రాయదుర్గం, న్యూస్‌లైన్: జాతీయ స్కూల్ గేమ్స్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు మణిపూర్ విలుకాండ్లు సత్తా చాటారు. అండర్-14 బాలబాలికల విభాగాల్లో ఆ జట్టుకు రెండు స్వర్ణాలు దక్కాయి. రాష్ట్ర విద్యాశాఖ, పాఠశాల క్రీడల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఐదు రోజుల పాటు చాంపియన్‌షిప్ నిర్వహిస్తారు. అండర్-14, అండర్-17 వయో విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 467 మంది బాలబాలికలు పాల్గొంటున్నారు.
అంతకు ముందు పోటీలను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రారంభించారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని, కేవలం ఇంజినీరింగ్, మెడిసిన్‌లపైనే కాకుండా క్రీడల వైపు కూడా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి, ఏపీ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్ ఫలితాలు: ఇండియన్ రౌండ్ (30మీ): బాలుర విభాగం: 1.రోషన్ సింగ్ (342 పాయింట్లు -మణిపూర్), 2.అనురాగ్ (337-మహారాష్ట్ర), 3.విక్రమ్ (334-హర్యానా).
బాలికల విభాగం: 1.ఎల్.టామ్‌తిన్ గన్బీ 325 పాయింట్లు (మణిపూర్), 2. సుర్జోబన్‌కిరా (316-జార్ఖండ్), 3.అలింపికా గొగోయ్ (315-అస్సాం).
సౌకర్యాలపై అసంతృప్తి
స్కూల్‌గేమ్స్ ఆర్చరీ పోటీల నిర్వహణలో ఏర్పాటు చేసిన వసతుల పట్ల క్రీడాకారులు, కోచ్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలోనే వీరికి వసతి ఏర్పాటు చేశారు. అయితే ఒకే గదిలో ఐదు రాష్ట్రాలకు చెందిన 125 మందిని ఉంచడం చాలా సమస్యగా ఉందని వారు వాపోయారు. గదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేవని, పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన ఆర్చరీ సామగ్రిని భద్రపరిచేందుకు కూడా ఏర్పాట్లు లేవన్నారు. భోజనం కూడా ఏ మాత్రం బాగా లేదని గుజరాత్ కోచ్‌లు తమ బాధను వ్యక్తం చేశారు. మరో నాలుగు రోజులు క్రీడలు ఉన్నందున కనీసం ఇప్పుడైనా సౌకర్యాలు మెరుగు పర్చాలని వారు కోరారు.
రోషన్ సింగ్‌కు స్వర్ణం
Published Mon, Jan 20 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement