National table tennis
-
జాతీయ టీటీ శిబిరానికి స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అతను పాటియాలా లోని జాతీయ క్రీడా శిక్షణా శిబిరానికి ఎంపికయ్యాడు. టేబుల్ టెన్నిస్ జూనియర్స్ కేటగిరీలో భారత నెం.2 ఆటగాడైన స్నేహిత్ స్లోవేనియా జూనియర్ ఓపెన్ టీటీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ టోర్నీకి సన్నాహకంగా సెప్టెంబర్ 17 వరకు పాటియాలాలో నిర్వహించే కోచింగ్ క్యాంప్‌నకు అతను హాజరు కానున్నాడు. సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు స్లోవేనియా జూనియర్ ఓపెన్ టీటీ టోర్నీ జరుగుతుంది. -
స్నేహిత్, హరి, ఆయుషిలకు కాంస్యాలు
అజ్మీర్: నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు. ఆదివారం ముగిసిన జాతీయ క్యాడెట్, సబ్ జూనియర్ పోటీల్లో సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో ఫిడేల్ రఫీక్ స్నేహిత్, వి.ఎస్.హరికృష్ణ... క్యాడెట్ బాలికల సింగిల్స్ విభాగంలో ఆయుషి ఘియా కాంస్య పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ సెమీఫైనల్స్‌లో ఓడిపోయారు. సబ్ జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో నైనా జైస్వాల్-శైలూ నూర్ బాషా జోడి రజత పతకాన్ని దక్కించుకుంది. 2003లో శుభమ్ శర్మ తర్వాత సబ్ జూనియర్ బాలుర సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పతకాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. బాలికల డబుల్స్ ఫైనల్లో నైనా-శైలూ ద్వయం 4-11, 9-11, 10-12తో యశిని-దీప్తి (తమిళనాడు) జంట చేతిలో ఓటమిపాలైంది. సబ్ జూనియర్ బాలుర సెమీఫైనల్స్‌లో స్నేహిత్ 2-4 (12-10, 6-11, 6-11, 12-10, 7-11, 4-11)తో భారత రెండో ర్యాంకర్ ఆకాశ్ నాథ్ (బెంగాల్) చేతిలో; హరికృష్ణ 1-4 (10-12, 7-11, 11-9, 8-11, 7-11)తో భారత నంబర్‌వన్ మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓటమి చవిచూశారు. క్యాడెట్ బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుషి 1-3 (12-10, 9-11, 6-11, 11-13)తో స్వస్తిక ఘోష్ (మహారాష్ట్ర) చేతిలో పరాజయం పాలైంది. -
టీటీలో ఏపీ క్రీడాకారిణుల హవా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణుల హవా కొనసాగుతుందని అంతర్జాతీయ టీటీ కోచ్ మిహిర్ ఘోష్ అన్నారు. గ్లోబల్ టీటీ అకాడమీ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన రాష్ట్ర ర్యాంకింగ్ టీటీ టోర్నీ ఆరంభ వేడుకలకు ఆయన ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ... ‘గత నాలుగేళ్లలో రాష్ట్రం నుంచి అద్భుతమైన ప్లేయర్లు వచ్చారు. జాతీయ స్థాయిలో నిఖత్ బాను, స్ఫూర్తి, నైనా, శ్రీజలు చక్కటి నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. భవిష్యత్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. క్రీడాకారు లు ఆటపట్ల అంకితభావం కనబరచాలని శాప్ ఎండీ రాహుల్ జొజ్జా అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ టి.వి.ఎస్.చంద్రశేఖర్, అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసీమ్, ఏపీటీటీఏ జీవితకాలం అధ్యక్షుడు చెంచు రామయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.