గుర్తింపు కార్డులివ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
కొవ్వూరు: కృష్ణా పుష్కరాలకు వచ్చే పురోహితులకు పూర్తిస్థాయిలో గుర్తింపుకార్డులివ్వడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ విమర్శించారు. కొవ్వూరులోని పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అనుపిండి చక్ర«దరరావు నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది గుర్తింపుగల పురోహితులుంటే ప్రభుత్వం 4 వేల మందికి మాత్రమే కార్డులు ఇస్తుందన్నారు.
కొన్ని ఘాట్లలో మాత్రమే పురోహితులు విధులు నిర్వహించాలన్న నిబంధనలను హైకోర్టు సడలించిందన్నారు. విజయవాడలో హిందూ ఆలయాలు కూల్చిన చోట మరుగుదొడ్లు నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పురోహితుల స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం హరించాలని చూడడం, కొన్ని ఘాట్లకే పరిమితం చేయడం సరికాదని చక్రధరరావు అన్నారు. సంఘం కార్యదర్శి పిల్లలమర్రి మురళీకృష్ణ, కోశాధికారి హెచ్ఎస్ఎస్ జగన్నాథరావు పాల్గొన్నారు.