ కళాశాల, గాజువాక) కాంస్యం, దొంతల దేవస్వరూప్ (జేఎన్పురం, విజయనగరం జిల్లా) కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు అభినందించినట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏపీ కార్యదర్శి భానుమూర్తిరాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
నేషనల్ గేమ్స్‌కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థుల ఎంపిక
సాక్షి, విజయవాడ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 66వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 609 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి. భానుమూర్తి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్ నగరాల్లో జూన్ 6 నుండి 12 వరకు జరిగే ఈ పోటీల్లో అండర్ 19 బాలురు, బాలికలు 21 క్రీడా అంశాల్లో పోటీపడతారని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రం నుండి 306 మంది బాలురు, 303 మంది బాలికలు, 49 మంది కోచ్‌లు, 45 మంది మేనేజర్లు, నలుగురు హెడ్ అఫ్ ది డెలిగేట్లతో కలిపి మొత్తం 707 మంది పాల్గొననున్నారని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి, అంతర్ జిల్లాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడమైందని వివరించారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ కరువు భత్యం (డిఏ), స్పోర్ట్స్ కిట్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రం నుండి పాల్గొననున్న క్రీడాకారులు అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్ బాల్, జూడో, వాలీ బాల్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, ఖో ఖో, కబడ్డీ, చెస్, టెన్నిస్, హ్యాండ్ బాల్, షూటింగ్, జిమ్నాస్టిక్స్ వంటి 21 క్రీడాంశాల్లో పాల్గొంటారని భానుమూర్తి ప్రకటించారు. -
ఐశ్వర్య బృందానికి రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలికల స్క్వాష్ టోర్నమెంట్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఐశ్వర్య బిమల్ పయ్యాన్ ప్రాతినిధ్యం వహించిన ఐబీఎస్‌ఓ జట్టు రన్నరప్‌గా నిలిచింది. చండీగఢ్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఐబీఎస్‌ఓ జట్టు 5–11, 4–11, 5–11తో తమిళనాడు చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఐబీఎస్‌ఓ 11–8, 11–5, 11–6తో గుజరాత్‌పై గెలుపొందింది. -
ప్రియదర్శినికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–19 వెయిట్‌లిఫ్టింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి టి. ప్రియదర్శిని సత్తా చాటింది. హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో 48 కేజీల విభాగంలో ఆమె స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ప్రియదర్శిని స్నాచ్ విభాగంలో 62 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ కేటగిరీలో 83 కేజీలతో ఓవరాల్ 145 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచింది. ఈ విభాగంలో నూతన్ (మహారాష్ట్ర–125 కేజీలు), రమణ్‌దీప్ కౌర్ (పంజాబ్–123 కేజీలు) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. 44 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బి. రాజేశ్వరి రాణించింది. ఆమె ఫైనల్లో 103 (48+55) కేజీల బరువునెత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మహారాష్ట్రకు చెందిన రుతుజా ఠాకూర్ (121 కేజీలు) స్వర్ణాన్ని, తమిళనాడుకు చెందిన పూన్ గోడి (118 కేజీలు) రజతాన్ని గెలుచుకున్నారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తూముకుంట ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ పరిశీలకుడు శర్మ, తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు కోటేశ్వర్ రావు, కార్యదర్శి శ్రీనివాస్ రావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్. రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పరిశీలకుడు జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
తెలంగాణ జట్లకు టైటిల్స్
జాతీయ స్కూల్‌గేమ్స్ ఖోఖో కరీంనగర్ స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలికల ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు విభాగాల్లోనూ తెలంగాణ జట్లు విజయకేతనం ఎగురవేశారుు. కరీంనగర్ మండలం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో ఈ నెల 8 నుంచి జరుగుతున్న ఈ పోటీలు ఆదివారం ముగిశారుు. దేశంలోని 23 రాష్ట్రాల నుంచి 23 బాలుర, 22 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలుర విభాగంలో కర్ణాటక జట్టు రెండో స్థానంలో, మహారాష్ట్ర, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో ఢిల్లీ జట్టు రెండో స్థానంలో, కర్ణాటక, గుజరాత్ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. -
‘స్కూల్ గేమ్స్‌లో టెన్నికాయిట్ను చేర్చాలి’
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ గేమ్స్ క్రీడాంశాల జాబితాలో టెన్నికాయిట్ క్రీడను చేర్చాలని భారత టెన్నికాయిట్ సమాఖ్య (ఐటీఎఫ్) కోరింది. దేశ, విదేశాల్లో గ్రామీణ క్రీడగా పేరు పొందిన టెన్నికాయిట్ క్రీడ ప్రస్తుతం అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి గేమ్‌గా ఎదిగిందని ఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్.లక్ష్మీకాంత్ తెలిపారు. భారత్, జర్మనీ, దక్షిణాఫ్రికా దేశాల్లో మూడు టెన్నికాయిట్ వరల్డ్‌కప్ పోటీలను సమర్థంగా నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. శ్రీనగర్‌లో జరగనున్న జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) కార్యవర్గ సమావేశంలో టెన్నికాయిట్ క్రీడను అండర్-14, 17, 19 బాలబాలికల విభాగాల్లో చేర్చాలని కోరుతూ సమాఖ్య కార్యదర్శి డాక్టర్ రాజేష్ మిశ్రాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో టెన్నికాయిట్ అండర్-19 బాలబాలికల పోటీలను 2012, 2013 సంవత్సరాల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నిర్వహించారని ఆయన చెప్పారు. దేశంలో 27 రాష్ట్రాల్లో టెన్నికాయిట్ సంఘాలున్నాయని ఆయన తెలిపారు. టెన్నికాయిట్ క్రీడకు భారత ఒలింపిక్ అసోసియేషన్, కేంద్ర క్రీడాశాఖ గుర్తింపు ఉందని ఆయన చెప్పారు. దీంతో ఎస్జీఎఫ్ఐలో టెన్నికాయిట్ను చేర్చాలని లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు. -
ఏపీ బాలికల జట్టుకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ ఆర్చరీ పోటీల్లో (అండర్-17) ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు రెండో స్థానం సొంతం చేసుకుంది. ఇండియన్ రౌండ్ టీమ్ విభాగంలో ఏపీ ఓవరాల్‌గా 1675 పాయింట్లు స్కోర్ చేసింది. ఎస్. హేమని, సుష్మ, డి. పావని, డి. సువర్ణ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఇదే ఈవెంట్లో జార్ఖండ్ (1796) మొదటి స్థానంలో నిలవగా, పంజాబ్ (1666)కు మూడో స్థానం దక్కింది. అండర్-17 బాలుర విభాగంలో జార్ఖండ్ (1918 పాయింట్లు) మొదటి స్థానంలో నిలిచింది. గుజరాత్ (1841), హర్యానా (1839) ఆ తర్వాతి స్థానాలు అందుకున్నాయి. అండర్-17 బాలికల వ్యక్తిగత విభాగంలో అంకిత భక్త్ (బెంగాల్-619 పాయింట్లు) తొలి స్థానం అందుకోగా, భారతి మహతో (జార్ఖండ్-608) రెండు, సింపీ కుమారి (జార్ఖండ్-606) మూడో స్థానాల్లో నిలిచారు. అండర్-17 బాలుర వ్యక్తిగత విభాగంలో కరణ్ హన్సా (జార్ఖండ్-651 పాయింట్లు) విజేతగా నిలిచాడు. శివకుమార్ (జార్ఖండ్-651), జగదీశ్ చౌదరి (రాజస్థాన్-647)లు రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. -
రోషన్ సింగ్‌కు స్వర్ణం
రాయదుర్గం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ గేమ్స్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు మణిపూర్ విలుకాండ్లు సత్తా చాటారు. అండర్-14 బాలబాలికల విభాగాల్లో ఆ జట్టుకు రెండు స్వర్ణాలు దక్కాయి. రాష్ట్ర విద్యాశాఖ, పాఠశాల క్రీడల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఐదు రోజుల పాటు చాంపియన్‌షిప్ నిర్వహిస్తారు. అండర్-14, అండర్-17 వయో విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 467 మంది బాలబాలికలు పాల్గొంటున్నారు. అంతకు ముందు పోటీలను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రారంభించారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, కేవలం ఇంజినీరింగ్, మెడిసిన్లపైనే కాకుండా క్రీడల వైపు కూడా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి, ఏపీ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ ఫలితాలు: ఇండియన్ రౌండ్ (30మీ): బాలుర విభాగం: 1.రోషన్ సింగ్ (342 పాయింట్లు -మణిపూర్), 2.అనురాగ్ (337-మహారాష్ట్ర), 3.విక్రమ్ (334-హర్యానా). బాలికల విభాగం: 1.ఎల్.టామ్తిన్ గన్బీ 325 పాయింట్లు (మణిపూర్), 2. సుర్జోబన్కిరా (316-జార్ఖండ్), 3.అలింపికా గొగోయ్ (315-అస్సాం). సౌకర్యాలపై అసంతృప్తి స్కూల్‌గేమ్స్ ఆర్చరీ పోటీల నిర్వహణలో ఏర్పాటు చేసిన వసతుల పట్ల క్రీడాకారులు, కోచ్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలోనే వీరికి వసతి ఏర్పాటు చేశారు. అయితే ఒకే గదిలో ఐదు రాష్ట్రాలకు చెందిన 125 మందిని ఉంచడం చాలా సమస్యగా ఉందని వారు వాపోయారు. గదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేవని, పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన ఆర్చరీ సామగ్రిని భద్రపరిచేందుకు కూడా ఏర్పాట్లు లేవన్నారు. భోజనం కూడా ఏ మాత్రం బాగా లేదని గుజరాత్ కోచ్‌లు తమ బాధను వ్యక్తం చేశారు. మరో నాలుగు రోజులు క్రీడలు ఉన్నందున కనీసం ఇప్పుడైనా సౌకర్యాలు మెరుగు పర్చాలని వారు కోరారు.